పుష్కరాల అవినీతికి బాబే బాధ్యుడు

మంగళగిరి (గుంటూరు జిల్లా):  క్రిష్ణా పుష్కరాల పనుల్లో జరుగుతున్న
అవినీతి, అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యుడని గుంటూరు
జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)  అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి
చంద్రబాబును రాష్ట్ర ప్రజలు రాజకీయంగా బ్లాక్‌లిస్టులో పెట్టే రోజులు
దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు.  గుంటూరు జిల్లా
మంగళగిరి లో ఆయన మీడియాతో మాట్లాడారు. . పుష్కర పనులపై నిత్యం సమీక్షలు
నిర్వహిస్తున్న ముఖ్యమంత్రికి తమ పార్టీ నాయకులు ఆ పనులలో చేస్తున్న అవినీతి
కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సమయం ముగిసేవరకు పనులు ప్రారంభించకుండా
చివరలో నామినేషన్ పద్ధతిపై తమ పార్టీ నాయకులకు కోట్ల రూపాయల పనులను కట్టపెట్టి
దోచుకునేందుకు అవకాశమిచ్చింది ముఖ్యమంత్రి కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర
పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆగ్రహం
వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అక్రమ నివాసానికి కూతవేటు
దూరంలో సీతానగరం ఘాట్ పనులు నెల రోజులుగా జరుగుతుంటే పట్టించుకోని చంద్రబాబు...  వైఎస్సార్ సీపీ
నాయకులు పరిశీలించి అవినీతిని వెలుగులోకి తెచ్చాక స్పందించడాన్ని ఆయన
తప్పుబట్టారు. తాము వెళ్లివచ్చాక ముఖ్యమంత్రి వెంటనే పరిశీలించి కాంట్రాక్టర్‌పై
చిందులు తొక్కడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారుచంద్రబాబును
శాశ్వతంగా రాజకీయంగా బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం కోసం రాష్ట్ర ప్రజలంతా
ఎదురుచూస్తున్నారని, అరోజులు
ఎంతో దూరంలో లేవని ఆర్కే పేర్కొన్నారు. పుష్కరాల ప్రారంభానికి ఉన్న కొద్దిపాటి
సమయంలోనైనా అవినీతికి తావులేకుండా నాణ్యతతో కూడిన పనులు చేయాలని హితవు పలికారు.

Back to Top