సీమ రైతుల‌పై బాబు కపటప్రేమ

 కర్నూలు  : రాయలసీమ రైతాంగంపై చంద్రబాబునాయుడు కపటప్రేమను ఒలకబోస్తున్నారని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు.  మంగళవారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను అవినాష్‌రెడ్డి, మైదుకూర్‌ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, శ్రీశైలం ఇన్‌చార్జి బుడ్డాశేషారెడ్డి, తదితరులు సందర్శించారు. ఈసందర్భంగా వారు పోతిరెడ్డిపాడు ఈఈ శ్రీనివాసరెడ్డిని అడిగి పోతిరెడ్డిపాడు వివరాలు తెలుసుకొన్నారు. పోతిరెడ్డిపాడులో మంగళవారం ఉదయం 878.90అడుగుల నీటిమట్టం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల వరకు ఇంకా 10శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పనులు పెండింగ్‌లో ఉన్నందువల్లే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చే సుకోలేకపోతున్నామని ఈఈ వివరించారు. అలాగే ఎస్సార్భీసీ కాల్వ పూర్తిస్థాయిలో విస్తరించకపోవటం వల్ల కాల్వకు సరఫరాచేయాల్సిన 22వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయలేకపోతున్నామన్నారు. ఎస్సార్భీసీ కాల్వ కిందున్న రిజర్వాయర్లను నింపుకోలేకపోతున్నట్లు ఈఈ ఎంపీ, ఎమ్మెల్యేలకు వివరించారు. అనంతరం వారు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను పరిశీలించి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ప్రాంతంలోని బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకుగాను దివంగత ముఖ్యమంత్రి కేవలం 11వేల క్యూసెక్కుల నీటివిడుదల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడును 44వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుగుణంగా నిర్మించినట్లు తెలిపారు. ఆయన మరణానంతరం పెండింగ్‌లో ఉన్న 10శాతం పనులను ఇప్పటిదాకా పూర్తిచేయటంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద నిద్రించైనా పెండింగ్‌ పనులు పూర్తిచేయిస్తానన్న ప్రగల్భాలు పలికిన బాబు ఇప్పటిదాకా పనులు పూర్తిచేయించకపోటంతో పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితిని టీడీపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. రాయలసీమ రైతాంగంపై కపటప్రేమను వ్యక్తంచేస్తున్న చంద్రబాబునాయుడు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాడే తప్పా ఆచరణలో రాయలసీమ రైతాంగానికి ఏమాత్రం న్యాయం చేయటంలేదని ఆయన మండిపడ్డారు. ఎస్సార్భీసీ కాల్వను పూర్తిస్థాయిలో విస్తరించకపోవటంతో కాల్వ కిందున్న ఆయకట్టుకు సాగునీరు అందక రిజర్వాయర్లను నింపుకోలేని దుస్థితి నెలకొందన్నారు. రాయలసీమ రైతాంగంపై బాబుకు నిజంగా ప్రేముంటే గండికోట, చిత్రావతి, మైలవరం ప్రాజెక్టులను పూర్తిస్థాయి నీటితో నింపాలని ఎంపీ అవినాష్‌ డిమాండ్‌ చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి తెలివితక్కువ తనం వల్లే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి నోచుకోకపోగా రైతాంగానికి సాగునీరు అందని దుస్థితి నెలకొందని ఎంపీ విమర్శించారు.

బాబు మాటల్లో కాదు చేతల్లో చూపించు: రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు :

రాయలసీమ రైతాంగంపై నిజంగా చంద్రబాబునాయుడకు ప్రేముంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాంyŠ చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంటేనే రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లను నింపుకోవటంతోపాటు రైతాంగానికి సాగు, తాగునీరు సవ్యంగా అందుతుందన్నారు. ప్రస్తుతం కేవలం 12వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే డ్రాచేసుకుంటే ఆ నీళ్లు కాల్వలకు ఏమాత్రం సరిపోవన్నారు. ఎస్సార్భీసీ కాల్వకు 22వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉండగా పనులు పూర్తిచేయకపోవటం వల్ల కేవలం 7వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదలకు సాధ్యం కావటం సిగ్గుచేటన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాయలసీమ రైతాంగానికి సాగు, తాగునీరు అందకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్‌ చేతిలో బాబు కీలుబొమ్మయ్యాడు: ఐజయ్య, ఎమ్మెల్యే, నందికొట్కూరు:

అనంతరం నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యంత్రి కె.చంద్రశేఖరరావు చేతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలుబొమ్మగా మారాడని ఆరోపించారు. గతేడాది తెలంగాణ ప్రమేయం లేకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేసుకోగా ఈ ఏడాది తెలంగాణ అధికారుల పర్యవేక్షణలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేసుకోవటం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా బుక్కైన బాబు కేసీఆర్‌ చెప్పినట్లుగా నడుచుకోవటం ఆయనకేమాత్రం అడ్డుచెప్పకపోవటాన్ని బట్టిచూస్తే బాబు ఎంతరాజకీయ స్వార్థపరుడో అర్థం అవుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం చుట్టూ కృష్ణాజలాలున్నా ప్రయోజనం లేకపోగా హంద్రీనీవా ద్వారా చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సాగునీటిని తరలించటం సమంజసంగా లేదన్నారు. రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటిమట్టాలున్నా కేసీ కాల్వకు సాగునీటిని ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇస్తారనే విషయం వెల్లడించకుండా ఆయకట్టు రైతులు కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసుకోవాలని పేర్కొనటం సమంజసంగా లేదన్నారు. రైతాంగాన్ని మోసం చేస్తున్న బాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే ఐజయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మిడ్తూరు జడ్పీటీసీ యుగంధర్‌రెడ్డి, పోతిరెడ్డిపాడు డీఈ రమేష్‌బాపూజీ, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్‌సీఎల్‌ మేనేజర్‌ రమణ, పోతులపాడు శివానందరెడ్డి, గోపాల్‌రెడ్డి, జంగాలశంకరయ్య, వెంకటరమణగౌడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top