బీజేపీతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు


పోరాటం ఎలా చేయాలో తెలియని మేధావి చంద్రబాబు
ప్రతిపక్షనేత వ్యూహాలను అనుసరిస్తూ.. బురదజల్లే ప్రయత్నం
అంతా నేనే అంటూ తన మీడియాలో బాబు దుష్ప్రచారం
నిమిషాల్లో జాతీయ పార్టీలు చంద్రబాబుకు మద్దతు ఇస్తాయా?
ఎవరిని నమ్మించేందుకు చంద్రబాబూ ఈ జిమ్మిక్కులు
హోదా కోసం పోరాడుతున్న వారిని జైల్లో పెట్టించిందెవరూ?
ముస్లింల కోసమే బీజేపీ నుంచి బయటకొచ్చానని కొత్త డ్రామా
నాలుగేళ్లుగా ముస్లింలకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలి
మీడియా హైలెట్‌ కోసం చంద్రబాబు మొసలి కన్నీరు
వింత వింత ఆలోచనలతో ఇంకా ప్రజలను మోసం చేయొద్దు
వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధించుకునే పోరాటం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాలను అనుసరిస్తూ.. ప్రతిపక్షంపైనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని అంతా నేనే చేశానని తన అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.  మోడీతో కుదిరిన చీకటి ఒప్పందాల మేరకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని, అందుకే అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు... నాలుగు నిమిషాల్లో స్టాండ్‌ మార్చుకున్నాడన్నారు. దేశమంతా నా వెనకాల పరిగెడుతుందని బిల్డప్‌లు ఇచ్చుకుంటూ దుష్టరాజకీయాలు చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. 

వైయస్‌ జగన్‌కు పేరొస్తుందనే...

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం నిర్విరామంగా పోరాడుతున్న వైయస్‌ జగన్‌కు ఎక్కడ పేరొస్తుందోనని చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నాడని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు నిమిషాల్లో జాతీయ పార్టీల మద్దతు ఇస్తాయా.. ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నావు బాబూ అని నిలదీశారు. 
బాబు శకం ముగిసింది...
చంద్రబాబు శకం ముగిసిందని, టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయని ప్రజలంతా చర్చించుకుంటున్నారన్నారు. 
ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లుగా పోరాడుతుంటే మద్దతు ఇవ్వకపోగా కేసులు పెట్టి చంద్రబాబు హోదాను, ఏపీ ప్రజలను హేళన చేస్తూ మాట్లాడరని గుర్తు చేశారు. రాజీనామాలు చేస్తే హోదా వస్తుందా..? హోదా ఏమైనా సంజీవనా...? అని మాట్లాడి ఇప్పుడు ప్రతిపక్ష స్టాండ్‌లోకి వచ్చాడన్నారు. వైయస్‌ జగన్‌ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారా.. మీరు తీసుకుంటున్నారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. పోరాటం ఎలా చేయాలో తెలియని చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే పరితపిస్తున్నాడని వివరించారు. వైయస్‌ జగన్‌ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారని, ఇచ్ఛాపురం చేరేందుకు ఇంకా సమయం పడుతుందన్నారు. చంద్రబాబు ఇచ్ఛాపురం పొలిమేర వరకు వెళ్లి పాదయాత్ర చేశానంటే నమ్ముతారా అని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెప్పిందని, హోదా కలిగిన రాష్ట్రాలు స్వర్గాలయ్యాయా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ యూటర్న్‌ తీసుకొని మొదటి నుంచి పోరాడింది నేను అంటే ఎవరైనా నమ్మరన్నారు.   

టీడీపీకి సిద్ధాంతాలు అనేవి ఉన్నాయా..?

ఇప్పుడు కొత్తగా చంద్రబాబు స్వరం మార్చాడని, మైనార్టీల కోసం బీజేపీ నుంచి బయటకు వచ్చానని చెబుతున్నాడని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకొని, గోద్రా, రామజన్మభూమి, ముంబాయి హత్యాకాండ జరిగినప్పుడు మద్దతు ఇచ్చి ఒకరోజు బయటకు వచ్చా ముస్లింలు నా సైకిల్‌ ఎక్కండి అంటే ఎక్కుతారా చంద్రబాబూ అని నిలదీశారు. నాలుగేళ్లుగా ముస్లిం సోదరులకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీ పార్టీకి సిద్ధాంతాలు అనేవి ఉన్నాయా చంద్రబాబూ అని నిలదీశారు. నీ స్వప్రయోజనాల కోసం మోడీతో చీకటి ఒప్పందాలు చేసుకొని బయటకు వచ్చి కొత్త నాటకాలు ఆడొద్దని సూచించారు. ముస్లింలకు మేలు చేయాలనే ఆలోచనతో దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఇమామ్‌కు సరైన వేతనాలు ఇస్తున్నావా అని చంద్రబాబును ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే రూ. 10 వేలు ఇస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. పోరాటం చేతగాక రాజీపడి వింత వింత ఆలోచనలతో ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ మీడియాలో హైలెట్‌ కావాలని మొసలికన్నీరు కారుస్తున్నాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు దుష్టరాజకీయాలు మానుకోవాలని సూచించారు.  
 
Back to Top