చంద్రబాబు మైండ్ సెట్ మారాలి

 • అంబేద్కర్ స్ఫూర్తిని పాలకులు గుర్తించాలి
 • ఇప్పటికైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి
 • అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
 • హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉందని
  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. దళితుల
  నిధుల్ని పక్కదారి పట్టిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. వైఎస్సార్సీపీ కేంద్ర
  కార్యాలయంలో బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఆయన నిర్వహించారు. అంబేద్కర్
  చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ సందేశం ఆయన
  మాటల్లోనే...

        
  దేశ వ్యాప్తంగా ఉన్న దళిత
  సోదరులు అందరికీ శుభాభినందనలు. బీ ఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని మనమంతా
  కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆయన అందించిన స్ఫూర్తిని అంతా గుర్తు చేసుకోవాలి.
  అంబేద్కర్ ప్రవచించిన మాటల్ని స్మరించుకోవాలి. ఎంత కాలం బతికాం అన్నది ముఖ్యం
  కాదు. ఎంత గొప్పగా బతికాం అన్నది ముఖ్యం అని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్ఫూర్తిని
  మనం అందిపుచ్చుకోవాలి. ఆయన వెళ్లిపోయాక కూడా అంబేద్కర్ స్ఫూర్తిని పాలకులు
  అందిపుచ్చుకోవటం లేదు. ఇది దురద్రష్టకరం. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంబేద్కర్
  జయంతి, వర్థంతి జరుపుతున్నారు. కానీ, ఆయన స్ఫూర్తిని మరిచిపోతున్నారు. ఇది
  బాధాకరం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లోని నిధుల్ని పక్క దారి పట్టిస్తున్నారు. జనాభా
  ప్రకారం రాజ్యాంగం ద్వారా అందాల్సిన నిధులు అందటం లేదు. అట్టడుగు వర్గాలకు తీరని
  అన్యాయం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ నిధుల్ని ఖర్చు చేయకుండా తూట్లు పొడుస్తున్నారు.
   రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు.
  దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.

         గిరిజనులకు రాజ్యాంగ పరంగా
  సంక్రమించిన హక్కు గిరిజనుల సలహా మండలి. ఈ కమిటీ సలహాల ప్రకారం ఐటీడీఏకు
  సంబంధించిన నిధుల్ని ఖర్చు పెట్టాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి
  రెండేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా ఆ పని చేయటం లేదు. కారణం ఏమిటంటే.. ఈ కమిటీలో మూడో
  వంతు మందిని గిరిజన ఎమ్మెల్యేలను వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏడు గిరిజన ఎమ్మెల్యేలు
  ఉంటే ఆరుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. అందుచేత గిరిజనుల సలహా మండలిని వేయటం
  లేదు.

         రాష్ట్రంలోని దళితులంతా
  అడుగుతున్న ప్రశ్న ఒకటే. క్రైస్తవమతం తీసుకొన్న కారణంగా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వబోం
  అని చెబుతున్నారు. ఇది సరికాదు. దళితులు ఏ మతం పుచ్చుకొన్నా వారి సామాజిక స్థితి,
  ఆర్థిక స్థితి మారటం లేదు. అటువంటప్పుడు కేవలం క్రైస్తవ దేవుడ్ని పూజిస్తున్నారు
  కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వబోం అని చెప్పటం సరి కాదు. ఈ పరిస్థితి కళ్ల ముందు
  కనిపిస్తున్నప్పటికీ చంద్రబాబు నోరు ఎత్తటం లేదు.

   మొత్తంగా చంద్రబాబు మైండ్ సెట్ మారాలి.
  ప్రభుత్వం మైండ్ సెట్ మారాలి. చంద్రబాబు మాత్రం దళితుల్ని హేళన చేస్తూ...
  పుట్టుకతోనే ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకొంటారా అని మాటలాడే పరిస్థితి చూశాం.
  ఇటువంటి మనిషి ముఖ్యమంత్రి గా మాకు వద్దు అని దళితులంతా చెప్పటం జరుగుతోంది.

  చంద్రబాబు నాయుడికి ఒక్కటే చెప్పాలి. అంబేద్కర్
  జయంతి, వర్థంతి రోజున 125 అడుగుల విగ్రహం పెడితే సరిపోదు. దానికి దండలు వేస్తే
  సరిపోదు. చంద్రబాబు నాయుడుకి ఒక రోగం ఉంది. అవసరం వచ్చినప్పుడు అదే మనుషుల ఫోటోలు,
  విగ్రహాలకు దండ వేస్తారు. తర్వాత వదిలేసి ఎన్నికలకు వెళతారు. ఆయన నైజం ఎటువంటిది
  అంటే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే ఎన్నికలకు వెళ్లినప్పుడు ఆయన
  ఫోటోలకు పుష్ప మాల వేస్తుంటారు. విగ్రహాలకు దండ వేస్తుంటారు. అంబేద్కర్
  విగ్రహానికి దండవేస్తారు. తర్వాత ఆయన స్ఫూర్తికి తూట్లు పొడుస్తుంటారు. నిధుల్ని
  పక్కదారి పట్టిస్తుంటారు. పేదవారికి అన్యాయం చేస్తుంటారు. తిరిగి అంబేద్కర్
  విగ్రహానికి దండలు వేస్తారు. తానే పోరాటాలు చేస్తున్నట్లుగా ఫోజులు ఇస్తుంటారు.
  ఇటువంటి అబద్దాలు, మోసాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. చంద్రబాబు పాలన్ని ఏవగించుకొంటున్నారు.

  ఇప్పుడు చంద్రబాబు ధ్యేయం ఒకటే కనిపిస్తోంది.
  ప్రజల గొంతు వినిపించకుండా చేయాలి. ప్రజల తరపున పోరాడుతున్న పార్టీ ఎమ్మెల్యేలను
  ప్రలోభపెట్టాలి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ చెబుతున్న పార్టీ ఫిరాయింపుల చట్టం కు
  తూట్లు పొడుస్తున్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కండువా కప్పి
  పార్టీలోకి తీసుకొంటున్నారు. వాళ్ల చేత రాజీనామ చేయించటం లేదు. అనర్హత వేటు
  వేయించటం లేదు. రాజీనామా చేయించి కానీ, అనర్హుల్ని చేయించి కానీ తీసుకొంటే ఎవరూ
  కాదనరు. ప్రజల తరపున పనిచేస్తున్న పార్టీ గొంతునొక్కే పని చేయిస్తున్నారు.
  ఎందుకంటే ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి కానీ, అనర్హుల్ని చేయించి కానీ
  తీసుకొంటే వాళ్లను గెలిపించుకొనే నమ్మకం చంద్రబాబుకే లేదు. ఇంతటి దారుణమైన పరిపాలన
  చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు.

  అందుకే చంద్రబాబుకి గట్టిగా బుద్ధి రావాలని
  దేవుడ్ని ప్రార్థిద్దాం. చంద్రబాబుకి గట్టిగా బుద్ధి వచ్చే విధంగా మనమంతా అడుగులు
  వేద్దామని కోరుకొంటున్నా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతీ ఒక్కరికీ శుభాభినందనలు
  తెలుపుతున్నాను. ’’ అని వైఎస్ జగన్ చెప్పటం జరిగింది.

  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాద్
  రావు, నల్లా సూర్యప్రకాష్, వాసిరెడ్డి పద్మ, గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల
  రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   

   

Back to Top