బాబు ప్రోత్సాహంతోనే శిల్పాపై కాల్పులు

ఫ్యాక్షనిజాన్ని పెంచిపోషిస్తున్న చంద్రబాబు
శిల్పా చక్రపాణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
నడిరోడ్డుపై కత్తులతో టీడీపీ రౌడీషీటర్‌ స్వైర విహారం
రౌడీషీటర్‌కు గన్‌ లైసెన్స్‌ ఎలా ఇచ్చారు
తక్షణమే అభిరుచి మధును అరెస్టు చేయాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హెదరాబాద్‌: చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఆంధ్రరాష్ట్రంలో ఫ్యాక్షన్‌ పెరిగిపోతుందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రౌడీషీటర్‌లకు గన్‌మెన్‌లను కేటాయిస్తూ రౌడీయిజాన్ని ఎంకరేజ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన కాల్పుల దాడిని గడికోట తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తప్పు చేసిన వారు ప్రజలచే శిక్షించబడాలని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మాట్లాడితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసిన చంద్రబాబు మీ పార్టీ నేతలు నడిరోడ్డుపై కత్తులు పట్టుకొని, కాల్పులు జరుపుతూ స్వైర విహారం చేస్తుంటే కనిపించడం లేదా ప్రశ్నించారు. అభిరుచి మధు తీరుకు పోలీసులు సైతం పారిపోతున్నారన్నారు. పోలీస్‌ వ్యవస్థ అంతా ఉన్నా.. కత్తులు పట్టుకొని 10 నిమిషాల పాటు హల్‌చల్‌ చేసిన రౌడీ షీటర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నారు. 

ఇటీవల వైయస్‌ఆర్‌ సీపీ నేత నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేస్తే చంద్రబాబు నేటికీ నిందితులను అరెస్టు చేయలేదని గడికోట మండిపడ్డారు. గత చంద్రబాబు పరిపాలనలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తండ్రిని చంపడం, టీడీపీ చేసిన నేరాలు బయటకు తీస్తే వేలల్లో ఉంటాయన్నారు. ఫ్యాక్షన్‌ తగ్గించడానికి మహానేత వైయస్‌ఆర్‌ పనిచేస్తే, చంద్రబాబు మళ్లీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. రౌడీ షీటర్‌కు గన్‌ లైసెన్స్‌లు ఏ విధంగా ఇచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. నంద్యాలలో ఎన్నికల కోడ్‌ ఉండగా ఆ గన్‌ ఎందుకు స్టేషన్‌లో డిపాజిట్‌ చేయలేదో పోలీసులు, చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా అని నిలదీశారు. 

చంద్రబాబు పరిపాలన మొత్తం రక్త చరిత్ర అని, తునిలో స్వార్థానికి రైలు తగలబెట్టించి దాన్ని రాయలసీమ గుండాల పని అంటూ నిందలు వేశారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. నంద్యాలలో ఎన్నికల జరుగుతుండగా మైనార్టీ కౌన్సిలర్‌పై టీడీపీ నేతలు దాడి చేసినా వారిపై కేసు నమోదు చేయలేదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నేతలు దౌర్జన్యాన్ని అడ్డుకుంటే దాన్ని పెద్దగా చేసి కేసు ఫైల్‌ చేశారని దుయ్యబట్టారు. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడన్న కసితో ప్రభుత్వమే కాల్పులు చేయించిందని ఆరోపించారు. ఎన్నికల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని లోకల్‌ పోలీసులను టీడీపీ తన ఆదీనంలో పెట్టుకుందన్నారు. నంద్యాలతో సంబంధం లేని టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతండగా డీఎస్పీతో మంతనాలు జరిపాడన్నారు. 

మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను పొట్టబెట్టుకుందని ఎమ్మెల్యే గడికోట మండిపడ్డారు. శిల్పా చక్రపాణిరెడ్డిపై దాడి జరిగి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు అభిరుచి మధును అదుపులోకి తీసుకోలేదన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా పనిచేయాలని, అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్షానికి మరొకలా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షించాలన్నారు. రాజకీయ నాయకులనే విధంగా చేస్తే ఇక శాసనసభ్యుడు ఏ విధమైన రక్షణ కల్పిస్తారని పోలీసులను ప్రశ్నించారు. తక్షణమే అభిరుచి మధును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top