వందలో ఒక్క మార్కు కూడా పడలేదు

మాట‌పై నిల‌బ‌డే వారే రాజ‌కీయ నాయ‌కుడు
రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాలి
బాబు అవినీతి, మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం
మీడియా సైతం త‌మవంతు స‌హాయం అందించాలి
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 

వైయస్సార్ జిల్లా(ఇడుపుల పాయ): ప్ర‌జ‌ల‌ను మోసం చేసే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఇడుపులపాయ గ్రామంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మం ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నిక‌ల్లో అబద్దాలు చెప్పే రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని సూచించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ల‌కు మించిన హామీల‌ను ఇచ్చిన బాబు అధికారంలోకి వ‌చ్చాక వాటిని విస్మ‌రించార‌ని మండిప‌డ్డారు. బాబు కేవ‌లం అవినీతి, అక్ర‌మాల‌కే పెద్ద‌పీఠ వేస్తున్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. రుణ‌మాఫీ చేస్తాం. మ‌హిళ‌ల బంగారం విడిపిస్తాం, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తాం, నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తామంటూ అనేక హామీలను ఊదరగొట్టిన బాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తిరిగి 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి ఇంటికో కారు, విమానం సైతం ఇస్తామ‌న్న హామీ ఇస్తార‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. 

మాట‌పై నిల‌బ‌డే వారే రాజ‌కీయ నాయ‌కుడు 
ఇచ్చిన మాటపై నిల‌బ‌డి అమ‌లు జ‌రిగేంతా వ‌ర‌కు పోరాడే వారే నిజ‌మైన రాజ‌కీయ నాయ‌కుడ‌ని వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. రాజ‌కీయ నాయ‌కులు ఇచ్చిన హామీల‌ను నేర‌వేర్చ‌ని పక్షంలో వారిని నిల‌దీసే విధంగా ప్ర‌జ‌లు చైత‌న్యవంతం కావాల‌ని సూచించారు. బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌పై ప్ర‌జా బ్యాలెట్‌ను ఏర్పాటు చేశామ‌ని ఈ ప్ర‌జాబ్యాలెట్‌తో ఇంటింటికి వెళ్లి వారికి రైతు రుణామాఫీ, డ్వాక్రా మ‌హిళ‌ల రుణ‌మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి వంద హామీల‌పై ప్ర‌జ‌ల‌ను అడుగుతామన్నారు.  మాఫీ అయితే అవును అని, కాక‌పోతే లేదు అని టిక్ మార్క్ పెట్టే విధంగా ఈ ప్ర‌జాబ్యాలెట్ ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిన ప్ర‌జాబ్యాలెట్‌లో వంద మార్కుల‌కు బాబుకు ఒక్క మార్కు కూడా రాలేద‌న్నారు. 

బాబుపై క‌థ‌
బాబు రూ. ల‌క్షా 45వేల కోట్ల రూపాయ‌ల అవినీతిపై ఓ క‌థ‌ను సైతం కరపత్రంలో ప్ర‌చురించ‌డం జ‌రిగింద‌ని ఆయన తెలిపారు. ప్ర‌జ‌లు ఈ క‌థ‌ను చ‌దివి బాబు అవినీతిపై పూర్తి అవ‌గాహ‌న‌ను ఏర్పచుకుంటార‌న్నారు. బాబు చేస్తున్న మోసాన్ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతుంద‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా తాను కూడా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తానని చెప్పారు.  మీడియా సైతం రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌శ్నించేలా ఉండాల‌ని సూచించారు.  రాజ‌కీయ నాయ‌కులు చేసే అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌జ‌ల‌కు చేరువ చేసే ద‌శ‌లో మీడియా త‌మ‌వంత స‌హాయ స‌హాకారాలు అందించాల‌న్నారు వైయస్ జగన్.
Back to Top