కేసుల భయంతోనే బాబు వెనక్కి తగ్గారు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తగ్గడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎందుకు పోరాటం చేయలేదని  ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ, బీజేపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రేపు కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలని వై.విశ్వేశ్వర్ రెడ్డి  పిలుపునిచ్చారు. 

మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గారంటూ విమర్శించారు. కేసుల భయంతోనే ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లుకు పార్టీలకతీతంగా మద్దతివ్వాలన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి విమర్శించారు.


To read this article in English: http://bit.ly/1WVf1kx 

Back to Top