చంద్రబాబు వల్లే కరువు కష్టాలు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజల అవస్థలు
పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు
కళేభరాలకు వెళుతున్న పశువులు
వలస బాట పడుతున్న లక్షలాది మంది ప్రజానీకం
ఐనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బాబు
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ పోరుబాటః ఉమ్మారెడ్డి

హైదరాబాద్ః  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి ఏపీ ప్రజానీకం బలైపోతోందని శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ప్రభుత్వం స్పందించని కారణంగా కరువుతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు.  హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని,  పశువులు కబేళాలకు వెళుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. 

రాష్ట్రవ్యాప్తంగా నూటికి 95 శాతం గ్రామాలు కరువు బారిన పడ్డాయని ఉమ్మారెడ్డి తెలిపారు.  దీని కారణంగా గతం సవత్సరం కంటే ఈసంవత్సరం అధికారిక లెక్కల ప్రకారమే 70 శాతం పంటలు తగ్గాయన్నారు. అనేక గ్రామాల్లో మంచినీటి కొరత ఏర్పడిందని చెప్పారు. ఏపీ ప్రజలు కరువుతో విలవిలలాడుతుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే  కరువు కాటకాలు ప్రజాకంఠకంగా మారాయన్నారు. ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి...ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా  పోరుబాట చేపడుతామన్నారు.  ఈ ఆందోళనలో తమ అధ్యక్షులు వైఎస్ జగన్ కూడా పాల్గొంటారని, మరో రెండ్రోజుల్లో దీనికి సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. 

తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు గానీ రాష్ట్రంలో మద్యం మాత్రం ఏరులై పారుతోందని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. డోర్ డెలివరీ ప్రాతిపదికన ఫోన్ కొట్టు బాటిల్ పట్టు  విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. మద్యం మీద ఆదాయం వస్తోందని... విచ్చలవిడిగా అక్రమాలు జరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.  నీళ్లు పారడం సంగతి దేవుడెరుగు కానీ రాష్ట్రంలో  అవినీతి మాత్రం బ్రహ్మాండంగా పారుతోందని ప్రజలు అంటున్నారన్నారు. ఇసుకాసురుల గురించి పత్రికల్లో వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలే స్వయంగా చెబుతున్నారన్నారు.

రాష్ట్రంలో కరువు కారణంగా 4 లక్షలమంది ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిన భయానక వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నాయన్నారు.  రాష్ట్రాలు స్పందించకపోయినా కేంద్రమైనా స్పందించాలి కదా అని హెచ్చరికలు చేశాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద పనికి వెళ్లిన వారికి... 4,5 నెలల వరకు నిధులు విడుదల చేయకపోవడాన్ని కూడా  కోర్టులు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కరువుపై శాసనసభ్యులు ఏకరవు పెట్టిన విషయాన్ని ఉమ్మారెడ్డి  ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోని కారణంగానే తీవ్రంగా నష్టపోయామన్నారు. 

ప్రభుత్వం 359 మండలాలను  కరువు మండలాలుగా ప్రకటించిందని,  వాస్తవానికి 500కు పైగా మండలాలు కరువు బారిన పడ్డాయని అనేకమంది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు.  కేంద్రం సైతం రాష్ట్రంలోని కరువుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వరద నష్టం కింద 2వేల443 కోట్లకు పైగా సహాయం అడిగితే...కేంద్రం కేవలం రూ. 433 కోట్లు మాత్రమే ప్రకటించడం దారుణమన్నారు. కేంద్రం నుంచి ఎందుకు నిధులు తీసుకురాలేకపోతున్నారని ఉమ్మారెడ్డి టీడీపీ సర్కార్ ను నిలదీశారు. 

చత్తీస్ ఘడ్ కు రూ. 1672 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ.2033 కోట్లు, మహారాష్ట్రకు రూ.3050 కోట్లు, కర్నాటకకు రూ.1540 కోట్లు, ఉత్తరప్రదేశ్ కు రూ.1304 కోట్లు, ఒరిస్సాకు రూ.815 కోట్లు కేటాయించిన కేంద్రం...ఏపీకి మాత్రం కేవలం 433 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. తెలంగాణకు సైతం  రెండు విడతలుగా 600 కోట్లు పైనే కేంద్రం నిధులు ప్రకించిన విషయాన్ని వెల్లడించారు.  నీరు- చెట్టు వల్ల నీటి మట్టాలు పెరిగాయని ముఖ్యమంత్రి మాట్లాడడం హేయనీయమన్నారు. ఏజిల్లాలో కూడా నీటిమట్టాలు పెరిగిన దాఖలాలు లేవని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2015 నవంబర్ నాటికి 10.10 మీటర్లు ఉంటే...2016 ఏఫ్రిల్ నాటికి 12.45 మీటర్లకు భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. 

కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పనిదినాలు అమలు కావాల్సి ఉండగా... 47 రోజులు మాత్రమే  జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం అన్నీ చేస్తున్నామని చెప్పడం తప్ప ఏమీ చేయడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదా...? లేక ఇచ్చిన వాటిని దారి  మళ్లిస్తున్నారో ప్రభుత్వం కారణాలు తెలపాలన్నారు. ప్రజలకు సక్రమంగా  నిధులు ఎందుకు వినియోగించడం లేదో చెప్పాలన్నారు.  60 శాతానికి తగ్గకుండా లేబర్ కాంపోనెంట్ ఉపాధి హామీకి ఇవ్వాల్సి ఉండగా...రాష్ట్రంలో 40 శాతం కూడా మించలేదని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం కింద పేదలకు దక్కాల్సిన నిధులు కాంట్రాక్టర్ల వశమైనట్టు స్పష్టంగా కనబడుతోందన్నారు. కేంద్రం నుంచి తక్కువ నిధులు రావడం, వాటిని సక్రమంగా వినియోగించకపోవడం దారుణమన్నారు. 

శ్రీశైలం నుంచి దిగువకు 4 టీఎంసీల నీరు విడుదల చేస్తే ...అంతా డ్రై అయిపోగా 2.5 టీఎంసీల నీరు మాత్రమే చెరువులు,కుంటలకు చేరిందన్నారు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగులు ఉండాల్సిన నీటిమట్టం 790 అడుగులకు చేరిందని...డెడ్ స్టోరేజ్ నుంచి వాటర్ డ్రా చేస్తే బురద నీరు వచ్చే ప్రమాదముందని ఇంజినీర్లు చెబుతున్నారన్నారు. ఏఫ్రిల్ నాటికే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ఇక రాష్ట్రంలో ఊష్ణోగ్రతలు  45 డిగ్రీలకు చేరుకోవడంతో, దాదాపు  67 మంది చనిపోయారని చెప్పారు. అది 50 డిగ్రీలకు చేరుకుంటే మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. 

ఆహార ధాన్యాల దిగుబడులు ఈ సంవత్సరం బాగా తగ్గిపోయాయని ఉమ్మారెడ్డి తెలిపారు. కృష్ణాడెల్టాలో  2 లక్షల పంటలు ఎండిపోయాయన్నారు. 5 లక్షల ఎకరాల్లో నాట్లే వేయలేదన్నారు. గోదావరి డెల్టాలో రబీకి నీళ్లిస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో రైతులు నార్లు ఎండబెట్టుకున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. కరువు తీవ్రత గురించి అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నీటి ఎద్దడితో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఉమ్మారెడ్డి వాపోయారు. పొరుగు రాష్ట్రాల మాదిరి ఏపీకి రైల్వే ట్యాంకర్ల పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారన్నారు.  పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే వాస్తవాలు చెప్పకుండా అంతా బాగుందని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు.  పంటల బీమా పథకానికి సంబంధించి ఉదారంగా బీమా సొమ్ము రైతాంగానికి అందజేయాలన్నారు. బ్యాంకు రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రెండేళ్లయినా రెండో విడత రిలీజ్ చేస్తామంటున్నారే తప్ప చేయడం లేదన్నారు. నానాటికీ  రైతులపై రుణభారం పెరుగుతోందని...అది 95,455 కోట్లు చేరిందన్నారు. వరదలు, కరువుతో  నష్టపోయి  రైతాంగం విలవిలడాతున్న పరిస్థితుల్లో... వారికి ఇన్ పుట్ సబ్సిడీ 80 నుంచి 90 శాతం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పశుగ్రాసం కూడా  అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని, కేంద్రం ప్రతిపాదించిన 150 రోజుల ఉపాధి హామీ పథకం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉమ్మారెడ్డి తేల్చిచెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top