చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే..

మత్స్యకారులను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోపిదేవి వెంకటరమణవిజయవాడ: మత్స్యకారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఆ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోపిదేవి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌లు అడిగినందుకు మత్స్యకారుల సంఘం పెద్దలను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మోపిదేవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కులరాజకీయాలకు తెరలేపి తన రాజకీయ స్వార్థం కోసం సున్నితమైన రిజర్వేషన్‌ అంశాన్ని తీసుకువచ్చారన్నారు. అన్ని విధాలుగా వెనుకబడిన మత్స్యకారులను రిజర్వేషన్‌ కల్పించాలని స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 2 రోజుల పాటు విస్తృతస్థాయి సమావేశం జరిగిందన్నారు. కానీ పార్లమెంట్‌లో చిన్న టెక్నికల్‌ ప్రాబ్లంతో బిల్లును వెనక్కు పంపించారన్నారు. తరువాత మత్సకారులను ఎస్టీల్లో చేర్చుతాను.. నమ్మండి అని 2014లో శ్రీకాకుళం ఎన్నికల సభలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వారిని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 

మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని గత కొద్ది రోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మత్స్యకారులు రిలే నిరాహారదీక్షలు, ధర్నాలు చేస్తున్నారన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, మత్స్యకారుల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గణేష్‌ నాయకత్వంలో కొంత మంది కుల పెద్ద ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తే ఆయన ప్రవర్తించిన తీరుకు సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘తమాషాలు చేస్తున్నారా.. బెదిరిస్తున్నారా.. ధర్నాలు, నిరసనలు చేస్తే చేయాలని రూల్‌ ఉందా.. నా దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నారు. మీకున్న ముగ్గురు శాసనసభ్యుల్లో ఒకరికి మంత్రి ఇచ్చాను అదే మీకు ఎక్కువ, ఎక్కవ మాట్లాడితే.. మీ గ్రామాల అభివృద్ధి నిలిపివేస్తా.. నేను చెప్పినట్లు విని టెంట్లు తీసివచ్చి సహకరించండి’ అని బెదిరింపు ధోరణితో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం క్షమించరానిదన్నారు. 

అదే విధంగా నా మాట వినకపోతే తాటతీస్తానని చెప్పి మాట్లాడడం ఎంత వరకు సమంజసం అని మోపిదేవి  ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం ప్రాణాలను పనంగా పెట్టి సముద్రంపై ఆధారపడి జీవనం సాగించే వారిని ఇలా బెదిరించడం విడ్డూరంగా ఉందన్నారు. నీ అధికార దాహంతో బెదిరిస్తే దాసోహం అని వారం కాదన్నారు. తెగిస్తే ఎక్కడి వరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మత్స్యకారుల సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top