పోలవరంపై బాబు కొత్త డ్రామాలు
కేంద్రంపై నెపం మోపి చేతులెత్తేసే ప్రయత్నాలు

ముడుపుల కోసం పోలవరాన్ని వాడుకున్న టీడీపీ

బాబు పాలనలో రాష్ట్రానికి హోదా లేదు.. పోలవరం లేదు


ప్రాజెక్టు నిర్మాణంపై వైయస్‌ జగన్‌తో చర్చిస్తాం

త్వరలో ప్రతిపక్ష కార్యచరణ ప్రకటిస్తాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

కర్నూలు: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 2018లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు తరువాత 2019లో పూర్తి చేస్తామని చెప్పారన్నారు. కానీ మళ్లీ నిన్న అసెంబ్లీలో చేతులెత్తేసే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదన్నారు. కర్నూలులో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసి అన్ని అనుమతులు తీసుకువచ్చి.. 130 కిలోమీటర్ల మేర కుడి కాల్వను పూర్తి చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును వాడుకుంటున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయితే దాన్ని కమీషన్ల కోసం లాక్కున్నారన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయలేక కేంద్రంపై నెపం మోపే కార్యక్రమం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో పోలవరం అంచెనాలు దాదాపు రూ.56 వేల కోట్లకు పెంచామని చెబుతున్నారన్నారు. 

చంద్రబాబు కమీషన్ల బాగోతం తెలిసి కేంద్రమంత్రి గట్కరి కూడా అవినీతి లేకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలని సర్కార్‌కు సూచించారన్నారు. పోలవరం కోసం హోదాను వదులుకొని ప్యాకేజీని అంగీకరించానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పోలవరాన్ని కూడా వదిలేశారన్నారు. ఇప్పుడు హోదా పోయింది... పోలవరం పోయింది.. చివరకు రాష్ట్ర ప్రజలకు చేతిలో చిప్ప.. నెత్తిన రూ.2 లక్షల కోట్ల అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఇప్పుడు ప్రతిపక్షం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. పోలవరంపై ఏ విధంగా ఉద్యమించాలి.. కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు పాదయాత్ర వద్దకు రావడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌తో చర్చించిన అనంతరం త్వరలో కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. Back to Top