బాబు పాలన చీకటి జమానా: షర్మిల

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా), 17 ఫిబ్రవరి 2013: చంద్రబాబు హయాంలో ప్రజల జీవితాలు చీకటిమయం అయ్యాయని శ్రీమతి షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీటి ప్రాజెక్టులను చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా విస్మరించారని ఆమె దుయ్యబట్టారు. నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌ ఎత్తిపోతల పథకాలను విస్మరించడం వల్లే కృష్ణానది పక్క నుంచే వెళుతున్నా నల్గొండ జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు తలెత్తాయని ఆమె విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి అన్నదాతలంటే అభిమానం అని అందుకే రుణ మాఫీ చేశారన్నారు. తాను హామీ ఇచ్చినట్లుగానే ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేశారని, విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పించారని, ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలని తపించారని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పథకాలు రూపొందించి, అమలు చేశారని చెప్పారు.

‌ప్రజా కంటకంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంట కాగి, పరోక్షంగా ప్రభుత్వం పడిపోకుండా భుజాన మోస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా, కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు తామున్నామంటూ భరోసా ఇచ్చేందుకు వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర 69వ రోజు ఆదివారంనాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో కొనసాగింది. మిర్యాలగూడలో సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరైన వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ఉత్సాహపూరితంగా ప్రసంగించారు. సభకు యువకులు, రైతులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మిర్యాలగూడ పట్టణం జనసంద్రంగా మారింది. శ్రీమతి షర్మిల ప్రసంగం మాటి మాటికీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

సాగర్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను పట్టించుకోని ప్రభుత్వం:
వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పిన కిరణ్‌ ప్రభుత్వం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తోందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. రైతులను ఎక్కడ అడిగినా నీళ్ళు లేవని, కరెంటు లేదని బాధపడుతున్నారని చెప్పారు. నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ వద్ద ఆ నీళ్ళతో దాదాపు రూ.500 కోట్లతో డాక్టర్‌ రాజశేఖరరెడ్డి 50 మెగా వాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని తలపెట్టారన్నారు. ఆయన బ్రతికి ఉండగానే చాల వరకు పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు చేయడానికి కిరణ్‌ ప్రభుత్వానికి మనసు రావడంలేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లా వాసులకైనా కరెంటు కష్టాలు తొలగేవన్నారు. ఏ పల్లెకు వెళ్ళినా, ఏ మహిళను కదిలించినా అమ్మా నీళ్ళు, మంచినీళ్ళు లేవంటున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మేడలు మిద్దెలు అడగడంలేదని, కేవలం తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు కావాలంటున్నారని అన్నారు. మిర్యాలగూడ పక్క నుంచే కృష్ణా పైప్‌లైన్‌ వెళుతోందని, డ్యామ్‌ కూడా పక్కనే ఉందని అయినా స్థానికులకు మంచినీరు దొరకని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం:
కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామని, బిల్లుల కోసం నగలు అమ్ముకోవాల్సి వస్తోందని మహిళలు గగ్గోలు పెడుతున్నారని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. మహిళలను లక్షాధికారులను చేయాలని మహానేత వైయస్‌ కార్యక్రమాలు చేపడితే ఇప్పటి ప్రభుత్వం పావలా వడ్డీ పేరుతో రెండు, మూడు రూపాయల వడ్డీతో నడ్డి విరిచేస్తోందని అన్నారు. మహిళలకు అసలు వడ్డీ లేకుండానే రుణాలిస్తున్నామని కిరణ్‌కుమార్‌ రెడ్డి  అంటున్నారని, అవి మన రాష్ట్ర మహిళలకు ఇవ్వడంలేదన్నారు. ఆయన బంధువులకు ఇచ్చుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. మహిళలు తమ బిడ్డలను స్కూళ్ళకు పంపించకుండా కూలిపనికి తీసుకుపోతున్నారని, అలా బిడ్డను కూలికి తీసుకువెళ్ళాలంటే వారికి ఎంత బాధగా ఉంటుందో ఒక తల్లిగా వారి బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు.

అన్నదాతలంటే ఇంత నిర్లక్ష్యమా?:
రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని శ్రీమతి షర్మిల ఆరోపించారు. వారి కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగిపోయాయని, మద్దతు ధర లేదని, నీళ్ళు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్‌ బిల్లులను రైతుల చేతిలో పెట్టి కట్టాలని ఈ ప్రభుత్వం బలవంతం చేస్తోందని ఆరోపించారు. వారు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే స్టార్టర్లు, మోటార్లను ఎత్తుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తెచ్చుకోవడానికి రైతులు మళ్ళీ రెండు, మూడు రూపాయల వడ్డీకి అప్పులు తేవాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని దుయ్యబట్టారు. ఏ రైతును కదిలించినా ఈ ప్రభుత్వం తీరు కారణంగా తమకు వేలల్లో, లక్షల్లో అప్పులున్నాయని కన్నీరు పెడుతున్నారన్నారు.

కిరణ్‌ చెప్పేవన్నీ అబద్ధాలే:
విద్యార్థుల గురించి మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచన చేశారన్నారు. ప్రతి బిడ్డా తనకు ఇష్టమైన ఉన్నత చదువు చదువుకోవడానికి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు. డబ్బు లేక ఏ విద్యార్థి చదువూ ఆగిపోకూడదని ఆ మహానుభావుడు ఆలోచించారన్నారు. కానీ, ఈ ప్రభుత్వానికి ఆ పెద్దమనసు లేదని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. విద్యార్థుల జీవితాలతో కిరణ్‌ ప్రభుత్వం బేరాలాడుతోందన్నారు. తల్లిదండ్రులకు చదివించే స్తోమతు లేక, ప్రభుత్వం చదివిస్తుందనే భరోసా లేక ఎంతో మంది విద్యార్థులు చదువుకు మధ్యలోనే దూరమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ హయాంలో చదువుకున్న వారు ఇప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. 'చదువుకున్న వారికి కిరణ్‌  కుమార్‌రెడ్డి 35 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆరున్నర లక్ష కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. అవన్నీ దొంగ మాటలే. అన్నీ అబద్ధాలే' అని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

ఇంతలా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దానికి వంత పాడుతున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రక్షణ కవచంలా మారారని దుయ్యబట్టారు. తన మీద ఉన్న అనేక అవినీతి ఆరోపణలపై విచారణ జరపకుండా ఉండేందుకే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నారన్నారు. రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు ఎక్కడ చూసినా హెరిటేజ్‌ దుకాణాలు ఎలా వచ్చాయన్నారు. దేశ విదేశాల్లో వేలాది కోట్ల ఆస్తులున్నాయన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఐఎంజి సంస్థకు రూ. 2,500 కోట్ల విలువైన 850 ఎకరాల భూములను కేవలం రూ. 4 కోట్లకే పదేళ్ళ కిందటే ఇచ్చేశారన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడమంటే ఇదే అన్నారు.

నిజాం సుగర్సును మూసేసిన చంద్రబాబు:
నిజాం సుగర్సు ఒక్క తెలంగాణకే కాదు దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. దాన్ని చంద్రబాబు చిన్న చిన్న ముక్కలు చేసి పంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందులో రూ. 650 కోట్ల విలువైన ఒక భాగాన్ని కేవలం రూ. 60 కోట్లకే తమ పార్టీ ఎంపి. నామా నాగేశ్వరరావుకు ధారాదత్తం చేశారన్నారు. మనసు లేకుండా చంద్రబాబు ఆ ఫ్యాక్టరీని మూసేశారని, వేల మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారన్నారు. ఈ పాపం చంద్రబాబుది కాదా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

చంద్రబాబును మించిన అవినీతిపరుడు మరొకరు లేరని ఎన్టీఆర్‌ అన్నారని, కమ్యూనిస్టులైతే 'చంద్రబాబు జమానా... అవినీతి ఖజానా' అంటూ ఏకంగా ఒక పుస్తకమే వేశారన్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు చక్కగా నడిచే చిత్తూరు డెయిరీని నష్టాల పాలు చేశారని ఆరోపించారు. చిదంబరం లాంటి వాళ్ళని చీకట్లో కలిసి, తన మీద విచారణ రాకుండా చంద్రబాబు మేనేజ్‌ చేసుకున్నారన్నారు. చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసులు పెట్టదని, విచారణ చేయించదని, దానికి ప్రతిఫలంగానే చంద్రబాబు దానిపై అవిశ్వాసం పెట్టరన్నారు. అది వీరి చీకటి ఒప్పందం అని శ్రీమతి షర్మిల విమర్శించారు. పేరుకు మాత్రమే ఇది తుగ్లక్‌ పాలన అంటారని, పనికిరాని ప్రభుత్వం అంటారని, ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదంటారని, కాని ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడే అని ఆమె ఆరోపణలు సంధించారు.

జనహితమే కోరిన మహానేతపై బాబు అభాండాలా?:
మహానేత వైయస్‌ రైతులను వైయస్‌ మోసం చేశారంటూ చంద్రబాబు నాయుడు పాదయాత్రలో నిస్సిగ్గుగా వ్యాఖ్యానించారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేతను పట్టుకుని చంద్రబాబు అలాంటి మాట ఎలా అనగలిగారని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతులను మోసం చేశారా? అన్నారు. రుణాలు మాఫీ చేసి మోసం చేశారా? అని నిలదీశారు. రైతులు పంటకు మద్దతు ధర కల్పించాలని ఆలోచన చేసి, వారిని ప్రేమించి, గౌరవించిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు ప్రవేశపెట్టి వైయస్ మోసం చేశారా? అన్నారు. మహిళలు, రైతులకు పావలా వడ్డీకే రుణాలిచ్చి మోసం చేశారా అని ప్రశ్నించారు. పేదలు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రిలో గొప్ప వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి మోసం చేశారా? అని శ్రీమతి షర్మిల చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలని పథకం పెట్టిన రాజశేఖరరెడ్డి మోసం చేశారా? అని ప్రశ్నించారు.

మోసంలో బాబును మించినవారు లేరు:
చంద్రబాబు పెట్టిన హింసను తట్టుకోలేక 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. మరణించిన వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. మోసం చేయడం వైయస్‌ నైజం కాదన్నారు. మోసం చేయడం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, పదవిని లాక్కున్నది చంద్రబాబే కదా అన్నారు. మంచోళ్ళెవరో, చెడ్డోళ్ళెవరో ప్రజలే తేలుస్తారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి నిద్రపోయిన కారణంగానే కృష్ణా గోదావరి నీళ్ళు దిగువన ఉన్న మనకు రాకుండా పోయాయని ఆరోపించారు. స్వార్థం కోసమే చంద్రబాబు ఎఫ్‌డిఐ బిల్లును పాస్‌ చేయించారని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు కలిసి, కుట్ర పన్ని జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టి నాలుగు గోడల మధ్య బందీని చేశాయన్నారు. కేవలం తమ స్వార్థం కోసం ఈ రెండు పార్టీలూ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో రెండే పార్టీలుండాలన్నది వాటి ఉద్దేశమట అని విమర్శించారు.

కేంద్రం చేతిలో సిబిఐ ఒక కీలుబొమ్మ అని శ్రీమతి షర్మిల ఆరోపించారు. దాన్ని జగనన్న మీద ప్రయోగించారని దుయ్యబట్టారు. లక్షల కోట్ల విలువైన భూములను కారుచౌకగా అమ్మేసినా చంద్రబాబును కనీసం విచారణ కూడా చేయదన్నారు. చిరంజీవి అల్లుడి ఇంటిలో రూ. 70 కోట్లు దొరికినా ఆయనను కూడా విచారించదన్నారు. పిసిసి చీఫ్‌ బొత్స మద్యం డాన్‌ అని కాంగ్రెస్‌వాళ్ళే చెబుతున్నా సిబిఐ ఆయనను విచారణకు రమ్మని సిబిఐ అనదన్నారు.

జగనన్న త్వరలోనే బయటికి వస్తారని, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు. జగనన్న ధైర్యంగానే ఉన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు తనను కాపాడతాయని జగనన్నకు కొండంత ధైర్యం అన్నారు. జగనన్నను ఆశీర్వదించమని ఆమె రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Back to Top