బాబు ముఖ్య"కంత్రి"

-బాబు హయాంలో అనంత కరువు, కాటకాలకు పుట్టినిల్లుగా మారింది
-హంద్రీనీవా వైయస్ఆర్ చలువే
-బాబు కిలోమీటర్ కాల్వ కూడా తవ్వలేదు
– ప్రజా ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలుండవ్‌
– రెండేళ్లు టైమివ్వండి హంద్రీనీవా పూర్తి చేసి చూపిస్తా
– ప్రజా సమస్యలపై విశ్వేశ్వర్‌రెడ్డి పనితీరు అభినందనీయం
– ఉరవకొండ ధర్నాలో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌

ఉరవకొండః రైతు సమస్యలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీఎస్టిమేషన్‌ వేయించి దోచుకుంటున్నాడని ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ధర్నా కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన బినామీలకు ఇచ్చి రీ ఎస్టిమేషన్‌లు వేయించి జోరుగా దోచుకుంటున్నాడని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. నువ్‌ ముఖ్యమంత్రివా.. ముఖ్యకంత్రివా అని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా కరువుకాటకాలకు పుట్టినిలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లా దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉండే జిల్లాగా ఉంటే ఇప్పుడు అనంతపురం జిల్లాకు ఆ గతి పట్టిందని తెలిపారు. హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యి ఉంటే రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, అనంతపురం జిల్లాలని లక్షా 18 వేల ఎకరాలకు సాగునీరు అందేదని వెల్లడించారు. ఆనాడు దివంగత మహానేత 4 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేస్తే పది శాతం పనులు పూర్తి చేయడానికి చంద్రబాబుకు మూడేళ్లు కూడా సరిపోలేదా అని ఎద్దేవా చేశారు.

హంద్రీనీవాకు రెండుసార్లు శంకుస్థాపనలు
చంద్రబాబుకు శంకుస్థాపనల జబ్బు ఈరోజు కొత్తగా వచ్చిందేమీ కాదని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా ఆయనకు ప్రాజెక్టులు గుర్తుకువస్తాయని.. శంకుస్థాపనలు చేస్తుంటాడని తెలిపారు. గతంలో 1996 ఎన్నికలకు ముందు ఉరవకొండలో.. 1999 ఎన్నికల సమయంలో రాప్తాడులో హంద్రీనావా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ తొమ్మిదేళ్ల పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టుకు కేవలం 24 కోట్లు కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఆ కేటాయింపులు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. 40 టీఎంసీలతో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరందించే అపర సంజీవని లాంటి ప్రాజెక్టును కేవలం 5.5 టీఎంసీలకు కుదించి రైతుల కళ్లల్లో మన్ను కొట్టాడని చంద్రబాబుపై వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో హంద్రీనీవాకు 4వేల కోట్ల పై చిలుకు నిధులను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కేటాయించి, పనులు చేశారు. వైయస్ఆర్ హయాంలో హంద్రీ నీవా సుజల స్రవంతిలో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పది శాతం పనులు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను ఇంతవరకు ఈ ప్రభుత్వం చేయకపోవడంతో రైతాంగం అల్లాడుతోందని జగన్ అన్నారు.  హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయ్యి ఉంటే ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే దాదాపు 80వేల ఎకరాలకు సాగునీరందేదని వైయస్ జగన్ పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క కిలోమీటర్‌ కాలువ తవ్వలేదని తెలిపారు. ఒక్క లిఫ్ట్‌ కానీ, ఒక్క గేటు కానీ నిర్మించలేదని పేర్కొన్నారు. పైగా రెయిన్‌ గన్‌లతో నాలుగు రోజుల్లో అనంతపురం జిల్లా నుంచి కరువును పారదోలాలని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. 30 టీఎంసీలు నీరిచ్చానని చెప్పుకునే చంద్రబాబు అదే జిల్లాలో 63 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారుగా అని ప్రశ్నించారు. సాగునీరిస్తే కరువు ఎందుకొచ్చిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క ఇటుక కూడా ఎత్తలేదని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

‘మనసులోమాట’లో ప్రాజెక్టులు దండగ అన్నాడు 
చంద్రబాబు తాను రాసిన మనసులో మాట పుస్తకంలో సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఏమొస్తుందని.. డబ్బులు దండగ తప్ప ఏమీ ఉండదని రాసుకున్న విషయాన్ని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. ఎన్నికలొచ్చినప్పుడు టెంకాయ కొట్టి రిబ్బన్‌ కటింగ్‌లు చేస్తే పొలాలు తడవవని అన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రాజెక్టు కోసం బడ్జెట్‌ కేటాయింపులు వివరించారు. 2014–15 రూ. 100 కోట్లు, 2015–16 రూ. 380 కోట్లు, 2016–17 రూ. 504 కోట్లు కేటాయించారన్నారు. అయితే హంద్రీనీవాలో మోటార్లు ఆడించినందుకు ఇప్పటికే 350 కోట్లు కరెంటు బిల్లులు కట్టారన్నారు. ఇక మిగిలిన నిధులతో ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తావో చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని వైయస్‌ జగన్‌ సూచించారు. 

కమీషన్ల కోసం రీఎస్టిమేట్లు
ప్రాజెక్టులకు రీఎస్టిమేట్లు వేయించి తనకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇప్పించి చంద్రబాబు కమీషన్లు దండుకుంటున్నారని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజీ 36 పేరుతో పెండింగ్‌ పనులకు రీఎస్టిమేట్‌లు తయారు చేసి 350 కోట్లకు పెంచారన్నారు. అలాగే గాలేరు–నగరి ప్రాజెక్టుకు రీఎస్టిమేట్‌లో 11 కోట్ల నుంచి 110 కోట్లుకు పెంచారని వివరించారు. బినామీలకు కాంట్రాక్టులు అప్పగించి కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఎలా మోసం చేయాలో ఆలోచించి ఫార్ములాను సిద్ధం చేసుకోవడం.. గెలిచాక ఓటేసినోళ్లను నట్టేట ముంచి సంపాదన మీద దృష్టిపెట్టడం బాబుకు అలవాటుగా మారిందని తెలిపారు. గతంలో పూర్తయిన ప్రాజెక్టులకు రిబ్బన్‌ కటింగ్‌లు చేసి పూల దండలు వేయించుకోవడం పనిగా పెట్టుకున్నారన్నారు. ఆఖరుకు ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో తన విగ్రహానికి తనే పూలదండ వేసుకుని ఆవిష్కరించే దుస్థితికి బాబు దిగజారారని ఎద్దేవా చేశారు. 2012 ఫిబ్రవరి 12 అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు జాతికి అంకితం చేస్తే అదే ప్రాజెక్టును మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ప్రారంభించడం దౌర్భాగ్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తే రిబ్బన్‌ కటింగ్‌లు చేసి ఫొటోలకు పోజులిచ్చి చంద్రబాబు కుళాయిలు తిప్పుతున్నారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్దకు వచ్చి ఈత కొట్టడం, మంచమేసి పడుకుంటానని చెప్పిన ఇరిగేషన్‌ మంత్రి ఆనాడు హంద్రీనీవా ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రకాశం బ్యారేజీ మీద ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు కరువు ముప్పును గుర్తించి రాయలసీమను ఆదుకునేందుకు పోతిరెడ్డిపాడు 11వేల క్యూసెక్కుల నుంచి 55 వేల క్యూసెక్కులకు పెంచారు. 85 శాతం పనులు పూర్తి చేశారు. ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ కూడా 80 శాతం పూర్తిచేశారు. అయితే మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయడానికి మూడేళ్లు కూడా బాబుకు సరిపోలేదని వైయస్‌ జగన్‌ విమర్శించారు. 120 రోజులు 854 అడుగులుపైగా నీళ్లున్నా ఇప్పటికీ ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకు కరువు ఎందుకుంది. తుంగభద్ర నుంచి రావాల్సిన నీరు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గుంతకల్లు కెనాల్‌ ఆధునీకరణ ఇంతవరకు లేదు. 

వలస పోయి బిచ్చమెత్తుకుంటున్నారు
దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్న కరువు కోరల్లో చిక్కుకుంటున్నాడని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 4.5 లక్షల మంది ఈ జిల్లా నుంచి వలసలు పోయి కేరళలో బిచ్ఛం అడుక్కునే దుస్థితికి చంద్రబబు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. గతంలో వైయస్‌ఆర్‌ హయాంలో లేబర్‌ కాంపోనెంట్‌ 98 శాతం నిధులు పెట్టేవారు. 100 రోజుల నుంచి 150 రోజులు పనులు కల్పించారు. అయితే నేడు బాబు హయాంలో ఎన్‌ఆర్‌ఈజీఈ నిధులు 40 శాతానికి మించి రావడం లేదన్నారు. రుణమాఫీ చేస్తావని ఆశించిన రైతులను నట్టేట ముంచావని ఆరోపించారు. మీ మాట విని రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల నోటీసులు పంపుతున్నాయని రుణాలు ఇవ్వడం లేదన్నారు. బ్యాంకుల్లో దాచుకున్న బంగారం వేలం పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్నివర్గాలను దోచుకున్నావ్‌..
చంద్రబాబు ఎన్నికల వేళ మోసపూరిత హామీలతో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, చేనేత కార్మికులు అందర్నీ దోచుకున్నాడని వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పెద్దన్నగా ఉంటానని చెప్పి పెద్ద మోసగాడిగా మారారని ఆరోపించారు. చేనేత కార్మికులు 25 మంది చనిపోతే అందర్నీ పరామర్శించా. చేతనైన సాయం చేశా. బాబు వారినీ వదల్లేదు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చే స్తానన్నాడు. ప్రతి చేనేత కుటుంబానికి లక్షన్నరతో షెడ్డు, ఇళ్లు అన్నాడు. కానీ గెలిచాక రూ. 600 సబ్సిడీ కూడా ఎత్తేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటిదాకా వడ్డీ లేని రుణాలు వచ్చేవి. కానీ బాబు వచ్చాక అపరాధ వడ్డీ 18 నుంచి 24 శాతం వరకు వసూలు చేస్తున్నారు. రుణాలు రెన్యువల్‌ కాలేదు.. ఇన్సూరెన్సు కూడా అందని పరిస్థితి నెలకొందని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబుతోపాటే కరువూ వస్తుంది
రాజకీయాల్లో చాలా మందిని చాలా మందిని చూస్తుంటాం. ఒక్కోరిదీ ఒక్కో విశిష్టమైన శైలి. అయితే చంద్రబాబు లాంటి వ్యక్తిని మాత్రం ఎవరూ చూసుండరు.. చూడరని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా ఆయనతోపాటే కరువు కూడా వస్తుందని ఎద్దేవా చే శారు. రోజుకొక మాటలతో మోసం చేయడం ఆయన నైజం అన్నారు. మోడీని తిట్టిన నోటి తోనే పొగడటం.. కేసీఆర్‌ను జుట్టుపట్టుకుంటానన్న వ్యక్తే చివరికి కేసులకు భయపడి సాగిలా పడటం.. మామ ఎన్టీఆర్‌తో కయ్యం పెట్టుకోవడం.. బావమరిది బాలకృష్ణతో వియ్యమొందడం బాబుకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని తెలిపారు. కేంద్రంతో స్నేహం చేస్తాడు.. రాష్ట్రంతో యుద్దం చేస్తాడు.. కాంట్రాక్టర్లను ఆదరిస్తాడు.. రైతులను తిట్టిపోస్తాడు. దోపిడీ, అవినీతి, దుర్మార్గం, మోసం, నయవంచన, కుతంత్రం, దుష్టత్వం లాంటి దుర్గుణాలకు నిలువెత్తు రూపం చంద్రబాబేనని పేర్కొన్నారు. అవినీతి మీద పోరాటం అంటాడు.. దేవుడి భూములను కూడా వదలకుండా దోచుకుంటాడు. రాష్ట్రాన్ని అవినీతిలో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి తాను మాత్రం మంచోడినని కలరింగ్‌ ఇచ్చుకోవడం దౌర్భాగ్యమన్నారు. వినేవాడుంటే పట్టిసీమ నుంచి అమెరికా, ఆఫ్రికాలకు కూడా పైపులైన్లు వేసి చంద్రబాబు నీరిస్తానని చెబుతాడని ఛలోక్తులు విసిరారు. దేశంలో 40లక్షల ఇళ్లు నిర్మిస్తే వైయస్‌ఆర్‌ హయాంలో ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు నిర్మించారని రాజశేఖర్‌రెడ్డి గొప్పతనం గురించి వివరించారు. కానీ చంద్రబాబు హయాంలో ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని తెలిపారు. ప్రజలు మంచి చేసేవారినీ చెడు చేసిన వారినీ ఇద్దర్నీ గుర్తుంచుకుంటారని తెలిపారు. మంచి, నీరు, పచ్చదనం కనిపించినప్పుడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిని.. దుర్మార్గం... అవినీతి కనిపించినప్పుడు చంద్రబాబును ప్రజలు గుర్తు చేసుకుంటారని తెలిపారు. మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారని అందరూ నమ్మితే చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ చేసుకుంటే చాలని నమ్మే వ్యక్తి అని వివరించారు. ఒక్క సంవత్సరం ఓపిక పడితే ఆ తర్వాత ఎన్నికల హడావుడితో ఇంకో సంవత్సరం గడిచిపోతుందని ఆ తర్వాత వచ్చే ప్రజా ప్రభుత్వంతో ప్రజలందరి సమస్యలు తీరుస్తానని హామీఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ధర్నా విజయవంతం చేసినందుకు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతులు తెలియజేశారు. స్థానిక వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అభినందిస్తూ ఆయనకు అందరూ మద్ధతు పలకాలని వైయస్‌ జగన్‌ కోరారు. 
Back to Top