బాబుది అసమర్థ నాయకత్వం

  • ఏం సాధించారని నవ నిర్మాణ దీక్షలు
  • దీక్షకు స్వచ్ఛందంగా ఎవరూ రాలేదు
  • జాతీయ రహదారి దిగ్భందం చేసే హక్కు ఎవరిచ్చారు?
  • బాబును ప్ర‌శ్నించిన  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థుడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబు ఏం సాధించారని నవ నిర్మాణ  దీక్షలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీక్షల పేరుతో విద్యార్థులను, మహిళలను ఎండకు కూర్చోబెట్టి హింసిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నవ నిర్మాణ దీక్షకు ప్రజలు ఎవరూ కూడా స్వచ్ఛందంగా రావడం లేదని ఆయన పేర్కొన్నారు.  శుక్రవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేని చంద్రబాబు  ప్రతి ఏడాది నవ నిర్మాణ దీక్ష పేరుతో ఇది ఒక తంతుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. తన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు 2019, 2029,  2050 అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. 2014లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిని 2015లోనే అబద్ధాలు, మోసాలు చేసే వ్యక్తిగా ప్రజలు నిర్ధారించారన్నారు.  2016లో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి అని తేల్చారన్నారు. ఎన్నికల  హామీలు నెరవేర్చకుండా 2029, 2050లో అది చేస్తాం, ఇది చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రిని ప్రజలు దగాకోరుగా గుర్తించారని చెప్పారు. 

పేదల కడుపు మాడ్చుతున్నారు
చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకుల్లో కోత విధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పేదల కడుపు మాడ్చుతోందని మాజీ మంత్రి పార్థసారధి విమర్శించారు. 
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రం గ్యాస్‌ ధరలు పెంచితే  అప్పటికప్పుడు సబ్సిడీ ఇచ్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం పంచాదార, కిరోసిన్‌ రేటు పెరిగిందని, తెల్లకార్డుదారులకు ఇచ్చే 8 రకాల సరుకులు కోత విధించిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ మూడేళ్లలో కనీసం వెయ్యి ఇళ్లు కూడా కట్టలేని అసమర్థ ప్రభుత్వం..ఎప్పుడో స్వర్గాన్ని చూపిస్తామని చెబితే ప్రజలు నమ్మి పరిస్థితి లేదన్నారు. రాజధాని ఐదేళ్లలో కట్టిస్తామన్న చంద్రబాబు ఇప్పటికి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బలవంతంగా భూములు లాక్కొన్ని వాటిని పెట్టుబడిదారులకు కట్టబెట్టారని ఆక్షేపించారు. పేదల గుడిసెలను నిర్ధాక్షిణంగా కూల్చిన ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పే లెక్కలన్ని తప్పుడివే అన్నారు.

రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు
రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు.  
చంద్రబాబు అధికారంలోకి రాకముందు రైతు  ఆదాయం ఎలా ఉండేదని, మీరు వచ్చిన తరువాత రైతు ఏ విధంగా కుదేలు అవుతున్నారో గమనించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు ఏవిధంగా మద్దతు ధర పెంచారో ఆలోచించాలన్నారు.  చంద్రబాబు నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతున్నారే తప్ప ఏ ఒక్కరికి ఉపాధి కల్పించడం లేదన్నారు. మరో పక్క 15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతారని, తీరా బడ్జెట్‌ సమావేశాల్లో మాత్రం ఈ ఏడాది రూ.10 వేల కోట్లు పెట్టుబడులు ఆశిస్తున్నామని ఆర్థిక మంత్రితో ప్రకటనలు ఇస్తున్నారని తప్పుపట్టారు. 

మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు
రాష్ట్రంలో చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, ఇందుకు తాజా ఉదాహరణ నవ నిర్మాణ దీక్షలే అన్నారు. ఈ దీక్షలకు ప్రజలు ఎవరూ కూడా స్వచ్ఛందంగా రావడం లేదని తెలిపారు. అసలు నవనిర్మాణ దీక్షలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మీ దీక్షలకు ఏ ఒక్కరు స్వచ్ఛందంగా రాకపోవడంతో  ఒక్కో డ్వాక్రా గ్రూప్‌కు రూ.10 లక్షలు రుణాలు ఇస్తామని చెప్పి మహిళలను దీక్షకు తీసుకొచ్చారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమం నికృష్టమైన చర్యగా పార్థసారధి అన్నారు. మీరు నిజంగా మంచి కార్యక్రమం చేయాలనుకుంటే సభకు వచ్చే వారికి నీడ కల్పించే వారన్నారు. ఈ నవ నిర్మాణ దీక్ష ఓ ఫార్స్‌. మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇదో డ్రామా అని పార్థసారధి అభివర్ణించారు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి ఇబ్బందుల పాలు చేయడం సరైంది కాదని, ఇలాంటి నికృష్ట కార్యక్రమాలు మానుకోవాలని ప్రభుత్వానికి పార్థసారధి హితవు పలికారు.

Back to Top