బాబు వస్తారు.. భారం వేస్తారు

బాబు వస్తారు.. భారం వేస్తారు 

సీఎం సభల ఖర్చుపై అధికారుల అంతర్మథనం

నేడు మళ్లీ చంద్రబాబు రాక
అభివృద్ధి పనులకు పైసా ఇవ్వని ప్రభుత్వం
ముఖ్యమంత్రి పర్యటనలకు భారీగా ఖర్చు
రవాణాశాఖకే * 50 లక్షల బకాయిలు
ఆర్‌అండ్‌బీ, పౌరసరఫరాల విభాగాలదీ అదే పరిస్థితి

 
ముఖ్యమంత్రి సభల భోజన ఏర్పాట్లకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. చేతి నుంచి డబ్బులు పెట్టాం. ఎప్పుడిస్తారో తెలియదు.. మళ్లీ సీఎం సభ అట.. అసలు ముఖ్యమంత్రి సభలంటేనే భయమేస్తోంది. మీకు చెబితే పేపర్లో రాస్తారు.. ఆ కలెక్టర్‌తో మాకే చీవాట్లు.. ఓ అధికారి ఆవేదన ఇది.
 
పాత బకాయిలు రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయి. మళ్లీ ముఖ్యమంత్రి సభకు 1200 బస్సులు పెట్టమంటున్నారు... రావాల్సిన బిల్లుల సంగతి అడిగితే మాత్రం పలకడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిధులు లేనప్పుడు * కోట్లు ఖర్చు పెట్టి సభలెందుకో..?  ..ఇది మరో అధికారి మనోవేదన.
 
గత సభలకు వేసిన షామియానాలు, కుర్చీల డబ్బులే ఇంతవరకు అందలేదు. డబ్బులివ్వలేదని కాంట్రాక్టర్లు పలకడం లేదు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి సభ అట. బిల్లులివ్వమంటే కలెక్టర్ పలకడం లేదు. ముఖ్యమంత్రి సభకు కేటాయించే నిధులతో జిల్లా ప్రజల దాహార్తి తీర్చవచ్చు.. ఇంకో అధికారి అసంతృప్తివాదమిదీ..
 
 సీఎం చంద్రబాబునాయుడు పర్యటనలు, సభలకు భారీగా ఖర్చవుతోందని, ప్రజల సొమ్ము దుర్వినియోగమవుతోందని జిల్లా అధికారులు మధనపడుతున్నారు. ఖర్చులకు సంబంధించి బకాయిలు కూడా చాలా పెండింగ్‌లో ఉంటున్నాయని ఆవేదన చెందుతున్నారు.
 
చిత్తూరు: చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత జిల్లాకు దాదాపు పదిసార్లు వచ్చారు. ఎనిమిది సభల్లో పాల్గొన్నారు. ఒక్కో సభ నిర్వహణకు దాదాపు *కోటి రూపాయలపైనే ఖర్చయినట్లు అధికారిక గణాంకాలు  చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనలో  భోజనం సదుపాయాలను పౌరసరఫరాల విభాగం చూస్తుండగా, సభకు అవసరమైన షామియానాలు, కుర్చీలు,హెలిపాడ్ ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ చూస్తోంది. జనం తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లను రవాణాశాఖ చూస్తోంది.  ఒక్కో సభకు 500 నుంచి వెయ్యి వాహనాలను ఆ శాఖ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక కాన్వాయ్, పోలీసు వాహనాలు, వాటి డీజిల్ ఖర్చు సరేసరి. మొత్తంగా ఒక్కో సభకు ఖర్చు *కోటికి పైనే ఖర్చవుతోంది. ఈ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించలేదు. ఒక్క రవాణాశాఖకు చెల్లించాల్సిన బకాయిలే రూ.50లక్షలకు పైగా ఉన్నాయి. పౌరసరఫరాల విభాగానిదీ అదే పరిస్థితి. సీఎం సభలకు భోజనాలు సరఫరా చేసిన ఆ శాఖ నిధుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తోంది.

వీరికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇక రోడ్లు, భవనాల శాఖదీ మరో దుస్థితి. షామియాలు, కుర్చీలు తెచ్చిన కాంట్రాక్టర్లు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో ఆ శాఖ అధికారులు తలలు పట్టకుంటున్నారు. పాత బకాయిలు చెల్లించకపోవడంతో కుప్పం సభలకు షామియానాలు, కుర్చీలు  సరఫరా చేసేందుకు పాత కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో రోడ్లు, భవనాల శాఖవారు  కొత్తవారిని బతిమలాడుకోవాల్సి వచ్చింది. కాన్వాయ్‌కు సంబంధించిన బకాయిలు సైతం పెండింగ్ ఉన్నట్లు సమాచారం. పోలీసు శాఖకు ప్రభుత్వం డీజిల్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఇలా చెప్పుకుంటూపోతే ముఖ్యమంత్రి పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం వివిధ శాఖలకు చెల్లించాల్సిన బకాయిల జాబితా చాంతాడంత. సభలకు డబ్బులు వెచ్చించిన అధికారులు బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు.  
సీఎం సభకు 1200 బస్సులు

ఏర్పేడు మండలం గంగాలపల్లె (శ్రీనివాసపురం) వద్ద శనివారం జరిగే ముఖ్యమంత్రి సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని ఉత్తర్వులు అందడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 1200 బస్సులు ఏర్పాటు చేయాలని రవాణాశాఖను అధికారులు ఆదేశించినట్లు సమాచారం. జిల్లా పరిధిలోని పలు బస్సులతోపాటు, జిల్లా పరిధిలో తిరిగే కర్ణాటక, తమిళనాడు బస్సులు సైతం సీఎం సభకు జనాలను తరలించేందుకు రవాణా శాఖాధికారులు సిద్ధమయ్యారు. అయితే వీటికి సంబంధించిన డీజిల్, డ్రైవర్ భత్యాలు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో తెలియక ఆ శాఖాధికారులు లబోదిబోమంటున్నారు.
 
అభివృద్ధి పనులకు పైసా విదల్చేరేమి ?


అభివృద్ధి పనులకు పైసా నిధులివ్వని ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనలకు మాత్రం కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూనే  ముఖ్యమంత్రి సభలకు కోట్లు కుమ్మరిస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టి పది నెలలు గడిచిపోయాయి. జిల్లాలో అభివృద్ధి పనులకు మాత్రం నామమాత్రంగా కూడా  నిధులు విదల్చలేదు. బాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఎన్ని కోట్లడిగినా ఇస్తానంటూ మాటలతో సరిపెట్టడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి సభలకు పెడుతున్న ఖర్చు జిల్లా ప్రజలకు వేసవి మొత్తం తాగునీటి సరఫరాకు సరిపోయేంత పెద్ద మొత్తంలో ఉందని కొందరు ఉన్నతాధికారులే పేర్కొనడం విశేషం.   
Back to Top