చేయాల్సిందంతా చేసి నవనిర్మాణ దీక్ష అనడం వంచన కాదా?

02–06–2018,

శనివారం 

జగన్నాథపురం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు
నుంచి ఆచంట వైపు ఈ రోజు సాగిన పాదయాత్రలో పుట్టెడు కష్టాలతో జనం నన్ను కలిశారు. ఏ
ప్రభుత్వంలోనూ ఇంత దౌర్భాగ్యం లేదన్నారు. మా కన్నీటికి చంద్రబాబే కారణమంటూ ఆక్రోశం
వెలిబుచ్చారు.. అర్జీలిచ్చారు. ఉదయం కలిసిన పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు ‘సార్‌.. ఓ పక్క పేదల
జీవితాలతో ఆడుకుంటున్న ఈ పెద్ద మనిషి.. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి
పునరంకితంకమ్మంటూ నవ నిర్మాణ దీక్ష చేయడం దారుణం. వందల కోట్ల ప్రజాధనం
దుర్వినియోగం చేస్తూ.. మొక్కుబడి ప్రతిజ్ఞలు చేయించడం మభ్య పెట్టడం కాదా’అని ప్రశ్నించారు.

రాష్ట్రాభివృద్ధి
పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఇలాంటివి చేయడమేంటన్నారు. చిత్తశుద్ధే ఉంటే
ప్రత్యేక హోదా కోసం పోరాటమేదన్నారు. నిజాయితీ లేని చంద్రబాబు దీక్షలను చూస్తుంటే..
‘చిత్తశుద్ధి
లేని శివపూజలేలరా’అన్న
వేమన సూక్తి గుర్తుకొస్తోంది. నాలుగేళ్లు హోదాను భూస్థాపితం చేసి, మళ్లీ మోసాలకు తెర తీసిన
చంద్రబాబు నైజంపై.. హోదా ఇస్తానంటూ మాట తప్పిన కేంద్రం తీరుపై.. వైఎస్సార్‌
కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ రోజు వంచనపై గర్జన పేరిట దీక్ష చేశాయి. ఆ నిరసన
గళాన్నందుకుని పాదయాత్రలో జనం సంఘీభావం చెప్పడం ఆనందంగా ఉంది. నల్లబ్యాడ్జీలు, జెండాలు, టీ షర్టులు ధరించి
మద్దతిచ్చిన ప్రతి వ్యక్తికీ నా ఈ అక్షరాల సాక్షిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.

 

నిన్న
ఎస్సీలు, ఈ
రోజు బీసీలు.. చంద్రబాబు దగాతో దెబ్బతిన్న స్థితిగతులు నా ముందుంచారు. నన్ను
కలిసిన బీసీ సంక్షేమ, బీసీ
యువజన సంఘాల ప్రతినిధుల మాటల్లో ఆవేశం కనిపించింది. విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ
బీసీ హాస్టళ్లను మూసేస్తున్న ఈ ప్రభుత్వ కుయుక్తులపై చండ్ర నిప్పులు చెరిగా>రు. హాస్టళ్లు మూతబడి..
రోడ్డు పాలయ్యే విద్యార్థుల దయనీయ దుస్థితి మనసును కదిలించింది. ‘హాస్టళ్లలో సౌకర్యాలే
లేవన్నా.. నిర్వహణ అధ్వానమన్నా.. జైల్లో ఖైదీల మెస్‌ చార్జీలే నయం. వాళ్లకు రోజుకు
రూ.125 ఇస్తారు. మా పరిస్థితేంటన్నా.. ముష్టేసినట్టు స్కూల్‌
విద్యార్థులకు రోజుకు రూ.25, కాలేజీ విద్యార్థులకు రోజుకు రూ.35 ఇస్తున్నారు. అది కూడా ఈయన
గొప్పేం కాదు.. 2006లో మీ నాన్నగారు ఔదార్యంతో రోజుకు రూ.16 ఉన్న మెస్‌ చార్జీలను రూ.35కు పెంచారు.

2 ఏళ్ల నాటి చార్జీలను
నేటికీ కొనసాగిస్తుండటం దారుణం. చంద్రబాబు దుర్మార్గం చూడన్నా.. మెస్‌ చార్జీలు
పెంచడు. స్కాలర్‌షిప్పులివ్వడు. హాస్టళ్లను మూసేస్తాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌
అథోగతే. ఈ జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా లోన్లకు 37 వేల మంది దరఖాస్తు
చేసుకోగా.. కేవలం 1900 మందికి మాత్రమే మూడేళ్ల కిందట శాంక్షన్‌ చేసి, నేటికీ నిధులు విడుదల
చేయకపోవడం దారుణం’అని
ఆవేదన వ్యక్తంచేశారు. ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప.. బీసీలకు ఒరగబెట్టిందేంలేదన్న
భావన వ్యక్తం చేశారు. బీసీలు న్యాయమూర్తులుగానే పనికిరారంటూ, సమర్థత, సచ్ఛీలత వాళ్లకసలే ఉండవంటూ
లేఖలు రాసినప్పుడే చంద్రబాబుకున్న బీసీ ప్రేమేంటో అందరికీ తెలిసిందన్నారు. ఆ
ఆవేదనలో దాగున్న వాస్తవం తెలిసి నాకూ బాధేసింది. బీసీల కోసం నాన్నగారు ఓ
అడుగేస్తే.. నేను రెండడుగులు వేస్తానని చెప్పిన మాటల్లోని విశ్వాసమే.. దగా పడ్డ
బీసీ సోదరులను ఏకం చేస్తోందని ఈ రోజు వాళ్ల మాటల ద్వారా తెలుసుకున్నాను.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను
పునరంకితం చేయడానికి నవ నిర్మాణ దీక్ష అంటున్నారు.. అసలు రాష్ట్రాభివృద్ధికి మీరే
ఏకైక అడ్డంకి అని జనం అంటున్నారు. రాష్ట్రం విడిపోవడానికి లేఖ ఇచ్చి.. మొదటి ఓటేసి
విడగొట్టింది మీరు కాదా? నా
వల్లే విడిపోయిందని తెలంగాణలో.. విడగొట్టడం దుర్మార్గమని ఆంధ్రాలో చెప్పుకోవడం మీ
రెండు నాల్కల ధోరణికి నిదర్శనం కాదా? ఓటుకు కోట్లు కేసులో
ఇరుక్కుని.. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను సైతం అడగలేని దిక్కుమాలిన
పరిస్థితి మీది కాదా? మీ
స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది నిజం కాదా? కష్టాల్లో ఉన్న
రాష్ట్రాన్ని దోచుకుని.. పీల్చి పిప్పిచేసి.. అథోగతి పాల్జేసి.. మరో వైపు
రాష్ట్రాభివృద్ధికి నవ నిర్మాణ దీక్ష అనడం వంచన కాదా?  

-వైఎస్‌ జగన్‌

Back to Top