మాటల గారడీ మోసం ఇంకెన్నాళ్లు బాబూ?


నిరుద్యోగ భృతితో యువతను మోసం చేస్తున్న టీడీపీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా?
10 లక్షల ఉద్యోగాలు ఎక్కడ.. ఎవరికి ఇచ్చారో చెప్పాలి
యువతను మభ్యపెట్టేందుకు 20 వేల ఉద్యోగాల ప్రకటన
కార్మిక వ్యవస్థను తీవ్రంగా మోసం చేశారు
చంద్రబాబుపై కార్మికులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి

విజయవాడ: మాటలతో గారడీ చేయడం.. దొంగ లెక్కలు చూపించి ప్రజలను వంచించడం తప్ప నాలుగేళ్లుగా చంద్రబాబు రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గౌతమ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో ఓట్ల కోసం 2 కోట్ల మందికి నిరుద్యోగ భృతి రూ. 2 వేల చొప్పున ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు.. 12 లక్షల మందిని ఎంపిక చేసి రూ. వెయ్యి ఇస్తాననడం హేయనీయమన్నారు. లక్షల ఉద్యోగాలు అని ప్రకటించి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడబెరికిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. రైతులు, విద్యార్థులు, డ్వాక్రా సంఘాలు, నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేసిన చంద్రబాబు పచ్చమీడియాతో తానేదో గొప్ప వ్యక్తిగా ప్రచారం చేయించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు చేసిన వాగ్ధానాలను ఒకొక్కటిగా చెబుతూ మోసాలను బయటపెట్టారు. 
– 2014 ఎన్నికల ముందు నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మత్స్యపరిశ్రమలను నెలకొల్పుతామని ప్రకటించారు. ఎక్స్‌పోర్టు అథారిటీ యూనిట్‌ నెలకొల్పుతామని చెప్పారు. 
– కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు టెక్స్‌టైల్స్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
– కర్నూలు, అనంతపురం జిల్లాలకు సిమెంట్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామన్నారు. 
– కృష్ణాజిల్లాను ఆటోమొబైల్‌æహబ్, ప్రకాశం జిల్లాకు గ్రానైట్‌ హబ్‌గా ఏర్పాటు చేస్తానన్నారు. 
– అనంతపురం, చిత్తూరు, కర్నూలు కేంద్రాలుగా పౌరవిద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
– ఇదే కాకుండా నూతన పారశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి 30 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తానని చెప్పిన చంద్రబాబు 30 నెలలు కాదు మూడు సంవత్సరాలు అయినా పరిశ్రమలు రాలేదదన్నారు. 
– కృష్ణ, చిత్తూరు, తూర్పుగోదావరి ఫౌల్ట్రీ, ఫ్లోరీ పరిశ్రమ ఏర్పాటు చేస్తానని చెప్పారు. 
– విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలను ఐటీహబ్‌లుగా తయారు చేస్తామన్నారు. 
– రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డెయిరీ ఫాంలను ఏర్పాటు చేస్తామన్నారు.

వీటిల్లో ఒక్క హామీనైనా నెరవేర్చారా చంద్రబాబూ అని గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. పెద్ద మేనిఫెస్టోలో 10 అంశాలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. చెప్పినవన్నీ చేసి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని, ఎవరినీ దేహీ అని అడిగే పరిస్థితి ఉండేది కాదన్నారు. లేదంటే రాష్ట్రంలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమలు పెట్టించినా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేవారమన్నారు.

చంద్రబాబు ప్రకటించిన ఉద్యోగాలు..

చంద్రబాబు ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నట్లుగా 2014లో ఇచ్చినట్లుగా హామీలు గుప్పిస్తున్నారని గౌతమ్‌రెడ్డి విమర్శించారు. ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తారని ప్రశ్నించారు. 2014 మే 4వ తేదీన 20 వేల ఉద్యోగాలు అని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పటి వరకు వాటిని భర్తీ చేయలేదని, మళ్లీ అదే ప్రకటన ఇవాళ పత్రికల్లో రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు రెండు సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలని ప్రకటించారన్నారు. రూ. 35 వేల కోట్లతో 75 వేల ఉద్యోగాల ఏర్పాటని, ప్రాంతాల వారిగా పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని 2014 సెప్టెంబర్‌లో చెప్పారని గుర్తు చేశారు. పరిశ్రమలు ఎక్కడైనా కనిపించాయా అని ప్రశ్నించారు. 2020 నాటికి రూ. 20 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తానని 2015 మే 4వ తేదీన ప్రకటించారన్నారు. అదే విధంగా రూ. 600 కోట్ల పెట్టుబడులతో 300 ఉద్యోగాలని 2015 మే నెలలో ప్రకటన వెల్లడించారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని గౌతమ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మాటలతో ప్రజలను మభ్యపెట్టగలనని అనుకుంటున్నాడని, కానీ చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోయే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద కూలీగా పనిచేస్తానని రాజమండ్రి సభలో గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. కార్మిక వ్యవస్థను ఎందుకు మోసం చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలు అర్థరాత్రి విధులు నిర్వర్తిస్తే వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత నాది అని.. ఆ హామీని విస్మరించాడన్నారు. ఉచిత బీమా అమలు చేస్తానని ఇప్పటి వరకు చేయలేదన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు సర్కార్‌పై కార్మిక వ్యవస్థ తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయని 20 వేల ఉద్యోగాలంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఆటలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం మారాలన్నారు. చంద్రబాబు చేసిన దగాపై ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. 
Back to Top