అర్థరాత్రి చంద్రబాబు దొంగపనులు

అసెంబ్లీ మీడియా పాయింట్ః ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేకహోదా కావాలని కోరుతుంటే...చంద్రబాబు, ఆయన మంత్రులు మాత్రం ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. హోదాపై చర్చకు పట్టుబడితే...మందబలం చూసుకొని అధికార టీడీపీ మార్షల్స్ తో తమను సభనుంచి బయటకు నెట్టివేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు అడుగడుగునా దగా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 

హోదా కోసం ఆత్మార్పణకు సిద్ధం
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ప్రత్యేకహోదా కోసం బలిపీఠం ఎక్కేందుకు కూడా తామంతా సిద్ధమే అని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. శాంతియుతంగా సభలో నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం మార్షల్స్‌తో మమ్మల్ని నెట్టించి అవమానపరిచిందన్నారు. ప్రజల అభీష్టం మేరకే మేం సభలో ఆందోళన చేపడుతున్నామని, సస్పెన్షన్‌కు భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే..చంద్రబాబు, ఆయన కేబినెట్‌ మంత్రులు మాత్రం ప్యాకేజీ కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి డబ్బులు వస్తే తన బినామీలకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి సొమ్ము చేసుకోవచ్చు అని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ బిడ్డల భివిష్యత్‌ కోసం హోదా అవసరమని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటే ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీలో రెండు సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసిన హోదా విషయంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మరోమారు చర్చిద్దామని మేం డిమాండ్‌ చేస్తే..ప్రభుత్వం ముందుగా స్టేట్‌మెంట్‌  ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటన చేసిన తరువాత చర్చించేందుకు ఏముంటుందని ప్రశ్నించారు. మార్షల్స్‌పై మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తమపైనే మార్షల్స్‌ దాడి చేశారని పేర్కొన్నారు.

మార్షల్స్‌ను పెట్టాల్సిన అవసరం ఏముంది
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
అసెంబ్లీలో స్పీకర్‌ పోడియం వద్ద మార్షల్స్‌ను పెట్టాల్సిన అవసరం ఏముందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర శ్రేయస్సు, యువత భవిష్యత్‌ కోసం తాము సభలో, బయట పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. దగా చేసిన కేంద్ర ప్రభుత్వంపై, నయవంచన చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై తాము ఉద్యమిస్తున్నామన్నారు. సభలో స్పీకర్‌ పోడియం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మార్షల్స్‌ను పెట్టి లాగిపడేసే ప్రయత్నం చేశారని తెలిపారు. స్పీకర్‌ పోడియం ఎదుట నిరసన తెలపడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఎవరైన సభ్యులు సస్పెన్షన్‌కు గురైతే మార్షల్స్‌ వస్తారని, ఇవాళ ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని, హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకు సర్కార్‌ కుట్ర చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలు తిరగబడితే ఎలాగుంటుందో కాంగ్రెస్‌కు తెలుసు అని, అదే గతి టీడీపీకి పడుతుందని చెవిరెడ్డి హెచ్చరించారు.

హోదాపై సుదీర్ఘ చర్చ జరగాలి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడితే చంద్రబాబు ఎందుకు పారిపోతున్నారని ఆయన నిలదీశారు. అధికారం, మందబలం ఉందనే పదేపదే సభను వాయిదా వేస్తూ హోదా అంశాన్ని నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో రెండు సార్లు హోదా కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అంశంపై చర్చ జరుపుదామంటే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు. హోదా సాధనే వైయస్‌ఆర్‌సీపీ ధ్యేయం. ఇందు కోసం తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారని గుర్తు చేశారు.

అర్థరాత్రి దొంగపనులు దేనికోసం బాబూ
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర
లోపాయికారి ఒప్పందాలు చేసుకొని అర్థరాత్రి దొంగచాటుగా ప్యాకేని ప్రకటించడం దేనికోమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాడు అర్థరాత్రి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇవాళ మళ్లీ అర్థరాత్రి ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.  చంద్రబాబు అంగీకారాల వల్లే అర్థరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించాలన్న ఉద్దేశ్యంతో తాము నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే....అధికార టీడీపీ మార్షల్స్ ను తీసుకొచ్చి ప్రతిపక్ష సభ్యులను బయటకు తోసేయడం దారుణమ్ననారు. తమపై దాడి చేయించి... మార్షల్స్ పై విపక్ష ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ అబంఢాలు వేస్తున్నారని ఆగ్రహించారు. స్పీకర్ కు తమ భావాన్ని చెబుతుంటే తమ నాయకుడిపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి వెంకన్నసాక్షిగా మోడీ, బాబు, వెంకయ్యలు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఏపీ ప్రజలకు నామాలు పెట్టారని ఆరోపించారు, ముఖ్యమంత్రి, మంత్రులు స్టేట్ మెంట్ లు ఇవ్వడం తప్ప చర్చకు అవకాశం ఇవ్వరు. తాము చెప్పేది వినరు. మైక్ కట్ చేస్తారు. లేకుంటే సస్పెండ్ చేస్తున్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వం మరొకటి లేదని నిప్పులు చెరిగారు.
Back to Top