అంకెలతో మభ్యపెడుతున్నారు

– బాబు బడ్జెట్‌ లెక్కలు యావత్‌ రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయి
–ఈ బడ్జెట్‌లోనే 2050 వరకు లెక్కలు చూపించారు
–ఐఎంఎఫ్‌ లెక్కల ప్రకారం మనమే నెంబర్‌ వన్‌ ఉన్నట్లు లెక్కలు చూపారు
–ప్రత్యేక హోదా ఇవ్వమని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు చెప్పలేదు
– ఏపీ డిస్కం రేటింగ్‌ తగ్గితే ఎవరైనా అవార్డు ఇస్తారా?
–ఏపీ, తెలంగాణ కలిపి రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌..ఎంత గొప్ప పాలనో?

విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, బడ్జెట్లో మాత్రం అంకెల మాయ చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలపై వృద్ధిరేటు ఆధారపడి ఉంటుందని, ఈ మూడు రంగాల్లో అభివృద్ధి కనిపిస్తే ముందుకెళ్లిందని, లేకపోతే తిరోగమనం అంటారని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనే 2022, 2029, 2050 సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు కూడా చంద్రబాబు చూపారని ఆయన తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 11.61 శాతం వృద్ధిరేటు సాధించిందని గొప్పలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఐఎంఎఫ్‌ లెక్కల ప్రకారం వృద్ధిరేటులో ఏపీనే నంబర్‌ వన్‌ స్థానం సాధించామని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది రూ. 3 లక్షల కోట్ల బడ్జెటు లెక్కలు చూపారని, అంత గొప్పగా పాలన సాగుతుందా అని ప్రశ్నించారు. బుధవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

ఇవాళ అందరం కూడా బడ్జెట్‌ సమావేశాలు చూశాం. నిజంగా ఈ సమావేశాలు చూసిన తరువాత బడ్జెట్‌లో వీళ్లు చూపిస్తున్న ఈ లెక్కలు చూస్తే యావత్‌ ఏపీ మొత్తం ఆశ్చర్యపోయారు. ఒక్కసారి ఈ బడ్జెట్‌ను చూస్తే..2016–2017కు సంబంధించి 11.61 శాతం జీడీపీ గ్రోత్‌రేట్‌ నమోదు కాబోతుందని చెప్పారు. వ్యవసాయరంగం, పరిశ్రమలు, సేవారంగాల్లో అభివృద్ధి కనిపిస్తే..రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్తుందంటారు. లేదంటే తిరోగమనం అంటారు. నిజంగా చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలు నిజమైతే 2022, 2029, 2050వ సంవత్సరంలో దేశంలోనే వేగవంతమైన వృద్ధిరేటు సాధిస్తామని చెప్పారు. 2050వ సంవత్సరంలో కూడా వీళ్లు టార్గెట్‌ పెట్టుకున్నారట. ఐఎంఎఫ్‌ రిసెంట్‌గా స్టాటిస్టిక్స్‌ విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆవరేజ్‌ జీడీపీ 2.6 శాతం, ఇండియాలో 7.1 శాతం అన్నారు.  అయితే ఏపీలో 11.61 శాతం నమోదు చేసిందని చెబుతున్నారు. వీరి లెక్కల ప్రకారం ఇవాళే ప్రపంచంలో మనమే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాం. దీనికోసం 2050 వరకు ఆగడం ఎందుకు. ఎంతగా చంద్రబాబు లెక్కలు చూపిస్తారన్నదానికి ఇది చిన్న ఉదాహరణ. 

 14వ ఆర్థిక సంఘానికి సంబంధమే లేదు
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు కాబట్టి, హోదా ఇవ్వడం లేదు అని చంద్రబాబు అంటున్నారు. ఈ ప్రత్యేక హోదా కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్దతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన క్రమంలో ప్రత్యేక ప్యాకేజీ పొందామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘానికి చెందిన అభిజిత్‌సింగ్‌ ఇచ్చిన లేఖను ఎన్నోసార్లు చూపించాను. ఇంకోకసారి ఆ సంఘం సభ్యుడు గోవిందరావు, ౖచైర్మన్‌ వైవీరెడ్డి కూడా మాకు, హోదాకు సంబంధం లేదని చెప్పారు. అటువంటి సిపార్సులు ఎప్పుడు చేయలేదని వాళ్లు చెబుతున్నారు.  బాబు తప్పు చేసి దాని నుంచి బయటపడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 

నష్టాలు పెరిగితే అవార్డు ఇస్తారా?
బడ్జెట్‌ ప్రసంగంలో డిస్కంలకు సంబంధించి అవార్డులు తీసుకున్నామన్నారు. 2014–2015లో రూ. 20394 లాస్‌లో ఉన్నాం, ఆ లాస్‌ 62.7 శాతం పెరిగితే ఎవరైనా అవార్డు ఇస్తారా? ఇదే డిస్కాంలకు డి ఫ్లస్‌ పోయి, డిlకి వచ్చింది. మరో డిస్కాంకు అదే రేటింగ్‌ వచ్చింది. ఈయనకు ఐదు అవార్డులు ఎందుకు ఇస్తారు. 

అంత గొప్ప పాలన సాగుతోందా?
ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రూ.1.56 లక్షల కోట్లకు ప్రవేశపెట్టారు. ఆశ్యర్యం ఏంటంటే 2013లో తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో రూ.1.40,742 కోట్లు, ఇవాళ రూ.1.56 లక్షల కోట్లు, తెలంగాణ బడ్జెట్‌ కలిపితే రూ. 3 లక్షల కోట్లు అయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత అంత గొప్ప పరిపాలన సాగుతోంది. నిజంగా ఇంత గొప్పగా పాలన సాగుతుందా అని పరిశీలిస్తే..కోర్‌ డ్యాష్‌ బోర్డులో చూస్తే..ఇందులో అన్ని ఉంటాయి. టార్గెట్‌ రూ1.28 లక్షల కోట్లు, వచ్చింది రూ.99 లక్షల కోట్లు, దాదాపు రూ. 30 వేల కోట్లు ఉంది. అప్పులు ఎంత తెచ్చుకున్నది చూపించలేదు. కాగ్‌ నివేదిక ప్రకారం చూస్తే రూ.20490 కోట్లు అప్పులు తెచ్చుకోవాలని టార్గెట్‌ పెట్టుకోగా, గత డిసెంబర్‌ నెలకే రూ.30 వేల కోట్లు తెచ్చుకున్నారు. జీఎస్‌డీపీలో 3 శాతం కన్నా ఎక్కువ తెచ్చుకోకూడదు. రాష్ట్రంలో ఉత్పత్తుల విలువ రూ.6.30 లక్షల కోట్లు ఉంది. దాని ప్రకారం వీళ్లు రూ. 20 వేల కోట్లకు మించి తీసుకోకూడదు. 5.12 శాతం అధనంగా అప్పులు తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా కోర్‌ డ్యాష్‌ బోర్డులో రెవెన్యూ చూపుతున్నాయి. అప్పులు తీసుకునే సామర్థం లేదు కాబట్టి పెన్షనర్ల డబ్బులు తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తున్నారు. నీకు అనుమతులు లేకున్నా అప్పులు చేస్తున్నావు. 

ఏ రకంగా అభివృద్ధో చెప్పాలి..
వ్యవసాయ బడ్జెట్‌ పరిశీలిస్తే..ఒక్క ఏడాది రికార్డు స్థాయిలో పట్టిసీమను పూర్తి చేసి గోదావరి నీటిని తెచ్చామని చెప్పారు. కృష్ణ నదికి నీరు ఇవ్వడం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. కృష్ణ డెల్టాలోనే 10.6 లక్షల ఎకరాల పంటలను కాపాడామని చెప్పారు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే..సోషల్‌ ఎకనామిక్‌ సర్వే పరిశీలిస్తే..ఇందులో 13 జిల్లాలకు చెందిన డేటాలో వైయస్‌ఆర్‌ హయాంలో 42.70 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తే 1.60 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు సాధించారు. 2014–2015లో 1.65 లక్షల టన్నులు ఉత్పత్తులు, 2015–2016లో పరిశీలిస్తే..41.36 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఉత్పత్తి 1.43 లక్షల టన్నులు సాధించారు. ఏ లెక్కలు చూస్తే చంద్రబాబు ఏ రకంగా అభివృద్ధి జరిగిందో చెప్పాలి. ఇంకో లెక్క చూస్తే..40.96 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేస్తే, పట్టిసీమను కలిపిన తరువాత 2015–2016లో ఇంకా తగ్గింది. కారణం ఏంటంటే పట్టిసీమ నుంచి రూ.136 కోట్లు ఖర్చు చేసి 42 టీఎంసీలు ఇచ్చారు. సముద్రంలో 52 టీఎంసీలు కలిపారు. పక్కనే ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు రూ.120 కోట్లు చెల్లిస్తే గ్రామాలు ఖాళీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అది ఇచ్చి ఉంటే 40 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వాళ్లం. ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. 

రైతుల పరిస్థితి అధ్వాన్నం
రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు ఈ బడ్జెట్‌లో రూ.360 కోట్లు కేటాయించామని చెప్పారు. అహా..ఇంతవరకు మూడేళ్లకు కలిపి బాబు రుణమాఫీకి ఇచ్చింది రూ.10600 కోట్లు, బాబు సీఎం అయ్యేనాటికి రూ.87612 కోట్ల పంట రుణాలు ఉన్నాయి. బాబు ఇచ్చింది సంవత్సరానికి రూ.300 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేశామని చెవిలో పువ్వులు పెడుతున్నారు. బాబు రుణాలు కట్టోద్దన్న మాటకు రైతులు రూ.16 వేల కోట్లు వడ్డీలు కడుతున్నారు. అంటే వడ్డీలో పావుల భాగం కూడా ఇవ్వడం లేదు. రైతులు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..రైతులకు సంబంధించి బ్యాకులు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది రూ.83 వేల టార్గెట్‌ అయితే రూ.57 వేల కోట్లు మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. ఈ మూడేళ్ల కాలంలో రైతుల రుణభారం 1.03 లక్షల కోట్లకు చేరింది.  నాలుగేళ్ల కాలానికి రైతులకు వడ్డీ రూపంలో రూ.3 వేల కోట్లు ఇస్తున్నారు. ఆ రోజు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నారు. రైతులకు ఇంతకుముందు వరకు లక్ష వరకు వడ్డీ లేని రుణాలు, మూడు లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు అందేవి. ఈ బడ్జెట్‌లో పావలా వడ్డీకి రూ.5 కోట్లు కేటాయించారు. రైతులకు పంట రుణాలురూ. 45 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. నాలుగు శాతం కేంద్ర ప్రభుత్వం కట్టాలి. ఇదిపోను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం కడితే రైతులకు వడ్డీ లేని రుణాలు అందుతాయి. 

డ్వాక్రా రుణాలు రూపాయి కూడా మాఫీ కాలేదు
డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కేటాయించింది ఎంత అంటే..క్యాపిటల్‌ ఇన్‌ప్యూజన్‌ నిమిత్తం అంటే మాఫీ కోసం కాదు అంటే బాబు బ్యాంకులకు డబ్బులిస్తారట. బ్యాంకులు డ్వాక్రా సంఘాలకు అప్పులిస్తారట. బాబు సీఎం అయ్యేనాటికి ఇదే డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు అయితే, బాబు మాటలు నమ్మి కంతులు కట్టకపోవడంతో వడ్డీలు వసూలు చేస్తున్నారు. నాలుగో సంవత్సరానికే రూ.10 వేల కోట్లు అవుతుంది. రూపాయి కూడా మాఫీ చేయకుండా అప్పు ఇస్తున్నానని గొప్పులు చెబుతున్నారు. ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందడం లేదు. డ్వాక్రా సంఘాలకు రూ.1573 కోట్లు వడ్డీ కింద ఇవ్వాల్సి ఉంది, వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడానికి బకాయిలే రూ. 900 కోట్లు, గతేడాది రూ.110 కోట్లు ఖర్చు చేశారు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఇంతవరకు వడ్డీలు చెల్లించలేదు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అరకొరగా కేటాయింపులు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.1300 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఒక్కసారి గమనిస్తే..2015–2016కు సంబంధించి 15 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 14 లక్షల మందిని ఎంపిక చేశారు. వీరికి రూ.2573 కోట్లు ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసింది 1300 కోట్లు మాత్రమే. ఇంకా బకాయిలు ఉన్నాయి. 2016–2017లో 14 లక్షల మందికి తగ్గించి, వారికి ఇచ్చింది కేవలం రూ.500 కోట్లు, రూ.1954 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ–పాస్‌లోకి వెళ్తే డాటా అంతా దొరుకుతుంది.

చెప్పిన కథే చెబుతున్నాడు
ఇక చంద్రబాబు మరో టాపిక్ హౌసింగ్. ఏం చెప్పాడంటే...రెండేళ్లలో 10లక్షల ఇళ్లు కడతానని చెప్పాడు. బాబు స్పీచ్ అయినా, గవర్నర్ స్పీచ్ అయినా ఏదైనా అంతే. ఈ సంవత్సరం 4లక్షల ఇళ్లకు కేటాయింపులు చేస్తున్నానన్నాడు. సీఎం అయిన దగ్గర్నుంచి బాబు ఇవే మాటలు చెబుతున్నాడు. 2014-15లో బాబు ఒక్క ఇళ్లు కట్టలేదు. 15-16లో 2లక్షలు కడతానని చెప్పాడు.  ఒక్కటి కూడ కట్టకపోగే వివిధ దశల్లో ఆగిపోయిన 5లక్షల 30వేల ఇళ్లకు నిధులివ్వలేదు. కడతానని ఆయన చెబుతూనే ఉన్నాడు మేం వింటూనే ఉన్నాం. 2016-17లో మళ్లీ అదే కథ చెప్పాడు. కథ కొద్దిగా మార్పు చేసి 48 వేల ఇళ్లకు ముగ్గులేశామన్నాడు. లాస్ట్ ఇయర్ బడ్జెట్  లో1332 కోట్లు హౌసింగ్ కు పెడితే ...రూ. 310కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూరల్ , అర్బన్ సెక్టార్ లలో 51వేల ఇళ్లకు మార్కింగ్ అన్నడు. 718 కోట్లకు 310కోట్లు ఇచ్చాడు. ఈ సంవత్సరం రీల్ తిప్పుతూరూ. 1450 కోట్లు హౌసింగ్ కు కేటాయిస్తున్నానన్నాడు. ఆశ్చర్యమేమంటే...హౌసింగ్ కు సంబంధించి రెవెన్యూ 1326, కేపిటల్ ఎక్స్ పిండీచర్ 129 కోట్లే కనిపిస్తోంది. కట్టిస్తానన్న 4లక్షల ఇళ్లకు కనీసం ఒక్కో ఇంటికి లక్షన్నర చొప్పున  6వేల కోట్లు అవుతుంది. కానీ కేవలం 129కోట్లు కేపిటల్ కింద పెట్టాడు. బడ్జెట్ కేటాయింపులు మాత్రం రూ. 1400కోట్లు చూపిస్తున్నాడు. ఇంకా ముగ్గువేసిన ఇళ్ల గురించి చెప్పడం లేదు. 

ఎస్సీ, ఎస్టీలపై ముఖ్యమంత్రి డాంబికాలు
ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చూస్తే తెలుస్తుంది. 2016–17లో రూ.9,457 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేశామన్నారు. అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.5,673 కోట్లే. అంటే ఖర్చు 59 శాతానికి మించలేదు. ఎస్టీలకు సంబంధించి రూ.3,435 కోట్లకుగానూ రూ.2,187 కోట్లు ఖర్చు చేశారు. అయినా వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు చంద్రబాబు డాంబికాలు పలుకుతున్నారు.

ఖర్చు పెట్టకపోయినా జనం పడి ఉంటారులే!
చంద్రబాబు హయాంలో బడ్జెట్‌ కేటాయింపులకు అర్థమే లేకుండాపోయింది. ముందుగా మాటలు చెబితే పనైపోతుంది, ఆ తరువాత ఖర్చు పెట్టినా.. పెట్టకపోయినా çప్రజలు పడి ఉంటారులే అన్నది చంద్రబాబు నైజం. పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకునేటప్పుడు కూడా మంత్రి పదవులిస్తామంటూ  తొలుత ఆశలు చూపారు, ఆ తరువాత వారు ఇంకెక్కడికి పోతారు, పడి ఉంటారులే అనే ఉద్దేశంతో మాటను దాటవేస్తారు.

బీసీలకు బాబు దగా  
బీసీల సంక్షేమం కోసం గత మూడేళ్లలో కేటాయింపుల మేరకు ఖర్చు పెట్టలేదు. 2014–15లో రూ.2,665 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.2,242 కోట్లు ఖర్చు చేశారు. 2015–16లో రూ.3,195 కోట్లకుగాను రూ.2,573 కోట్లు ఖర్చు పెట్టారు. 2016–17లో రూ.5,103 కోట్లుగాను కేవలం రూ.4,338 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చూపారు. ఇలా ప్రతి అంశంలోనూ మోసమే కనిపిస్తోంది.

ముష్టి వేసినట్లుగా నిరుద్యోగ భృతి
జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. జాబు వచ్చేంత వరకూ ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ మెనిఫెస్టోలో కూడా పెట్టారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇలా ఇంటికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.3,500 కోట్లు.. ఏడాదికి రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం బడ్జెట్‌లో ముష్టి వేసినట్లుగా కేవలం రూ.500 కోట్లు విదిల్చారు. ఆ సొమ్మును కూడా టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీల సభ్యుల పిల్లలకే ఇస్తారు.

రూ.100 కోట్లతో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తారట!
రాష్ట్రంలో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించబోతున్నామని, ఏపీ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రమని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక హాస్టల్‌కు వెళ్ళాను. అక్కడ మరుగుదొడ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. నీళ్లు లేవు. పొద్దున్నే ఎక్కడికి వెళ్తారని పిల్లలను అడిగితే చెంబులు, బాటిళ్లు పట్టుకుని కొండలు ఎక్కుతున్నామని చెప్పారు. 7.50 లక్షల మరుగుదొడ్లు కడతానని చెప్పిన చంద్రబాబు దానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కేవలం రూ.100 కోట్లు. 7.50 లక్షల మరుగుదొడ్లు కట్టాలంటే ఒక్కొక్కటీ రూ.15 వేలు వేసుకున్నా రూ.1,050 కోట్లు కావాలి. ప్రభుత్వం ఇస్తానన్నది రూ.వంద కోట్లు. ఈ సొమ్ము ఏమూలకు సరిపోతుంది? ఎవరిని మోసం చేస్తారు?

ఆరోగ్యశ్రీకి అరకొర నిధులే
ఆరోగ్యశ్రీకి రాష్ట్ర బడ్జెట్‌లో అరకొరగా రూ.1,000 కోట్లే కేటాయించారు. గతేడాది 910 కోట్లు అడిగితే బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించారు. ప్రకాశం జిల్లాలో మేము ధర్నాలు చేస్తే మరో రూ.262 కోట్లు ఇచ్చారు. 2015–16 కింద రూ.280 కోట్ల బకాయిలు ఉన్నాయి. 2016–17 కింద ఇంకా రూ.488 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘108’ కోసం అధికారులు రూ.75 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం ఇచ్చింది రూ.60 కోట్లు. బకాయిలు రూ.15 కోట్లు ఉన్నాయి. ‘104’కు రూ.80 కోట్లు అడిగితే రూ.37.5 కోట్లు కేటాయించారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు, క్యాన్సర్‌ బాధితుల పరిస్థితి దారుణంగా మారింది.


Back to Top