ప్రతిపక్షంపై బాబు పక్షపాతం

హైదరాబాద్ః చంద్రబాబు తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించకుండా కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.  పార్టీలకతీతంగా నిధులు కేటాయించాల్సిన ముఖ్యమంత్రి పచ్చతమ్ముళ్లకు మాత్రమే నిధులు ఇచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు  పక్క రాష్ట్ర సీఎంను చూసైనా బుద్ధి తెచ్చుకొని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.  

బుడ్డా రాజశేఖర్ రెడ్డి(శ్రీశైలం ఎమ్మెల్యే)
ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై పక్షపాతం చూపుతోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా శాసనసభ్యుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత సభకు ఉందన్నారు. ఓ వ్యక్తి శాసనసభ్యుడిగా గెలవాలంటే నియోజకవర్గ స్థాయిల్లో ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, అలా గెలిచిన  ఎమ్మెల్యేలపై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకుంటారని చెప్పారు. కానీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపుతోందని ధ్వజమెత్తారు. 3,4 లక్షల మందికి ప్రజాప్రతినిధిగా ఉన్న తమకు ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితులు కల్పిస్తుంటే ప్రజాప్రతినిధులుగా ఉండి ఏం లాభమని ఆవేదన వ్యక్తంచేశారు.  

మాట్లాడుతుండగానే పచ్చనేతలు అడ్డుతగలడం పట్ల రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఏవిధంగా దెబ్బతీయాలి, మానసికంగా ఎలా ఇబ్బందులు పెట్టాలి, ప్రలోభపెట్టాలన్న దానిపైనే ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకి 3 కోట్లు నిధులు ఇస్తున్నారు. జీతాలు గానీ, నిధులిచ్చే విషయంలో గానీ ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటాయి. కానీ తమ తట్ట లాక్కోని వేరేవారికి అన్నం పెట్టడం దారుణమని రాజశేఖర్ రెడ్డి టీడీపీపై మండిపడ్డారు. తమకు పెట్టే అన్నం పక్కవారికి ఇస్తారా అని ఫైరయ్యారు. ఏ ప్రభుత్వమొచ్చినా శాసనసభ్యులకు ఉండే హక్కులు కాపాడాల్సిన బాధ్యత సభకు ఉందని చట్టం చేయాలన్నారు.  

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు ఎమ్మెల్యే)
ఓడిపోయిన టీడీపీ నేతలకు ఇంఛార్జ్ ల పేరుతో నిధులు విడుదల చేస్తూ ....వారికి ప్రభుత్వం హక్కులు కల్పించడం దారుణమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో శాసనసభ్యుల నిధులను ఎవరూ క్యాన్సిల్ చేయలేదని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారని, ఇది దుర్మార్గమన్నారు.  పక్కరాష్ట్రంలో సీఎం కేసీఆర్  ఎమ్మెల్యేలకు 3 కోట్ల నిధులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కావున ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యులందరికీ రూ.3 కోట్లు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

అనిల్ కుమార్ యాదవ్ ( నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే)
స్వచ్ఛభారత్ పేరుతో 13వేల టాయిలెట్స్ కట్టామని ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో 700 మంది విద్యార్థులున్న చోట్ల చాలావరకు ఇన్ కంప్లీట్ గా ఉన్నాయన్నారు. ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన దత్తత్ అనే పథకం గుర్తించి ప్రస్తావించారు. మున్సిపల్ శాఖా మంత్రి దత్తత తీసుకున్న వార్డు స్కూళ్లలోనే బాత్రూమ్స్ లేని పరిస్థితి ఉండడం సిగ్గుచేటన్నారు. 

హైదరాబాద్ నేనే నిర్మించాను, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి..ముందు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. ప్రతిసారి నేను సీనియర్ నంటూ చంద్రబాబు మాట్లాడుతుంటే... సీఎం ఆయన నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేశాడో తెలుసుకుందామని 60 స్కూళ్లపై అధ్యయనం చేశామన్నారు. 
అక్కడ పరిస్థితి చూస్తే దారుణాతి దారుణంగా ఉందన్నారు. 60 పాఠశాలల్లో ఒక్క స్కూల్లో కూడా బాత్రూంలు లేవు, తాగేందుకునీళ్లు లేవన్నారు. పాఠశాలలకు రహదారులు, ప్రహరిగోడలు లేనేలేవని చెప్పారు. దాతలు ముందుకు రావాలని చెబుతున్న లోకేష్ ...ముందు ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని సెట్ చేయాలని చురక అంటించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిపించిన మీ కుప్పం ప్రజలకు మొదటగా న్యాయం చేయాలని,  నాణ్యమైన విద్య అందించాలని అనిల్ కుమార్ యాదవ్ బాబుకు సూచించారు.    

తాజా వీడియోలు

Back to Top