విదేశీ పర్యటనల పేరుతో కాలక్షేపం

నెల్లూరు: ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుటే... చంద్రబాబు విదేశీ పర్యటనల పేరుతో కాలయాపన చేస్తున్నారని వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను నమ్మించిన చంద్రబాబు మూడేళ్లపాలన దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని మండిపడ్డారు.  బాబు పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు స్థాపనకు రాయితీలు లభిస్తాయన్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టుపెట్టి ప్రజలకు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. 

మంత్రి సోమిరెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతుందన్నారు. గ్రావెల్‌ అక్రమ రవాణా, నీరు–చెట్టు, రైతురథం తదితర   శాఖల్లో సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతితో సంపాదించిన సొమ్మును నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుపెట్టాలని డిమాండ్‌ చేశారు. సోమిరెడ్డిని న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టేంతవరకు పోరాటం ఆపబోనని తెలిపారు. సమావేశంలో వైయస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి కె.కోదండరామిరెడ్డి, వెంకటాచలం జెడ్పీటీసీ ఎం.వెంకటశేషయ్య, మండల ఉపాధ్యక్షుడు వి.శ్రీధర్‌నాయుడు, పార్టీ మండల కన్వీనర్‌ కె.చెంచుకృష్ణయ్య పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top