చంద్రబాబుకు ధర్మం తెలియదు.. పోరాటం తెలియదు


జీవితమంతా వెన్నుపోట్లు, అవినీతే
హోదాపై టీడీపీ డ్రామాలను ప్రజలు ముందు పెడతాం
వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: చంద్రబాబుకు దొంగపోరాటం తెలుసు కానీ, ధర్మం తెలియదు.. పోరాటం తెలియదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు జీవితం అంతా అవినీతి, వెన్నుపోట్లేనని ఆరోపించారు. నెల్లూరులో శనివారం జరగబోయే వంచనపై గర్జన దీక్ష ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం జరిగిందని నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఒక్కరే పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల్లో అన్యాయం జరిగిందని దీక్షలు, ధర్నాలు, పోరాటాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేపట్టామన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వైయస్‌ జగన్‌ ప్రజలకు వివరించారన్నారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా, కేంద్రంతో భాగస్వామిగా కొనసాగిన చంద్రబాబు... ప్రత్యేక హోదా ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ప్యాకేజీ వస్తుందని పలువురికి సన్మానాలు సైతం చేశారన్నారు. 

వైయస్‌ జగన్‌ పోరాటాలతో ప్రజల్లో చైతన్యం..

వైయస్‌ జగన్‌ పోరాటాలతో ప్రజల్లో ప్రత్యేక హోదాపై చైతన్యం వచ్చిందని కాకాణి అన్నారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకొని ప్రత్యేక హోదా అంటూ చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అడ్డంకిగా మారి అన్యాయం చేసిన తీరును, హోదాపై టీడీపీ డ్రామాలను, వైయస్‌ జగన్‌ ప్రజలకు అండగా నిలబడ్డ వైనాన్ని మరోసారి ప్రజల  ముందుకు తీసుకెళ్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసానికి వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో వంచనపై గర్జన పేరుతో దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. 

బాబు దొంగదీక్షలు ఎవరూ నమ్మరు: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

చంద్రబాబు దొంగ దీక్షలు, పోరాటాలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిల్లో లేరని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ  మోసాలకు వ్యతిరేకంగా వంచనపై గర్జన దీక్ష చేపడుతున్నామని, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top