దోచుకున్నది దాచుకోవడానికే బాబు విదేశీ పర్యటనలు

–రహస్య పర్యటనల వెనుక ఉన్న అంతర్యం ఏంటో?
–ఎంట్రీ ఫీజు చెల్లించి దావోస్‌ వెళ్లాల్సిన అవసరం ఏముంది?
– విదేశీ పర్యటనలతో సాధించింది ఏంటీ?
–వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో దోచుకున్నది దాచుకోవడానికి తరుచు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇప్పటి వరకు 16 సార్లు విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు ఏ మేరకు పెట్టుబడులు తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. సీఎం పర్యటనలకు అయిన ఖర్చు ఎంతో ప్రజలకు చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం దావోస్‌ వెళ్లిన చంద్రబాబు అక్కడికి వెళ్లేందుకు రూ.3.22 లక్షల డాలర్లు ఎంట్రీ ఫీజు చెల్లించారని తెలిపారు. అంత డబ్బు పెట్టి ఆ దేశంలో పర్యటించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బాబు దావోస్‌ పర్యటనపై టీడీపీ అనుకూల పత్రికలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అక్కడ పోలవరం ప్రాజెక్టులో విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని అసత్యాలు ప్రసారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు సింగపూర్, రష్యా, జపాన్, స్విడ్జర్‌ల్యాండ్, దావోస్, ఇటీవల శ్రీలంక దేశాల్లో పర్యటించారని, అప్పుడు కూడా ఎల్లో మీడియా ఇలాగే తప్పుడు ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమ ఏపీకి రాలేదని విమర్శించారు. ఇప్పటికి 16 సార్లు ప్రత్యేక విమానాల్లో, మందీ మార్బలంతో విదేశీ యాత్రలు చేసి విందులు, ప్రత్యేక విమానాలకు వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అయితే ఒక్క పైసా కూడా పెట్టుబడులు రాలేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గతంలో కూడా విశాఖపట్నంలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అప్పట్లో 361 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని, రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని బాబు బడాయి చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.

దేశంలోనే బాబు సంపన్న ముఖ్యమంత్రి
దేశంలోనే చంద్రబాబు సంపన్న ముఖ్యమంత్రి అని వికిలీక్స్‌ పత్రిక తేల్చిందని అంబటి రాంబాబు తెలిపారు.  అక్రమార్జనను దాచుకునేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని, రహస్య పర్యటనలతో స్విస్‌బ్యాంకును మేనేజ్‌ చేశారని ఆయన విమర్శించారు. ఒక రాష్ట్రానికిముఖ్యమంత్రి అయిన వ్యక్తి దేశానికి ప్రధాని అయినట్లు విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే దేశం అనుమతి ఉండాలన్న జ్ఞానం కూడా లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. బాబు రహస్య పర్యటనల వెనుక ఉన్న అసలు రహస్యం బహిర్గతం చేయాలన్నారు. ఆయన ఎక్కడెక్కడ తిరిగారో తన పాస్‌పోర్టుపై ఏయే దేశాల స్టాంపులు పడ్డాయో ప్రజలకు చూపించాలని, ఇప్పటి వరకు ఏ మేరకు పెట్టుబడులు తీసుకువచ్చారో, ఎంత డబ్బు ఖర్చు చేశారో లెక్కలు చూపాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

రాజధాని రంగుల చిత్రమే
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరుతో బాబు దోపిడీకి తెర లేపారని, ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గతంలో హిట్‌ అయిన బహుబలి సినిమా సెట్టింగ్‌లతో అమరావతి నిర్మించేందుకు దర్శకుడు రాజమౌళితో చర్చలు జరుపుతామని, ఇప్పుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం దర్శకుడితో మాట్లాడి ఆ సినిమా సెట్టింగులు అమరావతిలో ఏర్పాటు చేయాలని సూచించారట. అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, కేవలం రంగుల చిత్రంగా మార్చారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. వరుస కరువులతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకులతో రుణాలు ఇప్పించాల్సి పోయి తన సొంత సంస్థ హెరిటేజ్‌ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు బ్యాంకు ఆఫ్‌ బరోడాతో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గమన్నారు.సొంత పనులు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయకపోతే బాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు.
 
Back to Top