ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాస్తున్న బాబు

ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన
కలెక్టర్‌కు అధికార పార్టీపై ఫిర్యాదు
కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

వైయస్సార్ జిల్లా: ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలుగా చేపడుతూ ఎంపీ, ఎమ్మెల్యేల హక్కులను సీఎం చంద్రబాబు కాలరాస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ప్రోటోకాల్‌ ఉల్లంఘిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడపలో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

శాసనసభ్యుల హక్కులను కాలరాస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కడప జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రోటోకాల్‌ పాటించని అధికారులు, ప్రజా ప్రతినిధులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మైదుకూరు నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ఆహ్వానించి టీడీపీ తరపున ఓడిపోయిన అభ్యర్థితో కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎమ్మెల్యేను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని 10.30 గంటలకు రమ్మని అంతకు ముందే టీడీపీ నేతతో కార్యక్రమాన్ని పూర్తి చేసి అధికారులు ప్రోటోకాల్‌ను పూర్తిగా ఉల్లంఘించారన్నారు. 

జీవో 520 ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథి అని ఉండగా దాన్ని కూడా పాటించడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన రెండు సంవత్సరాల కాలం నుంచి అనేక సార్లు ప్రోటోకాల్‌ ఉల్లంఘించిందని మండిపడ్డారు. జిల్లాలో ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కూడా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఫైరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ సొంత కార్యక్రమాలుగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి మారే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top