అనంతలో హత్యలకు బాబే కారణం

  • నయీం, జడల నాగరాజులను సృష్టించింది బాబే
  • అరాచక శక్తులను బాబు పెంచి పోషిస్తున్నారు
  • తుని ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదు
  • వైయస్సార్సీపీ అంటగట్టాలని చూడడం దుర్మార్గం
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన
గుంటూరు రూరల్: చంద్రబాబు ప్రజాద్రోహి అని  వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బాబు ప్రజాకంఠక పాలన సాగిస్తూ...సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు నిజాయితీగా పోరాడుతున్న వైయస్సార్సీపీపై బురదజల్లాలని చూస్తున్నారని  భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరాచక శక్తులకు అక్షయపాత్ర అని... అరాచక, అసాంఘిక శక్తులను పెంచిపోషించింది చంద్రబాబేనని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నయీం అనే విషపురుగును, జడల నాగరాజు అనే సంఘవిద్రోహశక్తిని సృష్టించింది చంద్రబాబేనన్నారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ద్వారా ఎన్టీఆర్ పదవీచ్యుతుడైనప్పుడు వాహనాల దహనానికి, అలజడులకు చంద్రబాబే కారణమన్నారు.

తన పదేళ్లపాలనలో అనంతపురంలో జరిగిన నమోదు కాని 400 హత్యలకు, పరిటాల రవి చనిపోయినప్పుడు జరిగిన దహనకాండకు బాబే కారణమన్నారు. తుని ఘటనకు సంబంధించి సీఐడీ అధికారుల నోటీసుతో గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో జరిగిన విచారణకు భూమన హాజరయ్యారు. ఉదయం 11.15 గంటలకు వచ్చిన భూమనను సీఐడీ అధికారులు ఏడున్నర గంటలపాటు విచారించారు. అనంతరం భూమన విలేకరులతో మాట్లాడారు. తుని ఘటనకు కారకుల్ని పట్టుకోకుండా తనను వ్యతిరేకించే ప్రత్యర్థి రాజకీయనాయకుల్ని ఈ కుట్రలో భాగస్వాములను చేయాలనే బాబు కుతంత్రం కనిపిస్తోందని మండిపడ్డారు.

తుని ఘటనకు వైయస్ జగన్, భూమన కారణమంటూ సంఘటన జరిగినరోజే చంద్రబాబు ప్రకటించారని.. ఆయనకు ఈ సమాచారం ఎలా తెలిసిందో అడిగేందుకు అధికారులు ముందు బాబుకు నోటీసులివ్వాలన్నారు. సీఎంకు, తనపై ఆరోపణలు చేసిన హోంమంత్రి చినరాజప్పకు నోటీసులిచ్చి పోలీసులు నిష్పాక్షికతను చాటుకోవాలన్నారు. తనకే సంబంధం లేకపోయినా,   ఎటువంటి ఆధారాల్లేనప్పటికీ కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగా  విచారణకు పిలుస్తున్నారని మండిపడ్డారు.  

ఎవరో దుండగులు రైలును దహనం చేస్తే దాన్ని వైయస్సార్‌సీపీకి ఆపాదించి పార్టీని సమూలంగా దహనం చేయాలనే కుటిలప్రయత్నాల్ని చంద్రబాబు చేస్తున్నారన్నారు. ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి తమ అధ్యక్షుడు వైయస్ జగన్ నైతిక మద్దతు తెలపడాన్ని భరించలేక చంద్రబాబు తనను అరెస్టు చేయించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. 

Back to Top