చంద్ర‌బాబు భూ బ‌కాసురుడు


- ల్యాండ్ పూలింగ్‌ పేరుతో ల్యాండ్ పుల్లింగ్
- భూమి రైతు ఆత్మ‌గౌర‌వ చిహ్నం
- వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి
హైద‌రాబాద్‌:  రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాగేస్తోందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాక‌ర్ అన్నారు. వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం ఆయన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ప్ర‌తి జిల్లా నుంచి కూడా  అవినీతికి పాల్ప‌డుతోంద‌న్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ల్యాండ్ ఫుల్లింగ్ చేస్తోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. భూమి అనేది రైతు ఆత్మ‌గౌర‌వానికి చిహ్న‌మ‌న్నారు. అటువంటి ఆత్మ‌గౌరవాన్ని చంద్ర‌బాబు దౌర్జ‌న్యంగా లాక్కొంటున్నార‌ని మండిప‌డ్డారు. 

2013 చ‌ట్టానికి వ్య‌తిరేకంగా...
2013లో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు ఫ్రీకాంప‌ర్‌జేష‌న్ అన్న ఒక దానిని తీసుకొచ్చిఎవ‌రిదైనా భూమిని ప్ర‌భుత్వం తీసుకొవాలంటే ఆ గ్రామంలో ఉన్న ప్ర‌జ‌ల ఆమోదంతో తీసుకొవాల‌ని, అప్పుడు ఉన్న మార్కెట్‌కు క‌నీసం మూడు రెట్లు ఎక్కువ ఉండాల‌న్న చ‌ట్టాన్ని పార్లమెంట్ చేసింద‌ని భూమన వివ‌రించారు. చ‌ట్టానికి వ్య‌తిరేకంగా అధికార స‌ర్కార్ చ‌ట్టం ప్ర‌కారం న‌డుచుకొంటోందని, రైతుల మీద బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని భూమన మండిప‌డ్డారు. స‌మీక‌ర‌ణ అన్న కొత్త నినాదం తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్‌ అన్న పేరుతో ల్యాండ్ పుల్లింగ్ అన్న కార్య‌క్ర‌మాన్నిచేప‌ట్టింద‌ని ఆయ‌న ఆరోపించారు.  రైతుల‌కు భూమికి ఉన్న బాంధ‌వ్యం అంతా ఇంతా  కాద‌న్నారు. భూమి రైతు ఆత్మ‌గౌర‌వ చిహ్న‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  పేదల అసైన్డ్ భూములు కూడా లాక్కొంటున్నారని నిప్పులు చెరిగారు. 

భూ బ‌కాసురుడిగా చంద్ర‌బాబు 
రాష్ట్రంలో భూముల‌ను లాక్కునే ఒక బ‌ల‌వంతపు ల్యాండ్ మాఫియాకు చంద్ర‌బాబు భూ బ‌కాసురుడిగా మారిపోయార‌ని భూమ‌న కరుణాక‌ర్ ఆరోపించారు.  ఏ ఒక్క రైతు కూడా ప్రేమ‌తో ఒక ఎక‌రా భూమిని కూడా ఇవ్వ‌లేద‌న్నారు. అమ‌రావ‌తిలో నాలుగు వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం క‌లిగిన‌ట్టువంటి ఎక‌రా భూమికి ఎనిమిది వంద‌ల చ‌ద‌ర‌పు అడుగుల భూమిని ఇస్తానంటే ప్ర‌జ‌లు భూమిని ఇచ్చార‌ని బాబు చెప్ప‌డం సిగ్గు చేట‌న్నారు.  బ‌ల‌వంతంగా తీసుకుంటున్నారే త‌ప్ప ఎవ్వ‌రు కూడా మ‌న‌స్ఫూర్తిగా ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  అవ‌స‌రాల‌కు మించి, త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే మార్కెట్ ధ‌ర‌ కన్నా త‌క్కువ‌గా చెల్లించి భూ ఫూలింగ్‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. లాక్కొన్న భూముల‌తో రియ‌ల్ఎస్టేట్ వ్యాపారం చేసి త‌న తాబేదారుల‌కు వేల కోట్లు కూడ‌బెట్ట‌డం కోస‌మే ల్యాండ్ బ్యాంకును తెర‌పైకి  తెచ్చార‌న్నారు. గ‌త ఐదేళ్లుగా భార‌త‌దేశంలోనే పారిశ్రామికీక‌ర‌ణ‌లో జ‌రిగిన అభివృద్ధి కేవ‌లం 1.8 శాతం మాత్ర‌మేన‌న్నారు. రెండున్న‌రేళ్ల కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాలేద‌న్నారు. 

అవ‌స‌రానికి మించి భూ స‌మీక‌ర‌ణ‌
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు దాదాపు 50వేల ఎక‌రాలు స‌మీక‌రించాల‌న్న ప్ర‌య‌త్నం చేశార‌ని చివ‌ర‌కు 3500 ఎక‌రాలకు ప‌రిమిత‌మ‌య్యార‌ని భూమన పేర్కొన్నారు. విశాఖ‌ప‌ట్నానికి అతి స‌మీపంలో ఉన్న భోగాపురానికి 3500 ఎక‌రాలు అవ‌స‌రం లేక‌పోయిన భూములు సేక‌రించి వాటిని తన బినామీల‌కు కట్టబెడుతున్నార‌న్నారు. బందర్ ఎయిర్‌పోర్ట్‌కు ల‌క్ష ఎక‌రాలు, మ‌చిలీప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌కు 14,427 ఎక‌రాలు, నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌కు 1400ఎక‌రాలను అవ‌స‌రానికి మించి పొలాల‌ను తీసుకుంటున్నార‌న్నారు. చంద్ర‌బాబు చేస్తున్న అవినీతికి ఇది ఉదాహ‌ర‌ణగా బాసిల్లుతోందన్నారు. ప్ర‌జ‌ల జీవితాల‌తో బాబు చెలగాటం ఆడుతూ, రాష్ట్రంలో పొలాలు లేకుండా చేయ‌డమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. 
Back to Top