ఏనాడు నంద్యాల గురించి పట్టించుకోని బాబు

  • ఎన్నికల కోసమే నంద్యాలలో అభివృద్ధి పనులు
  • కర్నూలులో నీటి సమస్య సీఎంకు పట్టదా?
నంద్యాల: ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి రూ.2 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు ఏ ఒక్కరికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. ఎన్నికల కోసమే నంద్యాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని, నిరుద్యోగ భృతిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు. మంగళవారం నంద్యాల నియోజకవర్గంలో ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఐజయ్య తదితరులు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు నంద్యాలలో అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.

మూడున్నరేళ్లలో ఏనాడు నంద్యాల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిందని రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. కర్నూలు పార్లమెంట్లో ప్రజలకు తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారని, ఈ సమస్య సీఎంకు పట్టదా అన్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలన్నారు. ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా మా పిల్లలు చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బుట్టా రేణుక చెప్పారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు మంచి స్పందన వస్తుందని, ఈ ఎన్నికతో వైయస్‌ జగన్‌ సీఎం కాకపోయినా మేం విశ్వసనీయతకే ఓటు వేస్తామని నంద్యాల ఓటర్లు చెబుతున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని అందుకే వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి గెలుపు తధ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Back to Top