దుర్మార్గుల‌కు బాబుప్ర‌భుత్వం అండ‌

విశాఖపట్నం:  విశాఖ జిల్లా పాల్మ‌న్ పేట లో దుర్మార్గానికి పాల్ప‌డిన వారికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ అభిప్రాయ ప‌డ్డారు. తూర్పుగోదావ‌రి జిల్లా తుని కి ఆనుకొని ఉన్న పాల్మ‌న్ పేట లో ఇటీవ‌ల టీడీపీ గూండాలు చొర‌బ‌డి మ‌త్స్యకారుల‌పై దాడి చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ సోమ‌వారం ఆ గ్రామానికి చేరుకొని సంఘీభావం ప్ర‌క‌టించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. టీడీపీ నాయకులు తమపై దాడికి పాల్పడిన ఘటన గురించి మత్స్యకారులు వైఎస్ జగన్కు వివరించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పాల్మన్ పేట ఘటన దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. బాధితులు  ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెప్పినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. పైగా గాయపడినవారిపైనే కేసులు బనాయించారని విమర్శించారు. దాడి ఘటనను కప్పిపుచ్చుకోవడానికి నష్టపరిహారం ప్రకటించారని, ఒకరిద్దరికే పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు.  బాధితులకు అండగా ఉంటామని, న్యాయపరంగా పోరాడుతామని, నిందితులకు శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top