బాబు రాజీనామా చేయాలి

  • ఓటుకు కోట్లు కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టారు
  • ఐదుకోట్ల మంది భవిష్యత్తును తాకట్టుపెట్టారు
  • జైట్లీ ప్రకటనను స్వాగతించడానికి బాబు ఎవరు..?
  • రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్ః చంద్రబాబు ఐదుకోట్లమంది ఆంధ్రుల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. మొన్నటి అర్థరాత్రి నుంచి చంద్రబాబు డ్రామాలు నడిపిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయి కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితుల్లోకి బాబు వెళ్లిపోయాడని వైయస్ జగన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏపీకి తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవాలని, తక్షణమే బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు.  అసెంబ్లీ కమిటీ హాల్లో మీడియా సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే....

అబద్ధాలు, కుంటిసాకులు వెతుక్కున్నారు
ఎవరైనా పగటిపూట ప్రకటన చేస్తారు. కానీ, అర్థరాత్రి పూట అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటించడం...అదే అర్థరాత్రి ప్రెస్ మీట్ పెట్టి వత్తాసు పలకిన చంద్రబాబుకు నిజాయితీ ఎక్కడుంది. షోకాల్డ్ ప్యాకేజీకి సంబంధించి చంద్రబాబు 17సార్లు చదివారు, ప్రధాని చదివారు. జైట్లీ ప్రకటన చేస్తారంటూ టీడీపీ నేతలు పగలంతా బిల్డప్ ఇచ్చారు. అరగంట అరగంటకు అదిగో ఇస్తున్నాడు, ఇదిగో ఇస్తున్నాడంటూ ఒకటే ప్రకటనలు చేశారు. మామూలుగా నేను రాత్రి 9.30 కే పడుకుంటా. ఆరోజు రాత్రి మాత్రం చాలాసేపు మెలకువగా ఉన్నా. తీరా చూస్తే జైట్లీ కొత్తగా చెప్పిందేమీ లేదు. పైగా ప్రత్యేకహోదా ఇవ్వబోమని జైట్లీ నొక్కివక్కానించారు. హోదా ఇవ్వకపోవడానికి అబద్ధాలు, కుంటిసాకులు వెతుక్కున్నారు. 

కేసునుంచి బయటపడేందుకు కేంద్రంతో కాళ్లబేరం
సాక్షాత్తు బాబుకు సంబంధించిన మంత్రి సుజనాచౌదరి, బీజేపీకి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులను కూర్చోబెట్టి బాబు అర్థరాత్రి ప్రకటన ఇప్పించారు. పైగా ఇచ్చింది తీసుకోకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని మాట్లాడుతున్నాడు. ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్లు అని కాంగ్రెస్, పదేళ్లు అని బీజేపీ...అధికార, ప్రతిపక్షం రెండూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇవాళ కుంటిసాకులు చెబుతుంటే, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన దాన్ని ఎందుకివ్వరని చంద్రబాబు పోరాడాల్సిందిపోయి....మంత్రులను ఉపసంహరించుకోవాల్సింది పోయి...అర్థరాత్రి దాటాక ప్రకటన స్వాగతిస్తానంటాడు.  స్వాగతించడానికి ఈయనెవరు. 5 కోట్ల మంది ప్రజల విషయం.  రాష్ట్రంలో సుడిగుండంలో ఉన్న యువత భవిష్యత్తును నాశనం చేయడానికి చంద్రబాబు ఎవరు. ఎందుకు బాబు ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకు నిలదీయలేకపోతున్నారు. ఓటుకు కోట్లు కేసులో విచారణ చేసి రిపోర్ట్ ఫైల్ చేయమన్నప్పుడు బాబు డ్రామా ప్రారంభించారు. కేంద్రంతో కాళ్ల బేరం ఆడారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు కోట్లాది రూపాయల నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయన పరిస్థితుల్లో... కేసునుంచి బయటపడేందుకు 5కోట్ల మంది ప్రజలకు బాబు వెన్నుపోటు పొడిచాడు. బాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు. కేంద్రం వెళ్లమన్నా వెళ్లే పరిస్థితిలో లేడు. 

స్పీకర్, గవర్నర్ పై దాడి చేయించాడు
అసెంబ్లీలో బాబును గట్టిగా నిలదీస్తుంటే కనివిని ఎరుగని పద్ధతిలో టీడీపీ వాళ్లు, స్పీకర్ ఇద్దరూ కలిసి అడ్డుకుంటున్నారు. బాబు స్టేట్ మెంట్ ఇస్తారని చెబుతారు. ఎన్నిసార్లు ఇస్తారు. హోదా రావడం లేదన్న కోపంతో రాజీనామా చేయాలంటే స్టేట్ మెంట్ ఇస్తారట. దానికి చప్పట్లు కొట్టాలట. ఇదేనా ప్రజాస్వామ్యం...? రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్షాన్ని కలుపుకొని పోయి జైట్లీకి జ్ఞానోదయం అయ్యేట్లు చేయాల్సిన ముఖ్యమంత్రి ....చివరకు ప్రతిపక్షం చెప్పే విషయాలను కూడా వినే పరిస్థితిలో లేడు. పైగా మార్షల్స్ తెప్పించడం. ఒక్క ఎమ్మెల్యే కూడా సస్పెండ్ కాకపోయినా అసెంబ్లీలో మార్షల్స్ చూడడం ఇదే మొదటిసారి. చంద్రబాబు ఇంత కంటే దారుణంగా స్పీకర్‌ను వాడుకున్నారు
తనకు నచ్చని వారి విషయంలో ఆయన దారుణాతి దారుణంగా ప్రవర్తించారు. 1989-94 మధ్య ఆలపాటి ధర్మారావు స్పీకర్‌గా ఉన్నప్పుడు కుర్చీ లాగేశారు, మెడపట్టుకుని తోసేశారు. 2004-09లో స్పీకర్‌గా ఉన్న దళిత మహిళ కుతూహలమ్మ చేత కన్నీరు పెట్టుకున్నారు. 2009-14లో గవర్నర్ ప్రసంగిస్తుంటే చంద్రబాబు చేతులు ఊపుతూ గవర్నర్ మీద దాడి చేయించారు. 

కలిసికట్టుగా పోరాడుదాం..హోదాను సాధిద్దాం
ప్రత్యేకహోదా అన్నది మన హక్కు. దీన్ని వదిలేస్తే ఎవరూ పట్టించుకోరు. నేను కూడా వదిలేస్తే ఎవరూ పట్టించుకోరు. దీనికోసం పోరాటం చేయాలి. తెలంగాణను కేసీఆర్ వదిలేసుంటే వచ్చేది కాదు.  పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హక్కు. న్యాయం అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది. పోరాడి సాధించుకుందాం. ఎప్పుడు వస్తుందో తెలియదు గానీ పోరాడడం అన్నది మానేస్తే ఎప్పటికీ రాదు. అవరోధాలు కల్పించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అవరోధాలను ఎదురొడ్డి పోరాడుదాం. బాబు చేసిన తప్పులను ఎత్తిచూపేందుకు గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తున్నాం. బాబు, జైట్లీ చేసిన మోసపూరిత ప్రకటన వల్ల అసెంబ్లీ స్తంభించిపోయిందని దేశం మొత్తం తెలిసేలా చేశాం. రేపు మన యువతకు ఉద్యోగాలు రావాలంటే హోదా రావాలి. హోదాతోనే పరిశ్రమలు, పన్నురాయితీలు వస్తాయి. హోదా అన్నది మన పిల్లలకోసం చేస్తున్నామన్నది మర్చిపోకూడదు. రేపు పొద్దున్నే ప్రతీ ఒక్కరూ బంద్ లో పాలు పంచుకోండి. విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయండి. బంద్ ను నిర్వీర్యం చేసేందుకు బాబు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. గతంలో మోడీ వస్తున్నాడని తెలియగానే...నిరవధిక నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకున్న సమయంలో నన్ను ఎత్తివేశారు. మొన్న ఇచ్చిన రాష్ట్ర బంద్ విజయవంతం అవుతుందని చెప్పి బాబు కావాలని బస్సులు తిప్పాడు. బాబు ఎన్ని కుట్రలు చేసినా మన కోసం, మనపిల్లల కోసం చేస్తున్న బంద్ ను విజయవంతం చేయండి. మీడియాను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. జగన్ ఒక్కటితోటి కాదు. ఏపీలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలి. రాష్ట్రంలోని పార్టీలు, మీడియా, అన్ని సంఘాలు తోడ్పాటునివ్వాలని కోరుతున్నానని వైయస్ జగన్ స్పష్టం చేశారు. 
 

Back to Top