వైయస్ఆర్ జిల్లాపై కక్షసాధిస్తున్న చంద్రబాబు

వైయస్సార్ జిల్లాః  కడప కలెక్టరేట్ వద్ద జరిగిన రైతు మహాధర్నాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై గర్జించింది. కడప జిల్లా రైతాంగానికి  చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై నిప్పులు చెరిగింది. రాయలసీమపై కక్షసాధిస్తున్న బాబు నీచ రాజకీయాలపై విరుచుకుపడింది. కడప జిల్లా రైతాంగాన్ని ఆదుకునే వరకు న్యాయపోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. 

గడికోట శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి ఎమ్మెల్యే)
రైతులను మోసపుచ్చేందుకు,  ఇన్ పుట్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకే చంద్రబాబు రెయిన్ గన్ ల నాటకం ఆడుతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.  పంటలు నాశనం అయ్యాక కొన్ని చుక్కలు తడపడం వల్ల ఏం లాభమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  కడపలోని మంగంపేట మైనింగ్, ఎర్రచందనాన్ని వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈప్రాంత వనరులను  అమ్ముకుంటూ చంద్రబాబు జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్రమశిక్షణ గలికిన కడప జిల్లా వాసులను రౌడీలు, గూండాలుగా చిత్రీకరిస్తూ బాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మన భవిష్యత్తు కోసం వైయస్ జగన్ మొక్కవోని దీక్షతో ప్రభుత్వంపై పోరాడుతున్నారని, దానిలో భాగంగానే రైతులకు మద్దతుగా ఇక్కడకు వచ్చారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.  ఉదయమంతా ఉక్కపోతగా ఉన్నా, వైయస్ జగన్ వచ్చాక మేఘాలు కూడా గొడుగు పట్టాయన్నారు. దేవుడి ఆశీర్వాదం కూడా మనకుందని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల లెవల్ శాశ్వతంగా మెయింటైన్ చేయడంతో పాటు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలి, రాయలసీమను అన్నిప్రాంతాలతో సమానంగా అభృవృద్ధి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కొరుముట్ల శ్రీనివాసులు(రైల్వే కోడూరు ఎమ్మెల్యే)
శ్రీశైలం జలాశయంలో  854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయకుండా... కేసీ కెనాల్, బ్రహ్మసాగర్, గాలేరు నగరి, హంద్రీనావాకి ఏవిధంగా వాటర్ ఇస్తారని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకే మన నాయకుడు వైయస్ జగన్ మహాధర్నా చేపట్టారని శ్రీనివాసులు చెప్పారు. వైయస్ జగన్ తోనే ఈప్రాంతానికి  న్యాయం జరుగుతుందని రైతులు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఈప్రాంత ప్రయోజనాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వైయస్ జగన్ ఇక్కడకు వస్తున్నారని తెలిసి బాబుకు వణుకు పుడుతోందని అన్నారు. జగనన్న మాదిరి ధైర్యం, సాహసం బాబుకు లేదు గనుకే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. మహానేత వైయస్సార్ హయాంలో ఏబీఎండీసీ మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లిందని చెప్పారు. బాబు పాలనలో సాగు అందక వేరుశనగ, అరటి, బొప్పాయి సహా అనేకతోటలు ఎండిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. 

రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి(ప్రొద్దుటూరు ఎమ్మెల్యే)
నీళ్లు ఇవ్వకుండా కడప జిల్లాపై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం చేస్తూ..ఏమీ తెలియనట్టు చంద్రబాబు నిద్రపోతున్నట్లు నటిస్తున్నారని నిప్పులు చెరిగారు. 10 టీఎంసీల నీళ్లు ఇస్తే కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న 92 వేల ఎకరాలు సాగుచేసుకోవచ్చని అన్నారు. శ్రీశైలంలో 151 టీఎంసీలున్నప్పటికీ...నీళ్లు ఇవ్వకుండా  ప్రభుత్వం ద్రోహం చేస్తుందని ఆగ్రహించారు.  శ్రీశైలం నుంచి నుంచి సాగర్, కృష్ణాడెల్టాకు విద్యుత్, తాగునీరు అంటూ నీళ్లను మళ్లిస్తున్న చంద్రబాబు...కడప జిల్లాకు కనీసం 10 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు మనసు రావడం లేదని మండిపడ్డారు. మహానేత వైయస్ఆర్ ను కడప జిల్లా ప్రజలు ప్రేమిస్తున్నారనే బాబు కక్షసాధిస్తున్నారని అన్నారు.  రుణమాఫీ, ఉద్యోగం, నిరుద్యోగభృతి, రేషన్, జాగా, సైకిళ్లు , పాస్ లు, చేనేతలకు మాఫీ, ఇలా వందలాది హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ చేయడం లేదని ధ్వజమెత్తారు. వైయస్ జగన్  ముఖ్యమంత్రి అయితేనే జిల్లా సస్యశ్యామలం అవుతోందని స్పష్టం చేశారు. వైయస్ఆర్ సువర్ణ సామ్రాజ్యాన్ని జిల్లాకు తెచ్చుకోవాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.   కేసీ కెనాల్ కింద 92 వేల ఎకరాలతో పాటు బ్రహ్మసాగర్ కింద ఉన్న  లక్ష 20 వేల ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కడప రైతాంగం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉందన్నారు.జిల్లా వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top