బాబు హోల్‌సేల్‌గా అమ్ముడుపోతే మేలు

దామరచర్ల (నల్గొండ జిల్లా), 19 ఫిబ్రవరి 2013: ఈ ప్రజా కంటక, అసమర్థ ప్రభుత్వాన్ని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. దానికి బదులు చిరంజీవిలాగా హాల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్ముడుపోతే మంచిదని ఆమె సలహా ఇచ్చారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 'చంద్రబాబు‌ పాలన పార్టు - 2' లా ఉందని ఎద్దేవా చేశారు. నల్గొండజిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్లలో మంగళవారం ఉదయం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అటు చంద్రబాబు, ఇటు కిరణ్‌ కుమార్‌రెడ్డిలపై నిప్పులు కురిపించారు.

వ్యవసాయం దండగని, ప్రాజెక్టులు కట్టడం నష్టమని చెప్పిన చంద్రబాబు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన హయాంలో బాధలు పెట్టి, రాష్ట్రంలో 4 వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్, ‌టిడిపిలు కుట్ర పన్ని జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న బయట ఉంటే తమకు భవిష్యత్తే ఉండదని‌ కాంగ్రెస్‌, టిడిపి నాయకులు భయపడ్డారన్నారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే సంఖ్యా బలం టిడిపికి ఉన్నా చంద్రబాబు తన స్వార్థం కోసమే పడగొట్టడం లేదని దుయ్యబట్టారు. ఊరికే ప్రజల మధ్య తిరుగుతూ, కల్లబొల్లి కబుర్లు చెబుతూ డ్రామాలాడడం ఎందుకని చంద్రబాబును శ్రీమతి షర్మిల నిలదీశారు.

ఏ గ్రామాన్ని పలకరించినా కష్టాలే, కన్నీళ్ళే అని, రైతులు, విద్యార్థులు, మహిళలు అందరూ అల్లాడిపోతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకునే తీరిక ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి తాను హైటెక్‌ ముఖ్యమంత్రిని అని చెప్పుకున్న చంద్రబాబు రైతులను అస్సలు పట్టించుకోలేదని, అసలు వ్యవసాయమే దండగ అన్నారని ఆమె గుర్తుచేశారు. ఇప్పటి ప్రభుత్వానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఏమీ తేడా లేదన్నారు. వడ్డీ లేకుండానే రుణాలిస్తామని చెబుతున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాటలన్నీ అబద్ధాలే అని శ్రీమతి షర్మిల విమర్శించారు.

రచ్చబండ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్న అభిమానులు, శ్రేణులు శ్రీమతి షర్మిల ప్రసంగానికి ఆద్యంతం హర్షాతిరేకాలతో మద్దతు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top