బాబుపై విశ్వాసం కోల్పోయిన నేతలు

హైదరాబాద్, 04 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైలునుంచి బయటకొస్తే రాష్ట్ర రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతాయని పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగనే రాష్ట్రానికి తగిన నాయకుడని నేతలు భావిస్తున్నారని స్పష్టంచేశారు. చంద్రబాబుపై నమ్మకం లేకే సీనీయర్లు టీడీపీని వీడుతున్నారని ఆయన తెలిపారు. అటువంటి వారిపై విమర్శలు తగదని ఆయన ఆ పార్టీ నేతలకు హితవు పలికారు.  వారిని కీచకులు, దుర్మార్గులుగా చూపే ప్రయత్నం మానాలని హితవు పలికారు. టీడీపీ నేతల్లా తాము దిగజారి మాట్లాడదలచుకోలేదని స్పష్టంచేశారు. ఎన్టీరామారావు గారు ఉన్నప్పుడు టీడీపీలో చేరిన నాయకులంతా చంద్రబాబు నమ్మదగిన నాయకుడు కాదని గుర్తించారన్నారు. చంద్రబాబుపై నమ్మకం కోల్పోయినందునే వారంతా తమ పార్టీలో చేరుతున్నారని వివరించారు.

చిత్తూరు జిల్లా కమిటీ అమర్నాధరెడ్డి నుంచి శనివారం శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని కలిసిన దాడి వీరభద్రరావు వరకూ అంతా చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం కోల్పోయారని జూపూడి చెప్పారు. అందువల్లే వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు.

ప్రజాసమస్యలపై ఆసక్తి లేని చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీతో ఆ పార్టీ నేతలు విసిగిపోయారన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిలో వారు నిజాయితీనీ, నిబద్ధతను గమనించారనీ, ఆయనే ప్రజల తరఫున పోరాడగల నాయకునిగా గుర్తించి పార్టీలో చేరుతున్నారని జూపూడి వివరించారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రజల సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో రాజీ పడ్డారని చెబుతూ.. శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన దాడి వీరభద్రరావు ప్రజా సమస్యల ప్రస్తావనలో కానీ, చర్చించడంలో కానీ రాజీపడని విషయం అందరికీ తెలుసన్నారు.

కొంతమంది మధ్యవర్తులు, వ్యాపారవేత్తలతో కూడిన లిమిటెడ్ కంపెనీగా మారిన పార్టీలో నేతలు ఇమడలేకపోతున్నారని జూపూడి అభిప్రాయపడ్డారు. అందుకే వారంతా తమ పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి లేదా మా పార్టీలో చేరే మీ నేతలను విమర్శించడం మానుకోండని ఆయన టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు.

రాజశేఖరరెడ్డిగారి మరణానంతరం దశల వారీగా  51 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలలో టీడీపీ సీట్లు గెలుచుకోవడం మాట పక్కనపెడితే కనీసం డిపాజిట్లు కూడా సంపాదించుకోలేకపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2009 ఎన్నికల తర్వాత టీడీపీ ప్రజా సంక్షేమం పట్టల శ్రద్ధ చూపకపోగా.. ప్రజా వ్యతిరేక చర్యలను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతోందని జూపూడి ధ్వజమెత్తారు.

దళితులపై దాడికి ఖండన
రంగారెడ్డి జిల్లా కీసరలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న దళితులపై దాడి ఘటనను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని జూపూడి తెలిపారు. రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికే రక్షణ కల్పించలేకపోతే మారుమూల ఉన్న వారినెలా కాపాడగలరని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితులపై దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Back to Top