బాక్సైట్‌పై బాబు కన్ను

()మైనింగ్‌ తవ్వకాలు జరిపేందుకు బాబు కుట్రలు
()జీవో నెంబర్‌ 97 విడుదల తెలియదనడం విడ్డూరం
()బాక్సైట్‌ జోలికొస్తే ఉద్యమాలకు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధం
()ఇప్పటికీ ట్రైబల్‌ కౌన్సిల్‌ నియమించకపోవడం హేయనీయం
()గిరిజన సంపదపై కన్ను తిప్పుకోవాలని బాబుకు హెచ్చరిక
()వైయస్‌ఆర్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్

హైదరాబాద్‌: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన బాక్సైట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కన్నుపడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివాసీయుల దినోత్సవం రోజున గిరిజనులను ఉద్దేశించి చంద్రబాబు మీకున్న సంపదను వాడుకుంటే పైకొస్తారని అన్నారు. ఎవరు వాడుకొని ఎవరు పైకి రావడానికి అని సర్కార్‌ను నిలదీశారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేస్తున్న మోసాలపై హైదరబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అమర్నాథ్ మాట్లాడారు. బాక్సైట్‌కు సంబంధించి 97 జీవో విడుదలైన విషయం తెలియదని చెప్పిన ముఖ్యమంత్రి...ప్రస్తుతం కూడా తనకు తెలియకుండానే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి  అనుమతులు వచ్చాయంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

మైనింగ్‌ తవ్వకాలకు అన్ని పర్మిషన్లు వస్తున్నా నాకు తెలియకుండా వస్తున్నాయని చెబుతున్నారు. అది మీ అధికారుల తప్పా లేక మీ పరిపాలన లోపమా అని బాబును ప్రశ్నించారు. ఒక పక్క జీవో నెంబర్‌ 97ను పక్కనబెట్టాం దానిపై ఎక్కడా ముందుకు వెళ్లమని క్యాబినెట్‌ మంత్రులు చెబుతూనే, ఇప్పటికీ బాక్సైట్‌పై రెండు అనుమతులు పొందారని మండిపడ్డారు. మిగిలిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతి వస్తే తవ్వకాలు జరిపేందుకు టీడీపీ సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుగా  భావించే హోదాపై గట్టిగా మాట్లాకున్నా ప్రజలు ఏమీ అనడంలేదని, బాక్సైట్‌పై మీ అహంకారతనమా? లేక ఓటుకు కోట్ల కేసులో కోర్టులో స్టే తెచ్చుకున్న నిప్పుని ఏమీ చేయలేరని అహంకారంగా ఉన్నారా అని నిప్పులు చెరిగారు. గిరిజన ప్రాంతాలకు చెందిన సంపదను కొల్లగొట్టేందుకు అధికార చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అమర్నాథ్ మండిపడ్డారు. గతంలో 97 జీవో ద్వారా 12 వందల 12 హెక్టార్ల మైనింగ్‌ చేసుకోవడానికి ఏపీఎండీసీ ద్వారా అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. మైనింగ్‌ తవ్వకాలకు సంబంధించి అనుమతులపై వెనక్కు తగ్గకపోతే గతంలో మాదిరిగానే వైయస్‌ఆర్‌ సీపీ గిరిజనుల పక్షాల నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. 

గిరిజనులంటే ఎందుకంత చులకన
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు రాజ్యాంగ పరమైన ట్రైబల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ను చంద్రబాబు నియమించకపోవడం బాధాకరమని అమర్‌ విమర్శించారు. దీన్నిబట్టి చంద్రబాబుకు గిరిజనులంటే ఎంత చులకన భావనో అర్థం చేసుకోవచ్చునన్నారు. గిరిజనులు బాబును నమ్మలేదు గనుకే రాష్ట్రంలో 7 నియోజకవర్గాలు ఉంటే వాటిలో ఆరింటిలో వైయస్‌ఆర్‌ సీపీని ఆదరించారన్నారు. చంద్రబాబు ఆదివాసియుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. బాబు చేసే అన్ని కుట్రలను వైయస్‌ఆర్‌ సీపీ ప్రజలకు తెలియజేస్తుందన్నారు. విశాఖ అభివృద్ధి కోసం విభజన సమయంలో ఇచ్చిన హక్కులను మాట్లాడకుండా ఉన్న సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు చెందాల్సిన ప్రత్యేక రైల్వేజోన్, ఇండస్ట్రీయల్‌ కారిడార్, ఇనిస్టిట్యూషన్స్‌ తరలిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని బాబును ప్రశ్నించారు. అమరావతి పేరు చెప్పి కాలం వెల్లదీస్తున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి రాష్ట్రానికా, రాజధానికా అని చురకంటించారు. చంద్రబాబు ఉన్న అనుభవాన్నంతా కేవలం రాష్ట్ర ఆస్తిని దోచుకునేందుకు ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ సంపదగా భావించే బాక్సైట్‌ను లాక్కుపోవడానికి గిరిజనులేమీ అమాయకులు కాదని, మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ అని పేర్కొన్నారు. మైనింగ్‌ తవ్వకాలు జరపాలని చూస్తే ప్రతి ఒక్కరు ఒక అల్లూరిగా మారి విల్లు ఎక్కుపెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని, బాక్సైట్‌పై బాబు కన్ను తిప్పుకోవాలని హెచ్చరించారు. 

తాటాకు చప్పుళ్లకు ఆర్కే భయపడడు
ఓటుకు కోట్ల కేసులో తప్పు చేయని సశ్చిలుడు అయితే హైకోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని చంద్రబాబును గుడివాడ అమర్నాథ్  ప్రశ్నించారు. మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ అనే గొంతు బాబుదేనని పసిపిల్లలు కూడా చెబుతుంటే ఆ గొంతు నాదికాదని చెప్పడానికి బాబు బయటకు రాకపోవడం దురదృష్టమన్నారు. 14 నెలలుగా మరుగునపడిన కేసుపై పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సభ్యత్వం రద్దు చేసుకొని లీగల్‌గా ప్రొసిడ్‌ కావాలని టీడీపీ లీగల్‌ సెల్‌ పేరుతో కథనాలు వస్తున్నాయన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, ఎమ్మెల్యే ఆర్కేకు ఎలా ఎదుర్కోవాలో తెలుసునన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా పర్యటనలన్ని గోప్యంగా ఉంచరు కానీ చంద్రబాబు మాత్రం తన పర్యటన షెడ్యులను ఎవరికీ చెప్పడం లేదన్నారు. దొంగతనంగా బాబు చేసే కార్యక్రమాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయోనన్న ఆలోచనతో వివరాలు చెప్పడం లేదన్నారు. దొచుకున్న సంపాదనను దాచుకోవడానికి చంద్రబాబు పర్యటనలు సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓటుకు కోట్ల కేసులో బాబు దొంగా..? దొరా..? అన్న విషయం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ప్రపంచమంతా మాట్లాడుకునే కేసుపై స్పందించకుండా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌పై విమర్శలకు దిగడం శోచనీయమన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగు అనుబంధ సంఘాల ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులతో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రోజా, రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి, యూత్, స్టూడెంట్‌ అధ్యక్షులు జక్కంపూడి రాజా, సలాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యర్థి, యూత్, మహిళా, రైతు అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణాలపై చర్చించారు. 

 
Back to Top