ఎమ్మెల్యే ఐజ‌య్య‌ను అవ‌మానించిన సీఎం

క‌ర్నూలు:

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజ‌య్య‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి అవ‌మానించారు. క‌ర్నూలు జిల్లా ప‌గిడ్యాల మండ‌లం ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఎమ్మెల్యే ఐజ‌య్య ప్ర‌సంగిస్తుండ‌గా మైక్ క‌ట్ చేసి అడ్డుకున్నారు. అంత‌కు ముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల పనులు పూర్తి కాకుండానే ఇప్ప‌టికి రెండు సార్లు ప్రారంభించార‌ని అన్నారు. అప్రోచ్ కెనాల్ ప‌నులు పెండింగ్‌లో ఉండ‌గా ప్రారంభోత్స‌వాల పేరుతో హ‌డావుడి చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించ‌డంతో చంద్ర‌బాబు ఎమ్మెల్యేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మైక్ ఇచ్చినా స‌ద్వినియోగం చేసుకోకుండా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. దీంతో ఎమ్మెల్యే ఐజ‌య్య మ‌న‌స్థాపానికి గురై వేదిక దిగి వెనుతిరిగారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..స‌భ‌లో మాట్లాడ‌కుండా త‌న‌ను ప‌దే ప‌దే సీఎం అవమానానికి గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ద‌ళిత ఎమ్మెల్యే కావ‌డంతోనే చంద్ర‌బాబు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఇదే ప్రాంతంలో నిర్వ‌హించిన స‌భ‌లోనూ, అలాగే మూడు నెల‌ల క్రితం జూపాడుబంగ్లా మండ‌లంలో నిర్వ‌హించిన స‌భ‌లోనూ ఐజ‌య్య మాట్లాడుతుండ‌గా మైక్ క‌ట్ చేసిన విష‌యం విధిత‌మే. చంద్ర‌బాబు తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, ద‌ళిత సంఘాల నాయ‌కులు ఖండిస్తున్నారు. 

Back to Top