ప్రజలు కన్నీళ్లు పెడితే నీకు సంతోషమా?

  • చంద్రబాబు ఏపీని దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చాడు
  • ఏం సాధించావని 2016 సంవత్సరం బాగుంది బాబూ
  • నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నందుకా..?
  • కేసుల నుంచి తప్పించుకున్నందుకా..?
  • దోపిడీ ముఠాల చేతిల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు
  • నీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విలపిస్తున్నారు
  • ప్రజల పక్షాన పోరాట చాంపియన్ గా ఉంటాం
  • నిరంతరం వైయస్సార్సీపీ ప్రజల తరపున పోరాడుతుంది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ః ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. 2016 సంవత్సరం ఏపీ ప్రజలకు కన్నీళ్లను మిగిలిస్తే, గొప్పగా అనిపించిందని చంద్రబాబు తనకు తాను ఎలా కితాబు ఇచ్చుకుంటారని ప్రశ్నించారు.  ఇంతటి దుర్భర పరిస్థితులు ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ప్రజలంతా కన్నీరు పెడుతుంటే...2016 సంవత్సరం చాలా గొప్పగా జరిగిందని ముఖ్యమంత్రి ఎట్లా ప్రకటిస్తారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుడు, దళితుడు, మైనార్టీ ఎవరిని కదిలించినా సమస్యలతో కన్నీరు పెడుతున్నారని అన్నారు. కేంద్రం నుంచి ముందస్తు సమాచారంతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నందుకు మీకు సంతోషంగా ఉందేమో..? బ్రహ్మదేవుడు కూడా బాబును ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోలేడన్న మాట నుంచి మీకు డీల్ కుదిరి ఫైనల్ చార్జిషీట్ లోంచి మీ పేరును తొలగించుకున్నందుకు మీకు సంతోషంగా ఉందేమో గానీ రాష్ట్ర ప్రజలవెరూ సంతోషంగా లేరని బాబుకు చురక అంటించారు.  హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ప్రతిపక్షంగా తాము, మీడియా, ప్రజలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటే కనబడడం లేదా అని వాసిరెడ్డి పద్మ చంద్రబాబును ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏమీ సాధించకపోయినా బాబుకు బాగుందన్న సంతృప్తి కలుగుతుందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో తెలియడం లేదన్నారు. కేసుల నుంచి తప్పించుకున్నందుకు మీకు బాగుందా లేకపోతే మాటమీద నిలబడం మర్చిపోయి మూటలు కట్టడం నేర్చుకున్నందుకు మీకు బాగుందా బాబు అని పద్మ విరుచుకుపడ్డారు. అన్నా క్యాంటీన్లు, ఇంటింటికీ నీళ్లు అన్నారు. ఇంతవరకు దిక్కులేదు. మీరు మొట్టమొదట చేసిన ఐదు సంతకాలకే దిక్కులేకుండా పోయింది.  ఏ మాట మీద మీరు నిలబడలేదు. గతంలో మీ తొమ్మిదేళ్ల పాలనలో ఎలాంటి కష్టాలున్నాయో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ప్రజల కళ్లల్లో ఈ సంవత్సరం బాధ మిగిలిస్తే మీకు ఏవిధంగా సంతోషంగా కనిపిస్తోందని పద్మ చంద్రబాబును దుయ్యబట్టారు.  ప్రజల బాధను తన బాధగా భావించిన నాయకుడే గొప్ప పరిపాలన దక్షకుడనిపించుకుంటారని...బాబుకు ప్రజల బాధలే పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సింది పోయి...రుణాలు ఎగ్గొట్టిన రైతులుగా చంద్రబాబు బ్యాంకుల్లో ముద్రవేయిస్తున్నారని పద్మ మండిపడ్డారు. బాబు రైతులకు రుణాలు మాఫీ చేయని కారణంగారూ. 87,612 కోట్లున్న రుణాలు లక్షా 5 వేల కోట్లకు పెరిగాయని పద్మ పేర్కొన్నారు.   కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రుణాలు రీ షెడ్యూల్ కావడం లేదు. వ్యవసాయానికి ఇంత దుర్గతి ఎప్పుడూ లేదని రైతులు బాబు పాలనపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చుతున్న పరిస్థితిని పద్మ వివరించారు. డీమానిటైజేషన్ తో వ్యవసాయ ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని అన్నారు. గతంలో ఏదో ఓ పంటను రోడ్డు పాలుజేసేవారని..చంద్రబాబు నిర్వాకం కారణంగా ఇప్పుడు అన్ని పంటలను రోడ్డున పారబోస్తున్నన్న పరిస్తితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరికి గిట్టుబాటు లేనప్పుడు మీకెలా బాగుంటుంది...? మీకు, మీ కాబినెట్ కు కమీషన్లు, ముడుపులు అందితే రాష్ట్రం బాగున్నట్టా..? విభజన హామీలు ఒక్కటైనా సాధించారా. ఏం సాధించారని ఈ సంవత్సరం అద్భుతం జరిగిందంటున్నారు..నోట్లు రద్దు చేయమని లేఖలు రాసి హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారే గానీ...ప్రజలు క్యూలోన్లై నరకం చూస్తున్నప్పుడు సామాన్యుల కష్టాల గురించి ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని బాబును తూర్పారబట్టారు. 

 డీమానిటైజేషన్ దెబ్బతో రైతుల అకౌంట్ లో 2లక్షలున్నా వారానికి రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారు. వారానికి రూ. 24 వేలు ఇవ్వాలని కండీషన్ ఉన్నా 4వేలు ఇస్తున్నారు. వడ్డీ మాత్రం రూ. 2లక్షలు గుంజుతున్నారు. పంటలు గిట్టుబాటు లేక పారబోస్తుంటే, 13 జిల్లాల్లో కరుకు కళ్లముందు కనబడుతున్నప్పుడు మీకు ఎలా సంతోషంగా ఉంది..?. అన్నం పెట్టే రైతు సంతోషంగా లేనప్పుడు బాబుకు ఈ సంవత్సరం ఎలా గొప్పగా ఎలా అనిపించిందో సమాధానం చెప్పాలన్నారు.   13 జిల్లాల్లో ఏపీఎంజీ చేసిన సర్వే ప్రకారం ఈ రెండేళ్లలో  లక్ష పరిశ్రమలుంటే 26289 పరిశ్రమలు మూతబడిన విషయాన్ని వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. రాష్ట్రం ఉన్న పరిశ్రమలు మూసేస్తున్నారు. కొత్తవి రావడం లేదు. పెట్టుబడుల పేరుతో  కోట్లాది రూపాయలు దుబారా చేస్తూ స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలు తిరుగుతూ నానా హంగామా చేశారు తప్ప ఒక్క పరిశ్రమైనా రాష్ట్రానికి తీసుకొచ్చారా అని బాబును కడిగిపారేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు వచ్చేవని,  ముడుపుల కోసం పోలవరం తెస్తున్నామని చెప్పి బాబు హోదాను తాకట్టుపెట్టారని పద్మ ధ్వజమెత్తారు. 

ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పటిదాకా అమలు చేయలేదు. పుణ్యకాలం గడిచాక పదో, పరకో నోటిఫికేషన్లు అని హడావిడి చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి మాఫీ కాని పరిస్థితి. సేవారంగంలో అభివృద్ధి మచ్చుకు కూడా కానరావడం లేదు. ఓ పథకం కాదు, మనిషి కాదు, రంగం కాదు ఒక్కటంటే ఒక్క మేలు జరిగిందని చెప్పుకునే పరిస్థితి ఉందా...? మా తరపున ఎవరైనా మాట్లాడాతారని ప్రదలు ఆశిస్తున్న తరుణంలో...ఏపీ వెలిగిపోతోందని చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. 2016లో బాబు చేసిన ఘనకార్యం ఏదైనా ఉందంటే ప్రజాస్వామ్యంలో నైతిక సూత్రాలకు నీళ్లొదిలి 21మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనని ఎద్దేవా చేశారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కనీసం రాజీనామా చేయించే గట్స్ కూడా లేకుండా టీడీపీని చంద్రబాబు దిక్కుమాలిన పార్టీగా మార్చారని పద్మ ఫైర్ అయ్యారు. మీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు, పేదవాడికి ఓ ఇళ్లు కట్టించానని చెప్పగలరా...? గత ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలను కూడా చేయడం లేదు. దళితులకు ఒక్క ఎకరా గానీ, పట్టాలు ఇవ్వడం గానీ జరగనప్పుడు ఏం బాగుందని చెబుతున్నారు. మొత్తం దోపిడీ ముఠాల చేతిల్లోకి ఏపీని తీసుకెళ్లారు. అవినీతిలో, నేరాల్లో, మద్యం అమ్మకాల్లో ఏపీని నంబర్ వన్ గా మార్చిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. 

చంద్రబాబు ఎప్పుడు  కాబినెట్ మీటింగ్ పెట్టిన ల్యాండ్ సెటిల్ మెంట్ లు, బినామీలకు భూములు ఎలా కట్టబెట్టాలన్న ఆలోచనే తప్ప ప్రజాసంక్షేమమే పట్టడం లేదని విమర్శించారు. ఏపీకి నష్టం జరిగిందంటే అది బాబు వైఫల్యం తప్ప మరొకటి కాదని పద్మ అన్నారు. బాబు తన కేసుల నుంచి బయటపడేందుకు  రాష్ట్రం తరపున కేంద్రం వద్ద గొంతెత్తకపోవడం వల్ల 2016 సంవత్సరం ఏపీకి పెద్ద విపత్తగా మారిందన్నారు. 2017 సంవత్సరంలో ఏపీ ప్రజలు ఈ సమస్యలను అధిగమించాలని, పాలకుల మీద ఒత్తిడి తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల తరపున పోరాట చాంపియన్ గా వైయస్సార్సీపీ ఉంటుందని, నిరంతరం ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతుందని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు నిరాశ నుంచి తేరుకొని కొత్త సంవత్సరంతోనైనా ప్రజలు ఆశలు నిలపాలని సూచించారు. అంతే గానీ డంకా బజాయించొద్దని హితవు పలికారు.   
Back to Top