తండ్రి అధికారం..కొడుకు పెత్తనం

  • బాబు, లోకేష్‌ భూ దందాలకు ఆద్యులు
  • రాణి కమల దేవి భూకుంభకోణంలో లోకేష్‌ హస్తం
  • రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని లూటీ చేస్తున్నారు
  • ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా..?
  • లోకేష్ భూ బాగోతంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
  • వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌
విశాఖపట్నం: అనుభవజ్ఞుడనని బీరాలు పలికే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అవినీతి, భూ దందా కుట్రలకు ఆద్యులని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ నిప్పులు చెరిగారు. గాంధీకి వారసుడిని, నీతికి అన్నా హజారే తమ్ముడినని చెప్పుకునే చంద్రబాబు దోపిడీ పరిపాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖలో అత్యంత విలువైన రాణి కమల దేవి ప్రభుత్వ భూమిని సీఎం కుమారుడు నారా లోకేష్‌ బీనామీలతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాన్ని ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ వాటాలు వేసి పంచుకుంటున్నాడని మండిపడ్డారు. తండ్రి అధికారంతో కొడుకు పెత్తనం చేస్తున్నాడని దుయ్యబట్టారు. 

ఓటుకు నోటు కేసు నుండి రాజధాని భూ దందా వరకు, అగ్రి గోల్డ్‌ దందా నుండి డాన్‌ నయీం దందాల వరకు చంద్రబాబు, లోకేష్‌ పాత్ర స్పష్టంగా కనబడుతోందని, వారి నేరచరిత్రను ప్రజలు తెలుసుకున్నారని అమర్నాథ్ అన్నారు. గత 20 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న ప్రభుత్వ భూమిని విశాఖ పెద్దలకు వాటాలు వేసి పంచుతున్న తీరు చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకొన్నట్లుందని అన్నారు. విశాఖ నడి బొడ్డున గవర్నర్‌ బంగ్లా ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ప్రాంతంలోని సర్వే నెంబర్‌– 1027, 1028, 1029, 1196 మరియు 1197 భూమి రాణి కమల దేవి భూమి అని అన్నారు. ఐతే, ఈ ప్రభుత్వ భూమిని ఆమె ప్రైవేట్‌ భూమిగా సృష్టించి గత 20  సంవత్సరాలుగా హైకోర్టులో పోరాటం చేస్తున్న కొందరు బినామీ పెద్దల అసలు రూపం బట్టబయలు చేశారు. లోకేష్‌తో సిండికేట్‌ అయ్యి బినామీ పెద్దలు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా స్థలాన్ని పంచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ సహకారంతో సుమారు 50 మంది పెద్దలు ప్రభుత్వ భూమిని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రియలెస్టేట్‌ వ్యాపారమా అని ప్రశ్నించారు.  

ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ పరం చేయడం సిగ్గుచేటు
రాణిదేవి భూమిని సర్వేలు చేసి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌ నోటీకి ప్రభుత్వ పెద్దలు తాళాలు వేశారని అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. నిజాయితీగా  నిర్థారణ చేసి కోర్టు వ్యవహారాలలో కీలకంగా మారి అత్యంత  క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న సమయంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపు లేకుండా బదిలీ చేశారని చెప్పారు. చంద్రబాబుకు అన్ని విధాలుగా భాగస్వామి అయిన మరో నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు  పీఎస్‌గా నియమించి అధికారి నోటికి తాళం వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే భూ వివాదంలో నిజాయితీగా పనిచేస్తున్న మరో సబ్‌ రిజిస్టర్‌ పోతురాజుపై ఏసీబీని ప్రయోగించి బీనామీ పెద్దలు సస్పెండ్‌ చేయించింది నిజమా కాదా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ సర్వే నెంబర్‌ 1196,1197 భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించి విశాఖపట్నం వెబ్‌ సైటులో పెడితే , నగర కమిషనర్‌ సర్వే నెంబర్‌లను ప్రభుత్వ భూమిగా తప్పించి నివేదిక ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రిజర్వాయర్, వాటర్‌ ట్యాంక్‌లు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ స్థలంగా మార్చడం సిగ్గుచేటన్నారు. ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ ద్వారా అనేక విషయాలు ఈ సర్వే నెంబర్‌లపై అడిగినా ఒక్కదానికి కూడా నేరుగా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఉండడం సిగ్గుచేటు అని అమర్‌ విమర్శించారు. ఎఫ్‌ఎంబీ, ఎస్‌ఎఫ్‌ఏ కాపీ అడిగితే కలెక్టరేట్, తహశీల్దార్‌ కార్యాలయం చుట్టు తిప్పుతున్నారని ఫైరయ్యారు. ప్రతిపక్ష పార్టీకి జిల్లా అధ్యక్షుడినైన తనకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు. 

 లోకేష్‌ కనుసన్నల్లో ఆర్థిక వ్యవహారాలు
విశాఖ 1196 సర్వే నెంబర్‌ స్థలం కోర్టులో ఉండగానే 2002లో టీడీపీ హయాంలో రెండు వేల గజాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు కేటాయించడం నిజమా? కాదా? అని అమర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం బినామీ పెద్దలతో లాలూచి పడి వారితో బహుమతిగా తెలుగుదేశం కార్యాలయం కట్టించుకోవడం వాస్తవమా కాదా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ఆర్ధిక వ్యవహారాలన్నీ లోకేష్‌ కనుసన్నల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఈ స్థలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు పరం కాకుండా అడ్డుకుంటామని అమర్నాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా యంత్రాగం తక్షణమే ఈ వ్యవహారం ఫై దృష్టి పెట్టకపోతే లోకేష్‌ భూ భాగోతంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. రాణిదేవి భూమిని ప్రభుత్వ పరం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌. గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు,  పెందుర్తి సమన్వయకర్త అదీప్‌ రాజు, రాష్ట్ర నాయకులు కొయ్య ప్రసాద్‌ రెడ్డి, జాన్‌ వెస్లీ, పక్కి దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
Back to Top