చంద్రబాబును అరెస్టు చేయాలి

ఓటు కు నోటు కేసులో శిక్ష పడకపోతే బాబు మరింతగా
రెచ్చిపోతారు

ఇంతవరకు ఆయనను విచారణకు పిలవక పోవడం దారుణం

వైయస్ ఆర్ కాంగ్రెస్ భూమన కరుణాకర్ రెడ్డి 

ఓటుకు నోటు కేసులో చంద్రాబబు నాయుడి పేరును కూడా
చేర్చి వెంటనే ఛార్జీషీటు దాఖలు చేయాలని, లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యంపాలు
అయ్యే ప్రమాదం ఉందని వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  భూమన కరుణాకరరెడ్డి అన్నారు.ఈ కేసులో
చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అడ్డంగా దొరికిపోయినా పోలీసులు
ఆయనను ఇంతవరకు విచారణకు పిలవక పోవడం దారుణమన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష
పడకపోతే, ఏ వ్యవస్థనైనా మానేజ్ చేయగలరన్న మాట వాస్తవమని ప్రజలు అనుకుంటారనీ, దీంతో
చంద్రబాబు మరింతగా పేట్రేగిపోయే ప్రమాదం పొంచిఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో భూమన మట్లాడారు. ఓటుకు
నోటుకు కేసులో చంద్రబాబు పాత్ర ఉందన్న విషయం దేశమంతా నమ్ముతోందన్నారు. దాదాపుగా
మూడేళ్లపాటు కేసును మూలపడేసిన ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి సారించడమనేది,
చంద్రబాబును రక్షించేందుకు, సిబిఐ విచారణ వైపు వెళ్లకుండా చేసే లక్ష్యంతో కాకుండా,
చిత్తశుద్ధితో కేసులో భాగస్వామ్యులైన వారికి శిక్షలు పడే దిశలో చర్యలు తీసుకునేలా
ఉండాలని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబునాయుడుని ఆదేవుడు కూడా రక్షించలేరంటూ భీషణ
స్థాయిలో ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మూడేళ్లపాటు ఏచర్యలు తీసుకోకపోవడం
అనేక అనుమానాలకు ఆస్కారమిచ్చిందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మకమైన
చంఢీఘడ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానైనా కెసిఆర్ కట్టుదిట్టంగా
చర్యలు తీసుకుని, ఏ వ్యవస్థలనైనా మ్యానేజ్ చేయగలన్న చంద్రబాబు ధీమాను బద్దలుగొట్టాలని
సూచించారు.

 ఈకేసుకు
భయపడి, పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు
అటు తరువాత దానిని కూడా సొమ్ము చేసుకుంటూ అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.
గాలి వానకు ఊగిపోయేలాంటి పేకమేడల్ని కట్టి అమరథామాన్ని కడుతున్నాంటూ, ప్రజలను మోసం
చేస్తూ, రైతుల నుంచి భూములను తీసుకుని తన తైనాతీలకు కట్టబెట్టి, లక్షలకోట్లు
ఆర్జించేందుకు అవకాశంగా మలచుకున్నారని ధ్వజమెత్తారు.

ఈ ఓటుకు నోటు కేసుకు భయపడే ,  తెలంగాణ ప్రభుత్వం మనకు నీళ్లు రాకుండా
అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా, కనీస అభ్యంతరాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం కూడా
చంద్రబాబు చేయలేదని విమర్శించారు. ఈ కేసులో గజగజ వణికిపోయిన బాబు, కెసెఆర్ వద్ద
సాగిలపడ్డారో, మోడీ వద్ద సాగిలపడ్డారో గానీ ఇంతకాలం నిర్లిప్తత కొనసాగిందన్నారు..
మళ్లీ దీనిపై విచారణ జరుపుతామంటూ కెసిఆర్ ప్రభుత్వం ప్రకటిస్తున్నందున, ఇకనైనా వాస్తవాలు
వెలుగులోకి తెచ్చి చంద్రబాబుకు శిక్షపడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

 ప్రత్యేక
హోదా ఉద్యమ సమయంలో జెండా పట్టుకున్నా, నినాదాలు చేసినా పట్టుకుపోయి అరెస్టు చేశారని,
అటువంటిది 5 కోట్లకు బేరమాడి, 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా కూడా కేసులు
పెట్టకపోవడం, ఛార్జిషీటులో పేరు నమోదు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. మావాళ్లు
బ్రీఫ్డ్ మీ , నేను మీకు భరోసా అంటూ మాట్లాడిన వ్యక్తిని వదిలిపెట్టడం దారుణమైన
విషయమన్నారు. ఇది కెసిఆర్ నిబద్ధతను ప్రశ్నించేలా ఉందన్నారు. ఇప్పటికైనా
నిష్పక్షపాతంగా, న్యాయబద్దంగా, చట్టబద్దంగా చర్యలు తీసుకుంటూ చంద్రబాబును ముద్దాయిగా చేర్చి, అరెస్టు చేయాలని పార్టీ తరపున భూమన డిమాండ్ చేశారు.

ఇలా చేయకుంటే, ఈ దేశంలోసామాన్యుడికి ఒకన్యాయం,
చంద్రాబుబకు మరొక న్యాయమనే అభిప్రాయాలు కలుగుతాయి. చంద్రబాబు లాంటి దొంగలు ఎలాంటి
కేసునైనా తప్పించుకోగలరని, వ్యవస్థలను మానేజ్ చేయగలరన్న విషయం నిర్ధారణ అవుతుందని
భూమన అన్నారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి అంటూ 15
ఏళ్ల క్రితమే చంద్రబాబు అత్యంత అవినీతి పరుడంటూ తెహెల్కా పేరొనడమే కాకుండా, అనేక
సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు కూడా దీనిని పేర్కొన్నాయన్నారు. ఇంత చేసినా ఆయనపై విచారణ
జరగకుంటే, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేను తప్పించుకోడానికి అనేక మంది అండదండలున్నాయంటూ
మరింత విశృంఖలంగా అవినీతిని ఏరులై పారించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం
చేశారు. ఇంతటి కీలకమైన కేసులో శిక్ష పడకుంటే దేశంలోని చట్టాల మీద ప్రజలకు
అనుమానాలు వచ్చే అవకాశముందని హెచ్చరించారు.

తుని ఘటనలో తన ప్రమేయమే లేకున్నా, సిఐడి విచారణకు
పిలిపించారని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనల్లో వైయస్  ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు
చేసి విచారణలకు పిలుస్తూ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చంద్రబాబును పిలవకపోవడం
అన్యాయమని, దారుణమని భూమన అన్నారు.

ప్రజల దృష్టిలో దొరికిన దొంగ చంద్రబాబు ఇంకా
అధికారంలోకి కొనసాగడం సిగ్గుచేటు, ఆయన లాంటి వాళ్ల ప్రజాస్వామ్య విలువలు నానాటికి
దిగజారిపోతున్నాయన్నారు. ఇంత జరిగినా చంద్రబాబును రక్షించేందుకే కెసిఆర్
ప్రయత్నిస్తే ఆయన కూడా ప్రజల దృష్టిలో దోషిగా మారతారని ఆయన అన్నారు.

 

 

Back to Top