చంద్రబాబు నైజం మరోసారి బట్టబయలైంది..

01–06–2018,

శుక్రవారం, ఉల్లంపర్రు, పశ్చిమగోదావరి జిల్లా ,

శ్రీరాముడు, సీతమ్మవార్ల స్వహస్తాలతో
ప్రతిష్టితమైన క్షీరారామలింగేశ్వరస్వామి కొలువైన ప్రసిద్ధ పంచారామక్షేత్రం.. ఎందరో
మహామహులైన కళాకారులకు జన్మస్థలం.. బ్రిటీష్‌ కాలం నుంచే ప్రముఖ వాణిజ్య కేంద్రం
అయిన పాలకొల్లు మీదుగా పాదయాత్ర సాగడం సంతోషాన్నిచ్చింది. కానీ.. నేటి పాలకుల
అవినీతితో, నిర్లక్ష్యంతో
ఆ వైభవం మసకబారడం బాధనిపించింది. 1930లలోనే ఈ ప్రాంత ప్రజలందరికీ
పుష్కలంగా రక్షిత మంచినీటి సరఫరా చేసిన ఘన చరిత్ర కలిగిన పాలకొల్లు మున్సిపాలిటీ..
నేడు తాగునీటి కోసం ఎండమావుల వైపు పరిగెత్తడం శోచనీయమే.


నిట్టూర్పుల మధ్యనే ఓ అవ్వ చెప్పిన మాటలు మనసుకు సాంత్వన కలిగించాయి. నిరుపేద
నాయీబ్రాహ్మణ కుటుంబానికి చెందిన అవ్వ రామేశ్వరపు లక్ష్మి.. ‘పదేళ్ల కిందట ఆరోగ్య శ్రీలో
నాకు గుండె ఆప రేషన్‌ జరిగింది. మీ నాన్నగారి వల్లే నా ప్రాణాలు నిలబడ్డాయి’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. ‘సొంతవాళ్లే పట్టించుకోని ఈ
రోజుల్లో ఆపరేషన్‌ తర్వాతా నా యోగక్షేమాలు ఆరా తీయడంతో పాటు ఏమైనా ఇబ్బందులుంటే
చెప్పాలంటూ మీ నాన్నగారు లేఖ కూడా రాశారు’ అని సంబరపడింది. మాలాంటి
పేదవారి కోసం ఎంతగా తపనపడ్డాడో చూడు బిడ్డా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నాన్నగారిని
గుండెల్లో పెట్టుకుంటూ పదేళ్ల కిందట ఆయన రాసిన లేఖను సైతం పటం కట్టి భద్రంగా
దాచుకున్న ఆ అవ్వ అభిమానానికి ముగ్ధుడినయ్యాను. 

మరికాస్త దూరం నడవగానే.. ‘చంద్రబాబు ప్రభుత్వం దళిత, బలహీనవర్గాల సంక్షేమ
హాస్టళ్లపై చిన్నచూపు చూస్తోందన్నా’ అంటూ వాపోయారు దళిత విద్యార్థి
సంఘ ప్రతినిధులు. ‘రాష్ట్రంలో
ఇప్పటికి 653 ఎస్సీ హాస్టళ్లు మూసేశారన్నా. ఒక్క పాలకొల్లులోనే 24 ఉంటే 13 మూతబడ్డాయి. విద్యార్థుల
సంఖ్య తక్కువగా ఉందని కుంటిసాకులు చెబుతున్నారు. వీటి స్థానంలో రెసిడెన్షియల్‌
స్కూళ్లు కడతామని నమ్మబలికారు. కానీ ఇప్పటిదాకా ఒక్కటీ కట్టిన పాపాన పోలేదు.
హాస్టళ్ల మూత వల్ల మధ్యలో చదువు ఆపేసిన పేద విద్యార్థుల సంఖ్య పెరిగింది.
హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఈ సర్కారే కారణం. నాణ్యమైన తిండి ఉండదు..
అవసరమైన బడ్జెట్‌ అంతకన్నా ఇవ్వదు. మౌలిక వసతుల మాట దేవుడికే తెలియాలి.ప్రభుత్వం
విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి.. తన బినామీలైన ప్రయివేటు విద్యాసంస్థల
యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చే కుట్రలో భాగం కాదా ఇది’ అంటూ ఆగ్రహం వ్యక్తం
చేశారు. అక్రమ సంపాదన మత్తులో మునిగితేలుతున్న ఈ పెద్దలకు దళితుల, బలహీనవర్గాల విద్యార్థుల
సంక్షేమం గురించి ఆలోచన ఎందుకుంటుంది?

నిరుద్యోగ
భృతి పేరుతో చంద్రబాబు చేసే గారడీపై యువత మండిపడటం ఈ రోజు స్వయంగా చూశాను.
పాలకొల్లు దగ్గర కలిసిన యువకులు ఆగ్రహంతో ఊగిపోతూ ‘ఈ మోసగాడు మళ్లీ దగా
చేశాడన్నా..’ అంటూ
మొదలెట్టారు. ‘గెలిస్తే
నెలకు రూ.2000 భృతి ఇస్తానని చెప్పాడన్నా.. నాలుగేళ్లు దాటినా ఆ ఊసే
ఎత్తని చంద్రబాబు.. పాదయాత్రలో మీరు మరీమరీ నిలదీస్తుండటంతో, ఆరు నెలల్లో
ఎన్నికలొస్తున్నాయన్న తరుణంలో మరోసారి వంచనకు ప్రణాళిక సిద్ధం చేశాడు’ అని తెలిపారు. ఇచ్చేది
ముష్టి వేసినట్లు వెయ్యి రూపాయలంటూ నిట్టూర్చారు. సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల
సంఖ్యను కుదించడంతో పాటు.. అర్హుల ఎంపికలో జన్మభూమి కమిటీ తరహాలో వివక్ష చూపుతారని
ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం అబద్ధాలతో, మోసాలతో ప్రజలను
మభ్యపెట్టాలనుకునే చంద్రబాబు నైజం మరోసారి బట్టబయలైంది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాలుగున్నర దశాబ్దాలుగా
బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలచిన సంక్షేమ హాస్టళ్లు.. కేవలం మీ హయాంలోనే
సగానికి పైగా ఎందుకు మూతపడ్డాయి? హాస్టళ్ల స్థానంలో కొత్త
రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మిస్తామన్న మీ కట్టుకథ ఏమైంది? ఇప్పటి వరకూ ఏ ఒక్కటైనా
నిర్మించిన దాఖలా ఉందా? ఉన్నవి
మూతపడి.. మీరన్న కొత్త ఆశ్రమ పాఠశాలలూ రాక.. పేద విద్యార్థులు రోడ్డునపడటం వాస్తవం
కాదా? 

-వైఎస్‌ జగన్‌


తాజా వీడియోలు

Back to Top