బాబు పుట్టుకే మోసం, దగా, వంచన

నయవంచకుడికి నంద్యాలలో బుద్ధి చెప్పాలి
అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా.. ఇంతకు ముందు నంద్యాల ఏపీలో లేదా
పోలీసులు, అధికారులతో ఓటర్లను బెదిరిస్తున్న చంద్రబాబు
రుణమాఫీ చేశానని చెప్పడానికి అది నోరా.. తాటిమట్టా
ముస్లింలను తల ఎత్తుకునేలా చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌ 
వైయస్‌ జగన్‌ తండ్రికి తగ్గ తనయుడు
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం వైయస్‌ఆర్‌ సీపీదే
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
నంద్యాల: చంద్రబాబు పుట్టుకే మోసం, దగా, వంచన అని, గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజానికాన్ని నట్టేట ముంచుతున్న చంద్రబాబు లాంటి నయవంచకుడికి నంద్యాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు అభివృద్ధి గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ చిత్రపటంలో నంద్యాల నియోజకవర్గం లేదా అని నిలదీశారు. నంద్యాలలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నంద్యాలలో టీడీపీ ఘోర పరాజయం తప్పదని చంద్రబాబు నిఘా వర్గాలు సైతం చెబుతున్నాయని, ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి అధికార యంత్రాంగం, పోలీసులతో సీఎం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గౌరవమైన కుటుంబాల పట్ల చంద్రబాబు అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆర్యవైశ్య పెద్దలు, వైయస్‌ఆర్‌ సీపీ అనుచరుల ఇళ్లలో దుర్మార్గంగా సోదాలు జరుపుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీని అభిమానించే వారిని భయబ్రాంతులకు గురి చేయడానికి కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. 
ఇన్నినాళ్లు నంద్యాల అభివృద్ధి గుర్తురాలేదా..?
చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అంతిమ విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని బొత్స ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ప్రజలంతా చట్టాలు, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తాపత్రయ పడుతున్నారన్నారు. చంద్రబాబు మోసాల గురించి ఎవరిని అడిగినా చెబుతారని, మళ్లీ నంగనాచిలా నంద్యాల వీధుల్లో తిరుగుతూ రుణమాఫీ చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని బొత్స ధ్వజమెత్తారు. మూడు సంవత్సరాల కాలంలో రూ. 12 వేల కోట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చారా అని ప్రశ్నించారు. రుణమాఫీ జరిగిందని చెప్పుకోవడానికి అది నోరా.. తాటి మట్టా అని నిలదీశారు.  ప్రజలను ఇంకా ఎందుకు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయని ముచ్చటగా మూడు జీఓలు ఇచ్చి ఆ జీఓలతో అభివృద్ధి చెందుతుందంటున్న చంద్రబాబు ఇన్నినాళ్లు ఏం చేశావని చంద్రబాబును ప్రశ్నించారు. 
పేదల రక్తాన్ని పీలుస్తున్న వ్యక్త చంద్రబాబు
నంద్యాలలో రూ. వెయ్యి చదరపు అడుగులు ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని.. చంద్రబాబు రూ.3వేలకు పెంచి పేదవాడి రక్తాన్ని పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెజార్టీ ప్రజలు ఎవరూ బాబు మాయమాటలు వినడానికి తయారుగా లేరన్నారు. నంద్యాలలో స్వేచ్ఛగా ఓటింగ్‌లు జరగాలని, ప్రజలకు ధైర్యం కల్పించడానికి ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదిరోజులుగా నంద్యాలలోనే ఉన్నారన్నారు. నంద్యాల అభివృద్ధి కోసం వైయస్‌ఆర్‌ సీపీ శాయశక్తులా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ముస్లిం సోదరులంతా తల ఎత్తుకొని తిరిగేట్లుగా చేసిన వ్యక్తి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ ఆశయాలకు కట్టుబడి వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైయస్‌ జగన్‌ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడన్నారు. చంద్రబాబు నయవంచక పాలనను తరిమికొట్టేందుకు నంద్యాల నుంచే నాంది పలకాలన్నారు. స్వేచ్ఛగా ఓటు వేసి ప్రభుత్వంపై తిరగబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని బొత్స ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
Back to Top