వైయస్‌ జగన్‌పై బాబు కుట్ర

  • నాడు రాజారెడ్డిని చంపించింది చంద్రబాబే
  • అప్పట్లో వైయస్‌ఆర్‌పై..ఇప్పుడు వైయస్‌ జగన్‌పై అసత్య ప్రచారం
  • పొగడ్తలు అడుక్కునే బిచ్చగాడిలా బాబు
  • వైయస్‌ఆర్‌ పాలన ఓ సువర్ణయుగం
  • బాబువి ఉత్తర కుమార ప్రగల్భాలు
  • వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని భౌతికంగా నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్ట్ పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేసి గప్పాలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.  కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని  కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబుకు తన పనితనం మీద తనకే నమ్మకం లేదని అన్నారు. అందుకే  ఏ సభకు వెళ్లినా ‘‘గట్టిగా చప్పట్లు కొట్టాలని, , నా కొరకు ప్రార్థనలు చేయాలని, నన్ను గుర్తుంచుకోండి,  నన్ను తలుచుకోండి’’ అంటూ ప్రజలతో ప్రమాణాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  ‘పొగడ్తలు అడుక్కునే బిచ్చగాడిలా చంద్రబాబు దిగజారిపోయారని మండిపడ్డారు. 

ఒక్క ప్రజా హిత కార్యక్రమం కూడా చేయడం లేదని, బాబు మాటల మీద, చేతల మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకం, ప్రేమ, అభిమానం లేవన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం బాబు గప్పాలు కొంటుకుంటున్నారని నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో సంక్షేమం, ప్రజాసేవ తప్ప ఏనాడు వ్యక్తిగత ప్రచారం చేసుకోలేదన్నారు. వైయస్‌ఆర్‌ పాలన ఓ సువర్ణయుగమని కొనియాడారు. నాడు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాయి. అందుకే మహానేతను ఇప్పటికీ జనం గుండెల్లో పెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌ అడుగకపోయినా ఊరూరా ప్రజలు విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. నాడు సువర్ణయుగమని ప్రజలు తన్మయత్వంలో మునిగి తేలారన్నారు. మహానేత అకాల మరణంతో అనేక గుండెలు ఆగిపోయాయని, కన్నీళ్లే గోదావరిగా మార్చారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ ఏ సభలోనూ చప్పట్లు కొట్టండని కోరలేదన్నారు. కానీ చంద్రబాబు నర్తనశాల సినిమాలో మహాభారతం, విరాటపర్వం సన్నివేశంలో ఉత్తరకుమారుడు కౌరవుల మీదకు దండెత్తి వచ్చినట్లు చంద్రబాబు కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి పోల్చి చెప్పారు.

బాబువి హత్యారాజకీయాలు
చంద్రబాబువి హత్యా రాజకీయాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైయస్‌ రాజారెడ్డిని చంపించింది చంద్రబాబే అని ఆరోపించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టుల గురించి ఒక్క రోజు కూడా ఆలోచించలేదన్నారు. సాగునీటికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. వ్యవసాయం దండగ అన్న బాబు రైతుల సంక్షమాన్ని పట్టించుకోకుండా పోయింది కాక, వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉచితంగా కరెంటు ఇస్తామంటే నాడు అవహేళన చేశారని గుర్తు చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు 10 శాతం పనులు పూర్తి చేసి వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ మీ కాళ్లకు మీరే మొక్కుకుంటారా? అని భూమన ప్రశ్నించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే నాడు కడుపు మండి విమర్శలు చేసిన టీడీపీ నేతలు ప్రజల జ్ఞాపకశక్తిపై దాడి చేసే కార్యక్రమాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మహానేతను గుండాగా, రౌడీగా, హంతకుడిగా చిత్రీకరించి ప్రజల్లో భయాందోళన కలిగించారని, అయితే జనం వీరి మాటలు వినకుండా వైయస్‌ఆర్‌ను తమ గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారన్నారు. మహానేత చనిపోతే ఆ మరణాన్ని తట్టుకోలేక 620 మందికి పైగా గుండెలు ఆగిపోయాయని, చరిత్రలో ఎక్కడా ఇలాంటి ఘటన జరుగలేదని భూమన చెప్పారు. వైయస్‌ఆర్‌పై అబద్ధాలు చెప్పినట్లుగానే నేడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కూడా అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ను తిట్టడానికి ప్రాంతాలకు, నియోజకవర్గాలకు సంబంధం లేని కవి బోడప్పలను మించిన వారిని  రప్పించి కులాలపై రెచ్చగొడుతూ...తిక్కల రెడ్లను ఉసిగొల్పారని మండిపడ్డారు. హింసాయుత రాజకీయాల గురించి ఒక్క రోజు కూడా మాట్లాడని వైయస్‌ జగన్‌పై ఇంతటి దారుణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. కుల రాజకీయాలను పెంచి పోషించే విత్తులో చంద్రబాబు మహావృక్షమయ్యారని అభివర్ణించారు. ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చకుండా వైయస్‌ఆర్‌ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ను మళ్లీ జైలుకు పంపాలని మీరు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు అన్నీ తెలుసన్నారు. మీరు చేస్తున్న అరాచక రాజకీయాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

తాజా ఫోటోలు

Back to Top