బాబు కాపుల‌ను అవమానిస్తున్నారు

ఎన్నిక‌ల‌ ముందో మాట..తర్వాతో మాట
కాపుల హామీలేమయ్యాయి బాబు
కాపుభవనాలకు బాబు పేరు పెడతారా
అంతకన్నా దారుణం మరొకటి ఉండదు
వైయ‌స్సార్సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు

హైదరాబాద్ః కాపు భ‌వ‌నాల‌కు చంద్ర‌న్న కాపు భ‌వ‌నం అని పేరు పెట్ట‌డం కాపుల‌ను ఘోరంగా అవ‌మానించి, కించ‌ప‌ర్చిన‌ట్లేన‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అన్నారు. కాపుల్లో పుట్టిన మ‌హానేత‌లు ఎంద‌రో ఉండ‌గా బాబు ఆయ‌న పేరునే పెట్టుకోవ‌డంలో అంత‌ర్యం ఏమిట‌నీ అంబ‌టి ప్రశ్నించారు. కేవ‌లం ప్ర‌జ‌ల్ని మభ్య పెట్టేందుకే రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నామ‌న్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఐదు సంవ‌త్స‌రాల కాలంలో రూ. 5వేల కోట్లు కాపుల‌కు ఖ‌ర్చుపెడ‌తామ‌న్నార‌ని, నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో కాపుల‌ను బీసీలో చేర్చుతామని చెప్పారని..ఇచ్చిన  హామీ ఏమైంద‌ని బాబును ప్రశ్నించారు. బాబు ఇచ్చిన హామీల‌ను చూసే కాపు కుల‌స్తులు టీడీపీకి ఓట్లు వేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. 

ప్ర‌భుత్వ ప‌థ‌కాలా..?  బాబు ప‌థ‌కాలా..?
అలులేదు... సూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్లు బాబు ప‌థ‌కాల‌ను ప్రారంభించిది లేదుగానీ ఆ ప‌థ‌కాల‌కు మాత్రం త‌న పేర్ల‌ను పెట్టుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. చంద్ర‌న్న స్వ‌యం ఉపాధి ప‌థ‌కం, చంద్ర‌న్న విదేశీ విద్య దీవేన‌, చంద్ర‌న్న విద్యోన్న‌తి, చంద్ర‌న్న కాపుభ‌వ‌నాలు, చంద్ర‌న్న ఉప‌కార‌వేత‌నాలు, చంద్ర‌న్న భూసారా ప‌రీక్ష‌లు, చంద్ర‌న్న సంక్రాతి కానుక‌, చంద్ర‌న్న బీమా, చంద్ర‌న్న హామీ అంటూ కేవ‌లం ఆయ‌న పేరు మీద ప‌థ‌కాల‌ను చెబుతున్నారే త‌ప్ప అందులో ఒక్కటి కూడా అమ‌లు కావ‌డం లేద‌న్నారు.  ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్పుడు దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సైతం ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశార‌ని, ఇలా ఎవరూ వారి పేర్లు పెట్టుకోవాల‌ని తాప‌త్రాయ‌ప‌డ‌లేద‌న్నారు. పేద ప్ర‌జ‌ల కోసం డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆరోగ్య‌శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, 108, ఫించ‌న్లు ఇలా ఎన్నో ప‌థ‌కాలు తీసుకొచ్చార‌ని కానీ అందులో ఏ ఒక్క ప‌థ‌కానికి త‌న పేరును వినియోగించ‌ని మ‌హోన్న‌త వ్య‌క్తి రాజ‌శేఖ‌ర‌రెడ్డి అన్నారు. 

మ‌హోన్న‌త వ్య‌క్తులు ఎంతో మంది ఉండ‌గా... బాబు పేరే ఎందుకు..?
కోడి రామామూర్తినాయుడు ఫైల్‌వాన్‌గా పేరుగాంచార‌ని, క‌న్నగంటి హ‌నుమంతు కాపు కులంలో పుట్టి స్వాతంత్ర్య స‌మ‌రంలో పాల్గొన్న మ‌హోన్న‌త వ్య‌క్తి అని, చ‌ల‌న చిత్ర సీమ‌లో త‌న‌కంటూ ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు, క్రికెట్‌లో భార‌త‌దేశానికి మొట్ట‌మొద‌టిగా కెప్టెన్‌గా చేసిన సీకే నాయుడు, మ‌హాన‌టి సావిత్రి, వంగ‌వీటి మోహ‌న‌రంగారావులాంటి ఎంతో మంది కాపు ప్ర‌ముఖులు ఉన్నా... కాపు భ‌వ‌నాల‌కు బాబు పేరు పెట్టడమంటే వారిని అవమానించడమేనన్నారు.  
ఒక్క‌సారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి . 2014-15 సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబు కాపు కుల‌స్తుల‌కు ఖ‌ర్చు పెట్టింది... నిధులు కేటాయించింది ఏమీ లేద‌న్నారు. 2015-16 సంవ‌త్సరంలో రూ. 96 కోట్ల ఖ‌ర్చు పెడ‌తామ‌ని చెప్పి కేవ‌లం రూ. 70 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌న్నారు. నాలుగు మాసాలు గడిచినా కాపులకిచ్చిన హామీలపై అతీగతీ లేదని మండిపడ్డారు.  ముద్ర‌గ‌డ ప‌ద్మానాభం ఆగ‌స్టు 21న లేఖ రాయ‌డం వ‌ల్లే కాపుల‌ను బీసీల్లో చేర్చే విష‌యంపై మంజూనాథ క‌మిష‌న్ ను జ‌న‌వ‌రి 18 2016లో వేశార‌ని, ఇప్ప‌టికి ఆ క‌మిష‌న్ ప‌ని చేసిన దాఖాలాలు ఎక్క‌డ క‌నిపించ‌డం లేద‌న్నారు. కాపు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేయ‌కుండా, కాపుల‌ను బీసీలో చేర్చ‌కుండా బాబు మీన‌మేషాలు లెక్కిస్తున్నార‌ని ఆయ‌న ఫైరయ్యారు. ముద్ర‌గ‌డ ప‌ద్మానాభం ఆందోళ‌న చేయ‌డం వ‌ల్లే ఈ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారే త‌ప్ప బాబుకు కాపుల‌పై చిత్త‌శుద్ధి లేద‌న్నారు. 
కాపుల‌కు కోసం రూ. 5 వేల కోట్ల‌లో రూ. వంద కోట్ల‌ను కూడా ఖ‌ర్చు పెట్టిన దాఖాలాలు లేవ‌న్నారు. ఇప్ప‌టికైనా బాబు త‌క్ష‌ణ‌మే కాపుల కోసం ఎంతమేర నిధులు ఖ‌ర్చు చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని రాంబాబు డిమాండ్ చేశారు.  మీరు ఇచ్చిన హామీలనే కాపులు అడుగుతున్నారు త‌ప్ప బిక్షందేహీ అని అడ‌గడం లేద‌న్నారు. 

స్వార్థ రాజకీయాలు చేయొద్దు
కాపు కులస్తులు నిధులు ఇస్తే... ఆ నిధులను తీసుకొని బాబు ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌హాయం చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. దీనికి ప్ర‌భుత్వాలు ఎందుక‌ని నాన్ గ‌వ‌ర్న‌మెంట్ ఆర్గ‌నైజేషన్లు చాలా ఉన్నాయ‌న్నారు. శ్రీ‌శైలంలో కాపు క‌ళ్యాణ మండ‌పాన్ని కాపులే నిర్మించుకున్న విష‌యం బాబు తెలుసుకోవాల‌న్నారు. కాపుల‌ను కించ‌ప‌ర్చే విధంగా స్వార్థ రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న బాబుకు సూచించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌కు ల‌క్ష రూపాయ‌ల రుణాలు, ల‌క్ష రుపాయ‌ల స‌బ్సిడీ ఇస్తామ‌ని చెప్పిన బాబు.... ఇప్పుడు రూ. 50 వేలు ఇస్తామ‌న‌డం ఎంత‌వ‌ర‌కు స‌మాంజ‌స‌మ‌ని అడిగారు. అందులో రూ. 25వేలు స‌బ్సిడీ, రూ. 25వేలు బ్యాంకుల‌కు చెల్లించాల్సి ఉంద‌న్నారు. 

రాజీనామా చేసి మాట్లాడు భూమా
బీసీల‌కు రూ. 2.5ల‌క్ష‌ల ఆధాయ ప‌రిమితి పెంచాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రూ. 50వేల రుణాల కోసం అభ్య‌ర్థులు బ్యాంకుల చుట్టూ తిర‌గ‌లేక చెప్పులు అరిగిపోతున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. రాయ‌ల‌సీమ వారికి పౌరుషం ఎక్కువ‌ని అంటార‌ని, భూమా నాగిరెడ్డికి పౌరుషం ఉంటే ...రాజీనామా చేసి మాట్లాడాల‌ని స‌వాల్ విసిరారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌తిప‌నిని త‌ప్పుబ‌ట్ట‌డ‌మే టీడీపీ ధ్యేయంగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం వైయ‌స్ జ‌గ‌న్ దీక్ష చేస్తే మంత్రులు దూషణలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 
Back to Top