బాబు పనుల్లో స్వార్థం తప్పనిసరి

 

విశాఖ‌ప‌ట్నం:  రాష్ట్ర ప్ర‌జ‌లు వేస‌విలో గుక్కెడు మంచినీరు దొర‌క్క
అల్లాడుతుంటే..ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం మజ్జిగ పంపిణీ చేస్తోందని
వైఎస్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నిల‌దీశారు. విశాఖ‌ప‌ట్నంలో గురువారం ఆయ‌న
మీడియాతో  మాట్లాడుతూ..చంద్ర‌బాబు పాల‌న మొత్తం అవినీతితో నిండిపోయింద‌ని, ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌పై బాబుకు చిత్త‌శుద్ధి
లేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ   నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు క‌రువు
కాట‌కాల‌తో అల్లాడుతుంటే జిల్లాలోంచి అధికారుల‌ను పిలిచి ఒక్క స‌మీక్ష ప‌మావేశ‌మైనా
నిర్వ‌హించారా అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు నీరు లేక గొంతెండుతుంటే
క్యాబినెట్ స‌మావేశం నిర్వ‌హించి మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామ‌ని చెప్ప‌డం
సిగ్గు చేట‌న్నారు. బాబు ఏ ప‌ని మొద‌లు పెట్టినా దానిలో త‌న‌కు, త‌న సంస్థ‌ల‌కు, తాబేదారుల‌కు ఎంత ల‌బ్ధి చేకూరుతుంద‌నే ఆలోచ‌న‌తోనే
ఉంటార‌ని దుయ్య‌బ‌ట్టారు. సంక్రాంతికి ఇచ్చిన చంద్ర‌న్న కానుక‌లో నెయ్యిని ఏ
విధంగా హెరిటేజ్ సంస్థ ద్వారా అమ్ముకున్నారో, అదే విధంగా మ‌జ్జిగ‌తో ప్ర‌జాసొమ్ము స్వాహా
చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు.

విశాఖ మీద తెలుగు గద్దల కన్ను

దేశంలో ముంబాయి త‌ర్వాత శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ‌పై సీఎం త‌న‌యుడు
లోకేష్,
కేంద్ర‌మంత్రి
వెంక‌య్య‌నాయుడుల క‌న్ను ప‌డింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. విశాఖ‌లోని భూముల‌ను
దోచుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌న్నారు. పూర్వం పెద్ద‌లు అనాథ‌లు, పేద ప్ర‌జ‌ల కోసం వారిని ఆదుకోవ‌డానికి
వారికున్న భూముల‌ను ఇచ్చేవార‌ని గుర్తు చేశారు. ప్రేమ స‌మ‌జాల ద్వారా పెద్ద‌లు, దాత‌లు ముందుకు వ‌చ్చి పేద‌ల‌ను
ఆదుకుంటుంటే... ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప్రేమస‌మాజం భూముల‌ను ఎవ‌రికీ ఇవ్వ‌డానికి వీల్లేద‌ని ఆక్షేపించ‌డం దారుణ‌మ‌ని
బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

దీక్షకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు

అఖిల‌ప‌క్షం,
ప్ర‌జా సంఘాలు
చేస్తున్న రైల్వేజోన్ దీక్ష‌ను గురించి చంద్ర‌బాబు స‌ర్కార్ ఎక్క‌డా చ‌ర్చించ‌క‌పోవ‌డం
బాధాక‌ర‌మ‌న్నారు. ప్ర‌భుత్వ దుశ్చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌డానికి, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను కాపాడేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌గా ముందుంటామ‌ని చెప్పారు. రైల్వేజోన్‌పై అమ‌ర్
చేప‌ట్టిన నిర‌వ‌ధిక నిరాహార‌దీక్ష‌కు స‌హ‌క‌రించిన అన్ని పార్టీల‌కు,  ప్ర‌జా సంఘాల‌కు పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు
తెలిపారు. 

సంత‌లో ప‌శువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలు

దోచుకున్న అవినీతి డ‌బ్బుతో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తూ నిసిగ్గుగా
ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సంత‌లో ప‌శువుల్లా ఎమ్మెల్యేల‌ను కొనుగోలు
చేస్తున్నార‌ని మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మండిప‌డ్డారు. పార్టీ ఫిరాయించిన
ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు అభివృద్ధిని, ఆయ‌న అంద‌చందాలు చూసి పార్టీలు మారుతున్న‌ట్లు
చెబుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం క‌రువు, ఎండ‌తీవ్ర‌త‌ను ప‌ట్టించుకోకుండా, ప్రాజెక్టులు, భూ దందాల నుంచి వ‌చ్చిన డ‌బ్బుల‌తో ఒక్కొక్క
ఎమ్మెల్యేకు కోట్ల ఆఫ‌ర్ చేసి ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు ఏ మాత్రం చిత్త‌శుద్ధి ఉన్నా.. ఎమ్మెల్యే ప‌ద‌వికి
రాజీనామా చేయాల‌ని స‌వాల్ చేశారు. 

23న కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌

బాబు స‌ర్కార్ చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై వైఎస్సార్‌సీపీ పోరుబాట
ప‌ట్ట‌నుంద‌ని బొత్స వివ‌రించారు. వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల స‌మావేశంలో పోరుబాట‌పై కార్య‌చ‌ర‌ణ
రూపొందించామ‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిరక్షించుకోవ‌డానికి ఈ నెల 23న సేవ్ డెమెక్ర‌సీ పేరుతో జిల్లా కేంద్రాల్లో
కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ చీక‌టి ప్ర‌భుత్వాన్ని పార‌దోలాల‌ని
ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేందుకు విశాఖ‌లో జాతిపితా మ‌హాత్మాగాంధీ విగ్ర‌హం వ‌ద్ద
నుంచి రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్రహం వ‌ర‌కు శాంతియుత ర్యాలీ
నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని క‌రువు ప‌రిస్థితుల‌పై అన్ని మండ‌ల
కేంద్రాల్లో ఖాళీ బిందెల‌తో మే 2న నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మాల్లో పార్టీ
కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని బొత్స‌స‌త్య‌నార‌య‌ణ
పిలుపునిచ్చారు. 

 

తాజా ఫోటోలు

Back to Top