బాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు

  • జైట్లీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి
  • హోదా అన్నది క్యాబినెట్ నిర్ణయం
  • పథకం ప్రకారం హోదాను ఖూనీ చేశారు
  • నాయకులు మోసం చేసే తీరు మారాలి
  • ప్రజలు నిలదీస్తారన్న భయం పుట్టాలి

హైదరాబాద్ః కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో చెప్పిన వివరాలు తమకు ఆశ్చర్యాన్ని కలిగించాయని వైయస్ జగన్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు మధ్య తేడా చూపలేదన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని పార్లమెంట్కు లేఖ ఇచ్చారని, తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖకు కూడా సమాధానం ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదా అంశానికి, ఆర్థిక సంఘానికి సంబంధమే లేదని వైయస్ జగన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలన్నదానిపైనే ఆర్థిక సంఘం దృష్టి పెడుతుందన్నారు. హోదా ఇవ్వాలా? వద్దా? అన్న విషయంలో ఆర్థిక సంఘం పరిధిలో ఉండదన్నారు. ప్రధాని నేతృత్వంలోని ఎన్డీసీ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటుందని వైయస్ జగన్ గుర్తు చేశారు.

 హోదాపై ప్రధానిదే నిర్ణయం
ప్రత్యేక హోదా కేవలం ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే అని వైయస్ జగన్ అన్నారు. అది లెజిస్లేటివ్ విషయం కానే కాదన్నారు. హోదా ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని ప్రధాని మాత్రమే నిర్ణయించగలరన్నారు. అప్పటి ప్రధాని వాజ్పేయి ఒక్క సంతకంతో ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. మన్మోహన్ కేబినెట్ నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిందన్నారు. ప్లానింగ్ కమిషన్కు కూడా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపాలని ఆరోజు నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ఏడాది పాటు 13వ ఆర్థిక సంఘమే ఉందని వైయస్ జగన్ తెలిపారు. నీతి ఆయోగ్ కూడా 2014 డిసెంబర్లో వచ్చిందని, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకముందే ...ఆ ఫైల్ అక్కడే ఉందన్నారు. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ...ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఒక పథకం ప్రకారం హోదాను ఖూనీ చేశారని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి 90 శాతం గ్రాంట్ల రూపంలో ఉంటాయని, హోదా లేని రాష్ట్రానికి 30 శాతం మాత్రమే గ్రాంట్ల రూపంలో ఉంటాయని వైయస్ జగన్ చెప్పారు.  హోదా ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు బాగా వస్తాయని, వంద శాతం ఎక్సైజ్, ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. ఇలాంటి రాయితీలు ఉన్నప్పుడే పెట్టుబడులు బాగా వస్తాయని, పెట్టుబడుల కోసం సింగపూర్, రష్యాలకు చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. లక్షల కోట్లు పెట్టుబడులే కాకుండా, లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని వైయస్ జగన్ పేర్కొన్నారు.

ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి
బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టారని, అయితే ఆయన అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని వైయస్ జగన్ అన్నారు.  రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తన అనుభవం చూపించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జననేత వ్యాఖ్యానించారు.  ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం, తర్వాత మోసం చేసే తీరు మారాలని వైయస్ జగన్ అన్నారు. రాజకీయ నాయకులు మాట మీద ఉండాలని, మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు నిలదీస్తారన్న భయం కూడా ఉండాలన్నారు. రాజకీయ నాయకులు మాట నిలబెట్టుకోకుంటే ప్రజలు నిలదీయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించే బంద్కు అందరు సహకరించాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
Back to Top