బాబు చేతిలో తీవ్రంగా మోసపోయిన అనంత

ప్రజలకు అక్కర్లేని పదవులు ఎందుకని
వైయస్‌ జగన్‌ సూచనల మేరకు రాజీనామాలు చేశాం
మరోసారి అవకాశం ఎందుకివ్వాలో చెప్పగలవా చంద్రబాబూ
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి

అనంతపురం: చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన ప్రాంతం అనంతపురం జిల్లా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్‌గన్‌ల పేరు వందల కోట్లు దోచుకోవడమే కాకుండా రైతులకు అందాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ, క్రాప్‌ ఇన్సూరెన్స్‌లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా వేదికగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్ఢంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నామన్నారు. చంద్రబాబు అంగీకరించిన ప్రత్యేక ప్యాకేజీ దండగ.. హోదాతోనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్‌ జగన్‌ అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. చెప్పడమే కాదు.. ప్రాణాలు పణంగా పెట్టి నిరాహార దీక్షలు సైతం చేశారన్నారు. 

రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం శాయశక్తులా పోరాటం చేయాలని వైయస్‌ జగన్‌ ఎంపీలకు సూచించారని గుర్తు చేశారు. ప్రజలకు అక్కర్లేని పదవులు ఎందుకు ప్రజల కోసం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి హోదా అవసరాన్ని ఇరు ప్రభుత్వాలకు బుద్ధిచెప్పేలా తీర్పుకోరుదామని చెప్పారన్నారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులను వదులుకున్నామన్నారు. వైయస్‌ జగన్‌ తన నాయకత్వ పటిమతో హోదా వద్దన్న చంద్రబాబుతో యూటర్న్‌ తీసుకునేలా చేశారన్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనని మాట్లాడిన చంద్రబాబు.. యూటర్న్‌ తీసుకున్నా.. ఆ కేసులు ఇంకా అలాగే ఉన్నాయన్నారు. అంటే చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

రాష్ట్రాన్ని పరిపాలించేందుకు ఇంకో అవకాశం ఎందుకు ఇవ్వాలో చంద్రబాబు చెప్పాలని మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రం పుట్టి నాటి నుంచి రూ. 9 వేల కోట్ల అప్పులు ఉంటే.. మూడున్నర సంవత్సరాల్లో రూ. 1.3 లక్షల కోట్ల అప్పు చేసిందుకా..? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినందుకా..? దేనికి ఇవ్వాలో అవకాశం చెప్పాలన్నారు. పోలవరం పూర్తి చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని అసెంబ్లీ మాట్లాడి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అవకాశం కల్పించాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాపై నాకు ప్రేమ ఎక్కువ అని చెప్పుకునే చంద్రబాబు.. అనంతకే తీవ్ర అన్యాయం చేశారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులు చేస్తానన్న చంద్రబాబు ఇప్పటికీ 60 సార్లు ప్రకటించారన్నారు. ప్రాజెక్టు అంచెనాలు పెంచుతున్నారు తప్ప పనులు చేయడం లేదన్నారు. 2014లో చంద్రబాబు రుణమాఫీ పూర్తిగా చేస్తానని, వ్యవసాయాన్ని దండగ చేశారన్నారు. ఈ సారి 14 సీట్లు మనమే గెలిచే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
Back to Top