వైయస్‌ పట్టాలిస్తే..బాబు లాక్కున్నారు

రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి
సోలార్ ప్లాంట్ నిర్వాసితులకు భరోసా

అనంతపురంః ఎస్‌పీ కుంట సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్వాసితులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ కష్టాలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు భూములు ఇచ్చి పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ భూములను బలవంతంగా లాక్కొని ఎన్‌సీటీపీకి అప్పగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను కారు చౌకగా లాక్కుంటే మేం ఎలా బతకాలని నిర్వాసితులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు ఏమన్నారో వాళ్ల మాటల్లోనే..


బాబూ..మా కన్నీళ్లు తుడవండి: అమ్మాజాన్‌
మాకు 15 ఎకరాల భూమి ఉండేది. నలుగురు అన్నదమ్ములున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఎకరాల చొప్పున భూమి వచ్చింది. 50 ఏళ్ల నుంచి మా మామగారి కాలం నుంచి ఈ భూముల్లో సాగు చేస్తున్నాం. ఈభూములకు సంబంధించిన పత్రాలు, పన్ను చెల్లించిన పేపర్లు ఉన్నాయి. అప్పులు చేసుకొని బోర్లు వేశాం, కరెంటు ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నుంచి నేనే స్వయంగా పట్టా తీసుకున్నా. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏడాదికి రెండు పంటలు పండుతాయి. అలాంటిది మాకు సెంటు భూమి కూడా లేకుండా మొత్తం తీసుకున్నారు. సోలార్‌ ప్రాజెక్టులో మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. భూములు తీసుకొని మమ్మల్ని రోడ్డుపై పడేశారు. పరిహారం కూడా ఇవ్వడం లేదు. అడిగితే ఇస్తామని సంవత్సరం నుంచి చెబుతున్నారు. చంద్రబాబూ..దయచేసి మా కన్నీళ్లు తుడవండి. మా పిల్లల భవిష్యత్‌ మీ చేతుల్లో ఉంది. దయచేసి మమ్మల్ని ఆదుకోండి.


రోడ్డుపై నిలబెట్టారు: హైదర్‌ అలీ
నాకు నాలుగు ఎకరాలు సాగు భూమి ఉంది.సోలార్‌ ప్రాజెక్టుకు వీటిని ఇవ్వనన్నా బలవంతంగా లాక్కున్నారు. వరి, వేరుశనగ పంటలు పండేవి. బోరు, పైప్‌లైన్‌ వేసుకున్నా. మాకు ఆ భూమి తప్ప వేరే ఏమీ లేదు. మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టారు. పరిహారం కూడా ఇవ్వడం లేదు. మేం బతికేది ఎట్లా?


మా పరిస్థితి ఏమిటిః బాబు జాన్
మా నాయన 10 ఎకరాలు సంపాదించాడు. కేరళ, ముంబై వెళ్లి అడుక్కొన్నాం. అలా వచ్చి ఎన్నో కష్టాలు పడి ఐదు బోర్లు వేసుకున్నాం. బోర్లు ఉన్నాయి. నీళ్లు వస్తున్నాయి. మామిడి చెట్లు పెంచాం. పంటకు వస్తున్నాయి. బోర్లకు డబ్బులు ఇస్తామన్నారు. మామిడి చెట్లకు ఇవ్వమని చెప్పారు. ఇష్టంలేకున్నా భూములు తీసుకున్నారు. నోటీసులు ఇచ్చారు. కానీ పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పడు నా పరిస్థితి ఏమిటి?


Back to Top