నీతులు చెప్పడం కాదు నోరు విప్పాలి

 • దమ్ము, ధైర్యం ఉంటే  కుంభకోణాలపై..
 • చంద్రబాబు విచారణకు సిద్ధపడాలి
 • తప్పును నిరూపించుకోకుండా జననేతపై విమర్శలా
 • చంద్రబాబు ఆయన బినామీలు లక్ష కోట్లు లూటీ చేశారు
 • దోచుకునేందుకే రాజధానిలో భూములు కొన్నారు
 • వైఎస్సార్సీపీపై నోరు పారేసుకుంటే ప్రజలు ఊరుకోరు
 • చంద్రబాబు, మంత్రులపై ధ్వజమెత్తిన రోజా
 • హైదరాబాద్ః రాజధాని ముసుగులో చంద్రబాబు ఆయన బినామీలు లక్ష కోట్లు కొల్లగొట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మాట్లాడితే నీను నిప్పు అని మాట్లాడే చంద్రబాబు భూదోపిడీపై ఎందుకు నోరు విప్పడం లేదని  ప్రశ్నించారు. దోచుకోవడానికే చంద్రబాబు రాజధానిని తుళ్లూరులో పెట్టారని రోజా పైరయ్యారు. రాజధానిలో జరుగుతున్న అక్రమాల గురించి తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. సామాన్యులకు ఉపయోగపడేది కాదు...చంద్రబాబు, లోకేష్, మంత్రులు, ఆపార్టీ నాయకులకు ఉపయోగపడే రాజధాని అని తాము రైతుల తరపున పోరాడుతూ వచ్చామన్నారు. ఐతే, ప్రతిపక్షం కావాలనే చేస్తుందని చెప్పుకుంటూ తప్పించుకు తిరుగుతూ వచ్చారని రోజా అన్నారు. 

  తమ అధ్యక్షులు వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు రైతులకు అండగా రాజధానిలో పర్యటించి వారి సాధకబాధలు తెలుసుకున్నారని రోజా చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు, మంత్రులు రైతులపై అక్రమ కేసులు పెట్టడం, పంటపొలాలు తగలబెట్టడం, వారి భూమి సరిహద్దులు కూడా లేకుండా చేసిన దాన్ని తాము వ్యతిరేకిస్తూ వచ్చామన్నారు. ఇవాళ టీడీపీ అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఇప్పటికీ కూడా తప్పును నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని రోజా శివాలెత్తారు. 

  విజయవాడలో లింగమనేని ఎస్టేట్స్ కు సంబంధించిన 800 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లోకి రాకుండా ఎందుకు ఆగిపోయిందని రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లింగమనేని ఎస్టేట్స్ కు చెందిన అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసమున్నందునే దాన్ని అడ్డుకున్నారన్నారు. బాలకృష్ణ వియ్యంకుడికి  జగ్గయ్యపేటలో 496 ఎకరాలు కట్టబెట్టారు. దాని అలైన్ మెంట్ ఎందుకు మార్చారని, గ్రీన్ జోన్ నుంచి ఎందుకు తప్పించారని రోజా బాబును నిలదీశారు. మంత్రులు వారి  భార్యలు,  ఇతర బినామీ పేర్లమీద భూములు దోచిపెట్టినట్లు ఆధారాలతో దొరికిపోయినా..వారిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని రోజా ప్రశ్నించారు. 
   
  రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నప్పుడు రెవెన్యూమంత్రి ఉండకుండా ...మంత్రి నారాయణ, పుల్లారావు ఎందుకు ఉండాల్సి వచ్చిందని రోజా ప్రశ్నించారు. దోచుకోవడానికే చంద్రబాబు వారిని రాజధానిలో పెట్టారని రోజా నిప్పులు చెరిగారు. తెలుగుదేశం నేతలు చేసిన తప్పులపై విచారణకు సిద్ధపడకుండా ...మాటిమాటికి వైఎస్ జగన్ విమర్శించడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్  5 లక్షల ఎకరాలు ఆక్రమించాడని వాగుతున్న మంత్రులు...అలా జరిగితే అధికారంలో ఉన్న మీరు ఎందుకు విచారించలేదని చురక అంటించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మానుకోవాలన్నారు. 

  రాజధానిలో లక్ష కోట్లు కొల్లగొట్టారు కాబట్టే ఆ రికార్డ్ లను వెబ్ సైట్ నుంచి తొలగించారని రోజా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంకొందరి పేర్లు బయటకొస్తాయన్న భయంతోనే ఆన్ లైన్ నుంచి తీసేశారని అన్నారు. మాట్లాడితే మా ఆస్తులు సక్రమమని మాట్లాడే బాబులు...సీబీఐ ఎంక్వైరీకి రాకుండా చీకట్లో సోనియా, చిదంబరం కాళ్లు ఎందుకు పట్టుకున్నారో చెప్పాలన్నారు.  రెండెకరాల నుంచి 2 లక్షల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగారో చెప్పాలని ముద్రగడ చెప్పిన మాట వాస్తవం కాదా అని రోజా అడిగారు.

  చిత్తూరు జిల్లాలో రెండకరాల భూమి కలిగిన ఏ బాబు.... దేశంలో చంద్రబాబు లాగ వేల కోట్లు కలిగిన హెరిటేజ్ లాంటి సంస్థకు అధిపతులు  కాలేదని రోజా అన్నారు.  మదీనగూడలో  మా నానమ్మ 5 ఎకరాలు తనకు రాసిచ్చిందని లోకేష్ లెక్కలు చూపించారు. నారావారిపల్లెలో 2 ఎకరాలు ఉన్న ఆమె లోకేష్ కు అన్ని ఎకరాలు ఎలా ఇచ్చింది...?  జూబ్లీహిల్స్ లో కోట్ల రూపాయల ఆస్తి కొనే అవకాశం మనుమడికి ఏవిధంగా ఇచ్చింది..? అంబానీ అమ్మమ్మలు కూడా ఇంత విలువైన ఆస్తులు మనువళ్లకు ఇచ్చిన దాఖలాలు లేవని రోజా ఎత్తిపొడిచారు. 

  నాకు వాచీ లేదని చెబుతున్న చంద్రబాబు ....ఓటేసిన రైతులకు మాత్రం గోచీ కూడా లేకుండా చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  నారాయణ, నారాలు రాజధానిలో దోపిడీ బాగోతం బయటపడడంతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయని రోజా ఎద్దేవా చేశారు. రాజధానిలో దోచుకోవాలనే  కేంద్రం ఇస్తున్న అటవీ భూములు, ప్రభుత్వ భూములు చంద్రబాబు వద్దన్నారని రోజా చెప్పారు. అందుకే  శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే ఏ అనుభవం లేని నారాయణతో  కమిటీ వేసి రాజధాని ప్రకటన చేశారని దుయ్యబట్టారు. 

  13 జిల్లాల్లో కాదని రాజధానిలోనే భూములు ఎందుకు కొన్నారో చెప్పాలని అధికారపార్టీ నేతలను రోజా కడిగిపారేశారు. రాష్ట్రంలో ప్రగతిని గాలికొదిలేశారు. అన్ని ప్రధాన కార్యాలయాలు రాజధానికి వస్తున్నాయని ఎందుకు ఊదరగొడుతున్నారు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. బినామీ ఆస్తులు పెంచుకోవడానికి కాదా అని తూర్పారబట్టారు. ల్యాండ్ పూలింగ్ లో సపోర్ట్ చేయని వారి భూములను గ్రీన్ జోన్ లో పెట్టి...బినామీలుగా కొన్న భూములను కమర్షియల్ జోన్ లో ఉంచి కోట్లకు పడగలెత్తుతున్నారని రోజా ఫైరయ్యారు.  

  చంద్రబాబు, నారాయణ కలిసి క్విడ్ ప్రో క్రో చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు పంచాడనే రాజకీయాల్లో ఏ అనుభవం లేని నారాయణని చంద్రబాబు మంత్రిని చేశాడని ధ్వజమెత్తారు.  ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ నారాయణ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.  ఎన్నికల్లో డబ్బులు పంచాడనే చంద్రబాబు దోచుకొమ్మని నారాయణను రాజధాని దగ్గర వదిలేశాడన్నారు. నారాయణ అవినీతి పరుడు కాబట్టే బండారం బయటపడుతుందని పీఎలు, పీఎస్ లను తొలగించారు. రైతుల భూములు దోచుకున్న నీవు ...మీ కాలేజీలో ఆ పేదల పిల్లలకు ఒక్కరికైనా ఫ్రీగా సీటిచ్చారా అని రోజా నారాయణను ఏకిపారేశారు. దోచుకునే మీరా ప్రజాసేవ చేసేది అని ధ్వజమెత్తారు. 

  రూ.6 వేల వార్డెన్ గా ఉన్న ప్రమీల  15 ఎకరాలు ఏవిధంగా భూములు కొన్నది..? చిరుద్యోగిగా ఉన్న నారాయణ బావమరిది సాంబశివరావు 29 ఎకరాలు ఎలా కొన్నారో చెప్పాలని నారాయణను రోజా ప్రశ్నించారు. విద్యార్థులు రాజధాని కోసం రూ.  10 రూపాయలు ఇవ్వాలన్న మీరు...ఒక్క రూపాయైనా ఇచ్చారా, ఒక్క ఇటుకైనా ఇచ్చారని నిలదీశారు. మాట్లాడితే నీతులు చెప్పే పయ్యావుల కేశవ్  అనంతపురం నుంచి వచ్చి తుళ్లూరులో... చదువుకునే తన కుమారుడి పేర భూములు ఎందుకు కొన్నాడో చెప్పాలన్నారు. ఇక రావెల కిషోర్ కు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో బాబుకే తెలియాలన్నారు.  

  దళితుల ద్రోహి తెలుగుదేశం అని రోజా ఫైరయ్యారు.  ఎవరైనా ఎస్సీల్లో పుడతారా అంటూ మాట్లాడిన అంహకారి బాబు అని అన్నారు. చంద్రబాబు  నీతి గురించి మాట్లాడతాడు. పార్టీ ఫిరాయింపు దారులను రాజీనామా చేయించని బాబు చెప్పడం...ఎన్టీఆర్ ఆశయాలకు వెన్నుపోటు పొడవడమేనన్నారు. పత్తి రైతుల కడుపుకొట్టి రూ.700 కోట్లు దోచుకున్న అవినీతి పరుడు ప్రత్తిపాటి పుల్లారావు కూడా...నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ వారిని బెదిరించి తన భార్య వెంకాయమ్మ పేరున భూములను దోచుకున్నారన్నారు. వైఎస్ జగన్ పై నోరు పారేసుకుంటే ప్రజలు ఊరుకోరని దేశం నేతలను హెచ్చరించారు.  

  హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు మురళీ మోహన్ బాబు బినామీగా ఉన్నారని రోజా ఫైరయ్యారు. ఇక బ్యాంకుల్లో రుణం తీసుకొని పంగనామం పెట్టిన సుజనాచౌదరి కేంద్రమంత్రిగా అనర్హుడన్నారు. నారాయణ, సుజనా, రావెల , మురళీ మోహన్ వీళ్లంతా ఎన్నికల్లో డబ్బుల్చిచినందునే  క్విడ్ ప్రో క్రోకు పాల్పడుతూ   రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని రోజా ఆగ్రహించారు. నీను నిప్పు అని డైలాగులు చెప్పడం కాదని నోరు విప్పి సమాధాన చెప్పాలని బాబును డిమాండ్ చేశారు.  ఏపీ ప్రజలను సర్వనాశనం చేసి... నీవు, మీ భజన పరులు కోటీశ్వరులు కావాలన్న దమననీతిని అడ్డుకుంటామన్నారు.  న్యాయపోరాటం చేస్తామన్నారు. 

  రాష్ట్రంలో భూదోపిడీ మొదలు ఇసుక మాఫియా, పట్టిసీమ ఇలా అన్నింటిలోనూ చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో కుంభకోమాలకు పాల్పడుతున్నాడని రోజా ధ్వజమెత్తారు.  చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే  అవినీతిపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. అంతేగానీ,  వెబ్ సైట్ లో ఆధారాలు మాయచేసి, సాక్షిమీద కేసులు వేస్తాం-మూసేస్తామని బెదిరిస్తే మీ తాటాకు చప్పుళ్లకు బయపడే వారు ఎవరూ లేరని బాబుకు హితవు పలికారు. రాష్ట్రానికి పట్టిన శనిగా చంద్రబాబు తాను చేసిన అరాచకాలకు పులిస్టాప్ పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకెళ్లాలని సూచించారు.  
   

Back to Top