బాబుకు జనం బాధలు, కన్నీళ్ళు పట్టవు

ఇల్లెందు (ఖమ్మం జిల్లా), 29 ఏప్రిల్‌ 2013: చంద్రబాబు నాయుడు తన కష్టాలను చూ కన్నీళ్ళు పెడతారే గానీ ప్రజల బాధలపై ఆయనకు ఒక్కనాడూ కన్నీళ్ళు రాలేదని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్నాని అన్నారు. ప్రజా కంటకంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ‌ం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పల్లెలు, గిరిజన తండాల్లో సాగింది. ఈ సందర్భంగా ముచ్చెర్లలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె కొద్దిసేపు ప్రసంగించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు.

‘పాదయాత్ర చేస్తున్నప్పుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ‘మీరు చాలా కష్టపడుతున్నారు’ అని ఆయన పార్టీ నేతలెవరో అన్నారట.. అందుకు చంద్రబాబు బదులిస్తూ ‘ అవును చాలా కష్ట పడుతున్నా’ అని చెప్పి కన్నీళ్లు పెట్టారట! ప్రజల కష్టం చూసి ఒక్కసారి కూడా కన్నీళ్లు పెట్టని చంద్రబాబు నాయుడు ఆయన కష్టం చూసి మాత్రం తెగ బాధపడిపోయారట. ఈ చేతగాని ప్రభుత్వాన్ని దింపేయాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అవిశ్వాసం పెడితే.. ‌దానికి మద్దతుగా ఓటు వేయవద్దని చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబుకు ప్రజలపై ప్రేమే ఉంటే అవిశ్వాసానికి మద్దతిచ్చి ఈ‌ అసమర్థ కాంగ్రె‌స్ ప్రభుత్వాన్ని ఏనాడో ఇంటికి సాగనంపేవారు’ అని శ్రీమతి షర్మిల విమర్శించారు.

సరుకుల సంచి ఓ బూటకం :
‘మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే తాను రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నానని ‌ప్రస్తుత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు. మహానేత వైయస్ బతికే ఉంటే ‌ప్రతి కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇచ్చేవారు. కిరణ్‌రెడ్డి 20 కిలోలే ఇస్తున్నారు.‌ మహానేత వైయస్ ఉంటే ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం అదనంగా వచ్చేవి. కిలో రూ. 35 అనుకున్నా.. 10 కిలోల బియ్యానికీ రూ.350 ప్రతినెలా ప్రతి కుటుంబానికీ మిగిలేవి. ఈ సిఎం రూ.2 బియ్యాన్ని రూపాయికి తగ్గించడం వల్ల ఒక్కో కుటుంబానికి ఇప్పుడు మిగులుతున్నది కేవలం రూ.20 మాత్రమే. ఇది చాలదన్నట్లు ఇప్పుడు సరుకుల సంచి పథకంతో ప్రతి కుటుంబానికి రూ. 100 మిగిలిస్తున్నానని కిరణ్ చెప్పుకుంటున్నారు. ఆ సరుకుల ‌సంచి ఒక బూటకం. ఆ పథకం సక్రమంగా అమలు కావడంలేదు. దాన్ని పూర్తిగా అమలు చేసినా కోట్లలోనే ఖర్చవుతుంది. కానీ ఈ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆ పథకాన్ని ప్రారంభించడానికి భారీగా మీటింగులు పెట్టి, ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు’ అని శ్రీమతి షర్మిల విమర్శించారు.

గిరిజనులకు అన్యాయం చేశారు :
‘బయ్యారం గనులను మహానేత వైయస్‌ఆర్ ప్రైవేటు పరం చేయబోతే, తాను విశాఖ ఉక్కుకు ఇచ్చానని  కిర‌ణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. బయ్యారం గనులను మహానేత వైయస్‌ రక్షణ స్టీల్సుకు ఇచ్చినప్పుడు, ఆ గనులు ఎప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎపిఎండిసికే చెందాలని, తెలంగాణలోనే స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పారు. కిరణ్‌రెడ్డి ఇక్కడి ఖనిజాన్ని విశాఖ స్టీల్సుకు తరలిస్తూ ఈ ప్రాంత గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? బయ్యారం గనుల్లోని ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు ఇచ్చానని గొప్పగా చెప్పుకుంటున్న సిఎం కిరణ్ ఒక్కసారి ఈ ప్రాంత గిరిజనుల ముఖం చూసి చెప్పండి వాళ్లకు అన్యాయం చేశారని మీకే తెలుస్తుంది’ అని శ్రీమతి షర్మిల విమర్శించారు.

13.4 కిలోమీటర్ల పాదయాత్ర :
మరో ప్రజాప్రస్థానం 134వ రోజు ఆదివారం శ్రీమతి షర్మిల ఖమ్మం నియోజకవర్గం శివాయగూడెం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మంచుకొండ, బూడిదంపాడు, రాంరెడ్డినగర్, పండితాపురం, ముచ్చెర్ల మీదుగా నడిచారు. ముచ్చెర్ల శివారులో‌ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.25 గంటలకు చేరుకున్నారు. మధ్యలో కాలు నొప్పి వచ్చినా.. దాదాపు 8 కిలోమీటర్లు అలాగే నొప్పిని భరిస్తూ శ్రీమతి షర్మిల నడిచారు. ఆదివారం 13.4 కిలోమీటర్లు యాత్ర చేశారు.
Back to Top