బాబూ కుంభకర్ణ రాజీనామాకు రెడీనా

ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ రాజీనామాకు సిద్ధపడాలి
తమిళులు జల్లికట్టు సాధించుకోగా..మనం హోదా సాధించలేమా?
కేసుల కోసం చంద్రబాబు లొంగిపోయారు: భూమన కరుణాకర్‌రెడ్డి

 హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రాచీన సంస్కృతిలో భాగమైన సంప్రదాయ క్రీడ జల్లికట్టును కాపాడుకునేందుకు తమిళులంతా ఏకమై సాధించుకున్నారని, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలంతా ఏకమై సాధించుకున్నారని, అలాగే ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుజాతి మొత్తం ఏకమై పోరాడాలన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరులతోమాట్లాడారు.

హోదా సాధన కోసం రాష్ట్రంలోని 25 మంది ఎంపీల రాజీనామాలతో ప్రారంభిద్దామన్నారు. అందుకు ముఖ్యమంత్రి సిద్ధమేనా? అని సవాలు విసిరారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడదామని చెప్పారు.  జల్లికట్టు కోసం తమిళులు సుప్రీంకోర్టు తీర్పును సైతం పక్కన పెట్టారని, ఆర్డినెన్స్‌ను సాధించుకున్నారని.. అలాంటిది హోదాపై మనం ముందుకెళ్లలేమా అని ప్రశ్నించారు. తమ పార్టీ మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందన్నారు.

హోదాకు చంద్రబాబే అడ్డంకి 
వాస్తవానికి ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డంకి అని భూమన ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేరేదాకా పోరాడదామన్నారు. ఓటుకు కోట్లు కేసులో తానెక్కడ ఇరుక్కుపోతానో అని బాబు కేంద్రానికి లొంగిపోయారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని హోదా సాధించుకునేందుకు ఒక మహత్తరమైన వేదికను నిర్మించేందుకు కలసి రావాలని సూచించారు.
Back to Top