అమల్లోకి వచ్చిన రోజే రాజ్యంగాన్ని తుంగలో తొక్కిన బాబు

తిరుపతి: రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎయిర్‌పోర్టులో నిర్బంధించడం దారుణం అన్నారు. వైఎస్ జగన్‌ను సామాన్య పౌరుడిలా ట్రీట్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆమె మండిపడ్డారు. దీన్ని బట్టి చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడా.. లేక మాములు నాయకుడా తేలిపోయిందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌పై టీడీపీ నేతలకు గౌరవం లేదని, దీనిపై చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.

రాష్ట్రం కోసం ఏదైనా చేయాలని నేతలకు ఉంటుందని, అందులోనూ ప్రతిపక్ష నేతకు మరిన్ని బాధ్యతలు ఉంటాయని... ఇందులో భాగంగా హోదా కోసం శాంతియుత ర్యాలీకి విశాఖ వస్తే ఇలా ప్రవర్తిస్తారా అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  గత ఏడాది జరిగిన సదస్సులకే దిక్కులేదు.. హోదా ఇచ్చి ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యేవని, ఎవరినీ ప్రాధేయ పడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలను కించపరిచేలా పందుల పందేలు నిర్వహించుకోండని స్వయంగా కేంద్ర మంత్రే మాట్లాడటం దారుణమని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.


Back to Top