సీమ ప్రాజెక్టులపై బాబు కపట ప్రేమ

కర్నూలు:  రాయలసీమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. రాయితీపై మంజూరైన మినీ ట్రాక్టర్‌ను మంత్రాలయానికి చెందిన రైతు భీమయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తీవ్ర కరువుతో రైతులు నష్టపోయినా ప్రభుత్వం చలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటనష్ట పరిహారం మంజూరులో జాప్యం చేస్తూ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో కోసిగి, కౌతాళం మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించకుండా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. 

రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని కన్నీటి పాలు చేయడం టీడీపీకే దక్కిందన్నారు. అమరావతి పేరుతో రియల్‌ దందాలకు దిగిన చరిత్ర తమ్ముళ్లకే చెల్లిందన్నారు. నోట్ల రద్దుతో జనం అల్లాడిపోతున్నా ప్రభుత్వం నోరుమెదపక పోవడం దారుణమన్నారు. సాగునీటి పథకాలు సకాలంలో పూర్తిచేయడంలో విఫలమైందన్నారు. ముఖ్యంగా రూ.30 కోట్లతో పూర్తయ్యే పులికనుమ ప్రాజెక్టు నిర్మాణం మరిచిపోవడం బాధాకరమన్నారు.  వలసల నివారణ చర్యలు చేపట్టడంలోనూ పాలన గతి తప్పిందన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శివకుమార్, రాజు పాల్గొన్నారు. 
Back to Top