బాబును తక్షణమే అరెస్టు చేయాలి: అంబటి

గుంటూరు : గుంటూరు 'సాక్షి' కార్యాలయంపై తమ పార్టీ కార్యకర్తలు దాడి చేసేలా ఉసిగొల్పిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తక్షణమే అరెస్టు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ‌డిమాండ్‌ చేశారు. చంద్రబాఆబుపై నాన్ బెయిలబు‌ల్ ‌కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరులో ఆయన సోమవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ ‘సాక్షి’ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు, నేతల వలసలను తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో వ్యవహరిస్తున్నారని అంబటి విమర్శించారు. టిడిపి అంతర్గత పోరుపై ‘సాక్షి’లో వస్తున్న కథనాలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. అయితే, ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలు వాస్తవం కాదని చంద్రబాబు నిరూపించగలరా అని అంబటి రాంబాబు సవాల్ చేశారు.

‌చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో చేస్తున్న ప్రసంగాల్లో ‘సాక్షి’ దినపత్రికపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని, తద్వారా ‘సాక్షి’పై దాడులు చేసేలా టిడిపి కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారని అంబటి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల పత్రికగా ఉండి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న ‘సాక్షి’పై చంద్రబాబు తీవ్ర అక్కసు పెంచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎల్లో మీడియా తప్ప మరే ఇతర మీడియా ఉండకూడదనే లక్ష్యంతో ఈ తరహా దాడులను బాబు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.

టిడిపి నీచ, నికృష్ట రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు. ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి చంద్రబాబే ప్రత్యక్ష కారకుడని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో పాటు యాత్రలో ఉండి దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలు, స్థానిక నాయకులను కూడా అరెస్టు చేయాలని అంబటి రాంబాబు అన్నారు.
Back to Top